చంద్రబాబు మాటలో బాటలో దగ్గుబాటి...!?
అలా ఆయన కుమారుడిగా ఎన్టీయార్ అల్లుడిగా తనకు ఇష్టం లేని రాజకీయాల్లోకి దగ్గుబాటి వచ్చారు.
By: Tupaki Desk | 26 Dec 2023 2:30 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబుకు తోడల్లుడుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ తరానికి ఎంతమందికి తెలుసో ఏమో కానీ ఈ ఇద్దరూ పోటాపోటీగా తెలుగుదేశం పార్టీలో ఎన్టీయార్ హయాంలో నిలిచారు. ఎన్టీయార్ కి పెద్దల్లుడు దగ్గుబాటి టీడీపీ పునాది రాయి నుంచి ఉన్నారు. ఎన్టీయార్ పార్టీ పెడతాను అంటే ఆయన వెంట మొదట వచ్చింది దగ్గుబాటే.
దానికి మరో కారణం ఉంది. దగ్గుబాటి తండ్రి చెంచురామయ్యకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. ఆయన కాంగ్రెస్ లో ఉండేవారు అని చెబుతారు. అలా ఆయన కుమారుడిగా ఎన్టీయార్ అల్లుడిగా తనకు ఇష్టం లేని రాజకీయాల్లోకి దగ్గుబాటి వచ్చారు. అలా వచ్చిన దగ్గుబాటి కంటే వెనక వచ్చిన చిన్నల్లుడు చంద్రబాబు టీడీపీలో చాలా సార్లు పై చేయి సాధించారు.
అయినా సరే ఎన్టీయార్ ఈ ఇద్దరు అల్లుళ్ళను సమానంగానే చూసుకున్నారు. చంద్రబాబు పోటీ చేయని కాలంలో ఆయనకు పార్టీ పదవి ఇచ్చి పెద్దల్లుడు దగ్గుబాటిని మంత్రిని చేశారు ఎన్టీయార్. అలా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. ఇక 1989లో ఓటమి తరువాత సీన్ మారింది. దగ్గుబాటి ఎంపీగా ఢిల్లీకి షిఫ్ట్ అయితే చంద్రబాబు ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున ఫస్ట్ టైం గెలిచి శాసనసభా పక్ష ఉప నేతగా కీలక రోల్ ప్లే చేశారు.
ఆ మధ్యలో అసెంబ్లీకి నేను రాను అని ఎన్టీయార్ భీషణ ప్రతిన చేస్తే మిగిలిన కాలం మొత్తం టీడీపీ పక్షాన్ని నడిపించి ఆనాడే ఎమ్మెల్యేలలో గ్రిప్ సంపాదించారు. ఇవన్నీ ఇల్లా ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా ఉండేవారు. డాక్టర్ వర్గం. బాబు వర్గం అని నాడు టీడీపీ వర్టికల్ గా చీలిన సందర్భం ఉంది.
అలాంటి చీలికను ఏకం చేసిన ఘనత లక్ష్మీపార్వతిదే అంటారు. ఆమె వల్ల ఇద్దరు తోడల్లుళ్ళూ చేతులు కలిపారు. అయితే నాడు ప్రామిస్ ప్రకారం దగ్గుబాటి ఉప ముఖ్యమంత్రి కావాలి. కానీ అది ఇవ్వలేదు. దాంతో బాబు నుంచి విడిపోయారు దగ్గుబాటి.
ఆయన ఎన్నో పార్టీలు తిరిగి వైసీపీలో కూడా 2019లో చేరి ఎమ్మెల్యేగా పర్చూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఇక వైసీపీతో ఆయన ఒక దశలో దెగదెంపులు చేసుకున్నారు. అది ఎందుకు ఏమిటి అన్నది ఆయన బయటకు ఎక్కడా చెప్పలేదు.
కానీ తాజాగా ఆయన మనసు బయటపెట్టారు. పర్చూరులో తాను ఓటమి పాలు కావడం ఈ రోజుకు మంచిదే అని అన్నారు. తాను నాడు గెలిచి ఉంటే జనం ముందు తలెత్తుకుని తిరిగే వాడిని కాను అన్నారు. రోడ్లు బాగా లేవు అని ప్రజలే తనను నిలదీసేవారు అని వైసీపీ ప్రభుత్వం మీద హాట్ కామెంట్స్ చేశారు.
అందుకే తాను ఓటమి చెందడం భగవంతుడు ఇచ్చిన అవకాశం అన్నారు. ఇక తాను ఓడాక తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తాను అని జగన్ మాట ఇచ్చినా అదీ జరగలేదని మరో విమర్శ చేశారు. తన సతీమణి కాంగ్రెస్ లో కేంద్ర మంత్రి చేసి బీజేపీలో చేరడం కూడా తమను ఇష్టం లేదని, కానీ బలవంతంగా చేరాల్సి వచ్చింది అని అన్నారు.
కారంచేడులో తన అనుచరులతో మాట్లాడుతూ దగ్గుబాటి ఈ కామెంట్స్ చేశారు. ఆయన మాటలు అన్నీ చంద్రబాబు మాటలు గానే ఉన్నాయని అంటున్నారు. వైసీపీ హయాంలో అభివృద్ధి లేదని బాబు పదే పదే అంటూ వచ్చారు ఇపుడు తోడల్లుడు కూడా అదే మాట అంటున్నారు. మరి బాబు బాటన దగ్గుబాటి నడుస్తారా అంటే దానికి కాలమే జవాబు చెప్పాలి.
అయితే దగ్గుబాటి కుటుంబపరంగా చంద్రబాబుతో సఖ్యతతో ఉంటున్నారు. కుటుంబ కార్యక్రమాలకు తోడల్లుళు ఇద్దరూ అటెండ్ అయి మాట్లాడుకుంటున్నారు. మరి దగ్గుబాటి కుమారుడు హితైష్ రాజకీయ భవిష్యత్తు కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అది టీడీపీతో సాకారం అవుతుందా అంటే వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా జగన్ పార్టీ మీద మొదటిసారి దగ్గుబాటి పెదవి విప్పి అనాల్సినవి అనేశారు.