Begin typing your search above and press return to search.

ఈ భార్య గుండెలు తీసిన బంటే.. ఇదిగో ఇదే ఆధారం!

ఇప్పుడు చాలాచోట్ల భర్తతోపాటు భార్యలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Jun 2024 4:30 PM GMT
ఈ భార్య గుండెలు తీసిన బంటే.. ఇదిగో ఇదే ఆధారం!
X

ఇప్పుడు చాలాచోట్ల భర్తతోపాటు భార్యలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక్క ఆదాయ విషయమనే కాకుండా కెరీర్‌ గోల్స్, తమకు ఒక గుర్తింపు, తమ ఖర్చులకు తామే సంపాదించుకోవడం, ఆర్థిక స్వాతంత్య్రం, వ్యక్తిగత స్వేచ్ఛ తదితర కారణాలతో మహిళలు ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నారు.

అయితే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగులు అయితే పిల్లలను చూసుకోవడం కష్టంగా మారుతోంది. ఈ విషయంలోనూ మహిళలే తమ ఉద్యోగాలను విడిచిపెట్టి మళ్లీ ఇంటికి పరిమితమవ్వాల్సి వస్తోంది. ఉద్యోగం పురుష లక్షణం.. పిల్లలను పెంచడం ఆడవాళ్ల బాధ్యతన్నట్టు మహిళలకు పిల్లల పెంపకం తప్పడం లేదు.

ఇప్పుడు ఇలాగే ఉద్యోగం చేస్తున్న తన భార్యను భర్త ఉద్యోగం మానేయమన్నాడు. ఇంట్లో పిల్లలను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ఆ భార్య తన భర్త చెప్పినదానికి అంగీకారం తెలిపింది. అయితే ఇందుకు ఒక కండీషన్‌ పెట్టింది. భర్త కంపెనీలో తనకు సగం వాటా ఇవ్వాలని కోరింది.

ఈ మేరకు ఆమె రెడిట్‌ లో పెట్టిన పోస్టు వైరల్‌ అవుతోంది. ఆమె పోస్టు ఇలా ఉంది.. ‘నాకు వివాహమై ఆరేళ్లు అయ్యింది. ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మళ్లీ నేను గర్భం దాల్చాను. ఈ క్రమంలో ఉద్యోగం మానేసి పిల్లలను చూసుకోవాలని నా భర్త కోరారు. దీనికి చాలా బాధపడ్డాను. నేనెంతో కష్టపడి ఉద్యోగం సాధించాను. ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరైతే కానీ ఈ ఉద్యోగం దక్కించుకోలేకపోయాను. అయితే పిల్లలను చూసుకోవడానికి ఎంతో కష్టపడి సాధించిన ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాను’’

‘‘అయితే భవిష్యత్తులో నా భర్తతో ఏదైనా ఇబ్బంది తలెత్తి మేము విడిపోయే పరిస్థితి వస్తే నాకు ఆర్థికంగా ఎలాంటి ఆధారం ఉండదు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. నా భర్త తన కంపెనీ సగం వాటాను నా పేరున రాసిస్తే ఉద్యోగం మానేస్తానని ఆయనకు చెప్పాను. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌ కు చెబితే వారంతా నా భర్త మాదిరిగానే నివ్వెరపోయారు. నీకేమైనా పిచ్చి పట్టిందా అని తిట్టారు. ఈ నేపథ్యంలో నాకు మీరు సరైన సలహా ఇస్తారని ఆశిస్తున్నాను. నా నిర్ణయంలో ఏమైనా తప్పుందా? నేను ఇలా ఆలోచించడం కరెక్టో, కాదో చెప్పాలని మిమ్మల్ని కోరుతున్నాను’’ అంటూ ఆమె రెడిట్‌ లో పోస్టు చేశారు.

ఆమె పోస్టుపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. కొందరు ఆమె తీసుకున్న నిర్ణయం సరైనదేనని మద్దతు ఇచ్చారు. మరికొంతమంది పిల్లల బాధ్యతలను చూసుకోవాలని భర్త అనడం తప్పెలా అవుతుందని నిలదీశారు. ఏ మహిళకైనా ముందు బిడ్డల పెంపకానికే ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు సూచించారు.

ఇంకొందరు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. ఆమెకు కూడా ఆర్థిక భరోసా ఉండాలన్నారు. ఆమె ఉద్యోగం మానేస్తే ఆమెకు ఎలాంటి ఆర్థిక స్వాతంత్య్రం ఉండదు కాబట్టి.. అందుకోసం భర్త కంపెనీలో వాటా కోరడంలో ఎలాంటి తప్పూ లేదన్నారు.

కాగా ఉద్యోగం మానేయడానికి తన భార్య పెట్టిన కండీషన్‌ కు ఆమె భర్త అంగీకరించారు. ఆయన కంపెనీలో 49 శాతం వాటాను ఆమె పేరుతో రాశారు. ఈ నేపథ్యంలో తనకు మద్దతు ఇస్తూ పలు సూచనలు, సలహాలు ఇచ్చిన నెటిజన్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రెడిట్‌ లో మరో పోస్టు చేశారు.