తెలంగాణకు అన్ని కోట్ల అప్పా? భట్టీ శ్వేతపత్రంలో ఆసక్తికర లెక్కలు!
ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి 42 పేజీల శ్వేత పత్రం రిలీజ్ చేసి, సభ్యులకు అందజేసి ప్రసంగించారు.
By: Tupaki Desk | 20 Dec 2023 8:20 AM GMT'తొలి, మలి ఉద్యమంలో వందలాది మంది త్యాగాలు, కోట్లాది మంది ఆశలతో సాధించుకున్న తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ బ్రస్టు పట్టించింది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో వనరులను సక్రమంగా వాడుకొని ఉంటే నేడు తెలంగాణ ఇలా ఉండేది కాదు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ నేడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీనికి కారణం ఎవరు?’ అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 'ఇదా త్యాగాలపై ఏర్పడిన తెలంగాణ.. ఇదా కోట్లాది మంది ఆశల తెలంగాణ’ అంటూ బీఆర్ఎస్ పార్టీని పరోక్షంగా నిలదీశారు.
తెలంగాణ శాసన సభ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి 42 పేజీల శ్వేత పత్రం రిలీజ్ చేసి, సభ్యులకు అందజేసి ప్రసంగించారు. 'తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయని ప్రతీ ఒక్క తెలంగాణ పౌరుడు కలలు కన్నారు. కానీ నేడు జరిగింది వేరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సరైన విధంగా వనరులను వినియోగించుకుంటే బాగుండేది. నేడు పరిస్థితి ఎలా ఉందంటే.. రోజు వారి ఖర్చులకు ఓడీ (ఓవర్ డ్రాఫ్ట్) తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని దురదృష్టంగా భావిస్తున్నా. దశాబ్ధంగా జరిగిన ఆర్థిక పరమైన తప్పులు ప్రజలకు తెలియాలి. ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగానే అధిగమిస్తాం. ఈ దిశలో శ్వేతపత్రం మొదటి అడుగుగా భావిస్తున్నాం’ అని భట్టీ అన్నారు.
సమావేశాలు ప్రారంభం కాగానే.. మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సభ్యులు సంతాపం తెలిపారు. ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా అక్బరుద్దీన్ ఒవైసీని, సీపీఐ శాసనసభా పక్ష నేతగా కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్ ప్రకటించారు.
నివేదికను చదివే టైం కూడా ఇవ్వరా
శ్వేతపత్రం అందరజేసిన తర్వాత డిప్యూటీ సీఎం తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. దీంతో హరీశ్ రావు కలుగజేసుకొని '42 పేజీల పుస్తకం మా చేతిలో పెట్టారు. కనీసం చూడును కూడా చూడలేదు. వెంటనే మాట్లాడాలంటే ఎలా కుదురుతుంది? చదివేందుకు కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత మాట్లాడితే బాగుండేది. ముందు రోజు ఇస్తే మరింత బాగుండేది. ప్రభుత్వం ఇచ్చే సమాధానం మాకు నచ్చకుంటే నిరసన తెలిపే అవకాశం
తమకు ఉంది. సభను హుందాగా నడిపేందుకు తమ పార్టీ సహకరిస్తుంది.’ అని హరీశ్ రావు అన్నారు. అనంతరం సభను స్పీకర్ అరగంట పాటు వాయిదా వేశారు.
శ్వేతపత్రంలోని ఏముందంటే?
*తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పులు ₹6,71,757 కోట్లు.
*2014-15 నాటికి రుణం ₹72,658 కోట్లు.
*2014-15 నుంచి 2022-23 కాలంలో సగటున 24.5 శాతం పెరిగిన అప్పు.
*2023-24 అంచనాల ప్రకారం రుణం ₹3,89,673 కోట్లు.
*2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం.
*2023- 24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ శాతం.
*బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20 శాతం తేడా.
*57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి ₹4.98 లక్షల కోట్ల వ్యయం.
*రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం.
*రెవెన్యూ రాబడిలో 34 శాతానికి చేరిన రుణ చెల్లింపుల భారం
*రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాల కోసం 35 శాతం ఖర్చు.
*రోజూ వేస్ అండ్ మీన్స్‌పై ఆధారపడాల్సిన దుస్థితి
*2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. 2023 వరకు అప్పుల్లో కూరుకుపోయింది.
*బడ్జెటేతర రుణాలు పేరుకుపోయి అప్పుల ఊబిలో తెలంగాణ