Begin typing your search above and press return to search.

మునుగోడులో ఆయనకు ‘‘కొడవలి’’ గాయం?

అంతా బాగుంది.. జంపింగ్ లు చేసి, పార్టీని విమర్శించినా.. కాంగ్రెస్ టికెట్ దక్కింది అనుకుంటున్న సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనూహ్య పరిస్థితి ఎదురవుతోంది.

By:  Tupaki Desk   |   4 Nov 2023 9:34 AM GMT
మునుగోడులో ఆయనకు ‘‘కొడవలి’’ గాయం?
X

రెండు పార్టీల మధ్య రాష్ట్ర స్థాయి పొత్తు ఒక నియోజకవర్గ అభ్యర్థి పాలిట శాపంగా మారనుందా? అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు పార్టీలు మారిన ఆయనకు ఓసారి ఓటమి ఎదురైంది. మరోసారీ గెలుపుపై బెంగ పడేలా పరిస్థితులు మారనున్నాయా? పూర్తి పొత్తు గాక.. పూర్తి పోటీగాక.. కేవలం స్నేహపూర్వక పోటీ అంటూ బరిలో దిగడం ఆయనకు చేటు చేయనుందా? ఇదే నిజమని అనిపిస్తోంది.

పార్టీ మారినా ఫలితం దక్కునా?

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ది ప్రత్యేక స్థానం. అటు జానారెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఎదుర్కొంటూ సొంత వర్గాన్ని నిర్మించుకున్న వీరు.. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఇక మూడేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉండీ లేనట్లు వ్యవహరించిన ధోరణితో అధిష్ఠానం వద్ద పలుకుబడి కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కానీ హోరాహోరీగా సాగిన ఉప ఎన్నికలో 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇటీవల బీజేపీ నుంచి అనూహ్యంగా కాంగ్రెస్ లోకి వచ్చారు. మునుగోడు టికెట్ నూ దక్కించుకున్నారు.

‘‘పొత్తు’’ గుచ్చుకోనుందా?

అంతా బాగుంది.. జంపింగ్ లు చేసి, పార్టీని విమర్శించినా.. కాంగ్రెస్ టికెట్ దక్కింది అనుకుంటున్న సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనూహ్య పరిస్థితి ఎదురవుతోంది. వామపక్ష పార్టీ సీపీఐతో ఎడతెగక సాగిన చర్చలు కొలిక్కిరావడం రాజగోపాల్ రెడ్డికి తలనొప్పి తెచ్చేలా ఉంది. మునుగోడులో వామపక్షాలు మఉక్యంగా సంస్థాగతంగా సీపీఐ చాలా బలంగా ఉంది. అది ఎంతగా అంటే.. సంవత్సరాల పాటు దూరం పెట్టిన వామపక్షాలను గత ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు పిలిచిమరీ గౌరవించారు. సీపీఐ సాయం అభ్యర్థించి మునుగోడు గండం గట్టెక్కారు. ఈ నియోజకవర్గంలో ఎటుతిరిగి వామపక్షాలకు 30 వేలపైగా ఓట్లు ఉంటాయని చెబుతున్నారు. ఇవి ఏ పార్టీ గెలుపునకు అయినా కీలకమేనని చెప్పాల్సిన పనిలేదు.

మరి ఇప్పుడెలా?

మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి.. స్నేహపూర్వక పోటీతో సీపీఐ ఝలక్ ఇచ్చేలా కనిపిస్తోంది. ఎందుకంటే..కాంగ్రెస్ తో శనివారం కుదిరిన పొత్తులో సీపీఐకి ఒక సీటు (కొత్తగూడెం) దక్కింది. ఎన్నికల అనంతరం ఎమ్మెల్సీ స్ధానం ఇవ్వనున్నారు. మునుగోడులో మాత్రం సీపీఐ స్నేహపూర్వక పోటీకి దిగనుంది. అదే జరిగితే.. గనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గండం తప్పదు. అసలే.. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగొచ్చిన ఆయనకు.. పార్టీని ఏమీ అనలేని పరిస్థితి. అటు సీపీఐ అవసరం కూడా ఆ పార్టీకి ఉంది. జాతీయ స్థాయిలోనూ సీపీఐ ఇండియా కూటమిలో భాగం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం కొత్త ఎత్తులు అనుసరించాల్సేందే. బీఆర్ఎస్ ను తట్టుకుంటూ విజయం సాధించాలంటే ఆయన శ్రమించాల్సిందే.