Begin typing your search above and press return to search.

వికృత పోస్టులు పెట్టాడని ఇంటూరి రవి అరెస్టు.. కట్ చేస్తే?

విశాఖపట్నానికి చెందిన ఇంటూరి రవిపైనా.. ఆయన పెట్టే పోస్టుల మీద తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

By:  Tupaki Desk   |   22 Oct 2024 4:29 AM GMT
వికృత పోస్టులు పెట్టాడని ఇంటూరి రవి అరెస్టు.. కట్ చేస్తే?
X

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ మంత్రి నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టటం.. వారి ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసేలా కార్టూన్లను పోస్టు చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపించే ఇంటూరి రవికిరణ్ ను కృష్ణ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నానికి చెందిన ఇంటూరి రవిపైనా.. ఆయన పెట్టే పోస్టుల మీద తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీ మీడియా కన్వీనర్ నిర్మల ఇతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అసభ్య పదజాలంతో అసహ్యమైన కార్టూన్లను క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నట్లుగా నిర్మల తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. జగుప్సాకర పోస్టులతో నేతల ఫోటోలను అవమానకరంగా మార్ఫింగ్ చేసి శునకానందం పొందుతున్నాడని.. అతడిపై చర్యలు తీసుకోవాలని ఆమె గుడివాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. అతడ్ని విశాఖపట్నంలో అదుపులోకి తీసుకున్నారు.

ఇతడి అరెస్టు నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని.. మాజీ ఎమ్మెల్యే కైలే అనీల్ కుమార్ లు రవికిరణ్ ను పరామర్శించేందుకు వెళ్లగా.. జనసైనికులు.. టీడీపీ కార్యకర్తలు తీవ్ర నిరసన చేశారు. ఇదిలాఉండగా.. తాజాగా అతన్ని కోర్టుకు హాజరుపర్చారు. ఈ సందర్భంగా అనిల్ తరఫు న్యాయవాదులు బెయిల్ కోసం దరఖాస్తు చేయటం.. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం రవికిరణ్ కు రూ.10వేల నగదు.. ఇద్దరు పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేశారు. దీంతో.. అతడి మీద చేసిన ఆరోపణలు అవసరానికి మించినట్లుగా ఉన్నట్లుగా భావిస్తున్నారు.