క్లైమాక్స్ కు చేరుకున్న కాళేశ్వరంపై కమిషన్ విచారణ
ఇంజనీరింగ్ అధికారులు, ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ప్రతినిధులను విచారించిన కమిషన్ త్వరలో అప్పటి ప్రభుత్వ పెద్దలను విచారించనుందంటున్నారు.
By: Tupaki Desk | 23 Jan 2025 9:09 AM GMTతెలంగాణ రాజకీయాన్ని సమూలంగా మార్చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ చంద్ర ఘోష్ కమిషన్ విచారణ క్లైమాక్స్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురిని విచారించిన కమిషన్ 208 పేజీలతో నివేదిక రెడీ చేసిందని, తాజాగా మరికొందరిని విచారించి మార్చిలోగా తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించనుందని సమాచారం. ఇంజనీరింగ్ అధికారులు, ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ప్రతినిధులను విచారించిన కమిషన్ త్వరలో అప్పటి ప్రభుత్వ పెద్దలను విచారించనుందంటున్నారు. ఆర్థిక మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్, హరీశ్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులను కమిషన్ విచారించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండగా, విచారణకు నేతలు హాజరవుతారా? లేదా? అన్నది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రచారం జరిగింది. 2023 ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టే ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ఈ ప్రాజెక్టు నిర్మించి తెలంగాణను సస్యశామలం చేశామని బీఆర్ఎస్ చెప్పుకుంది. సాగు, తాగునీరు సమస్యలు లేని తెలంగాణను ఆవిష్కరించామని చాటుకుంది. అయితే ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి చోటుచేసుకుందని విపక్షాలు ఆరోపించాయి. ఎన్నికల్లో ఈ అంశం బాగా ప్రభావం చూపి బీఆర్ఎస్ ఓటమికి దారితీసింది. కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వెంటనే కాళేశ్వరంపై విచారణకు ఆదేశించింది. నివేదిక సమర్పించేందుకు రెండు నెలల సమయం ఇచ్చింది. అయితే విచారణకు తొమ్మిది నెలల గడువు తీసుకున్న కమిషన్ మార్చిలో నివేదిక సమర్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తాజా సమాచారం.
సంక్రాంతి సెలవుల తర్వాత మళ్లీ విచారణ ప్రక్రియ స్టార్ట్ కావడంతో తెలంగాణలో మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది. బుధవారం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ ను కమిషన్ విచారించింది. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణ సంస్థలైన మేఘా, నవయుగ, ఎల్ అండ్ టీ సంస్థల ప్రతినిధులకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే మాజీ ఆర్థిక మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావులను విచారిస్తారని అంటున్నారు.
ఏడేళ్లుగా హాట్ టాపిక్ అవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ విచారణకు ఆదేశిస్తూ గతేడాది మార్చి 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండున్నర నెలల్లో అంటే జూన్ 30లోగా విచారణ పూర్తి చేయాలని అప్పట్లో ఆదేశించింది. కానీ అనేక అంశాలు ముడిపడి ఉండటంతో సకాలంలో విచారణ పూర్తి కాలేదు. దీంతో నాలుగు సార్లు విచారణ కమిషన్ గడువును పొడిగిస్తూ వచ్చారు. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉన్న ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లతో పాటు ఈఎన్సీలను విచారించింది కమిషన్. పబ్లిక్ హియరింగ్‌లో భాగంగా టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం, వెదెరె శ్రీరాం వంటి వారి నుంచి కూడా సమాచారం తీసుకుంది. ఈ మధ్య కాలంలో ఐఏఎస్‌లు స్మితాసభర్వాల్, రామకృష్ణారావు, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, ఎస్కే జోషిని కూడా వివరాలు అడిగి తెలుసుకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యం ఉన్న అందరి విచారణ ముగియడంతో ఇక ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని కమిషన్ చూస్తోంది.
కాళేశ్వరం విచారణలో భాగంగా వివిధ దశల్లో భాగంగా సమగ్ర సమాచారాన్ని కమిషన్ సేకరించింది. ప్రజాకోర్టుల ద్వారా విచారణ చేయడంతో పాటు అఫిడవిట్ల నుంచి సమాచారం సేకరించింది కమిషన్. ఇక పొలిటికల్ లీడర్లపై ఫోకస్ చేయాలని చూస్తోంది. ఇప్పటివరకు అధికారుల ఇచ్చిన సమగ్ర సమాచారాన్ని పూర్తిస్థాయిలో స్టడీ చేసి.. నెక్ట్స్ స్టెప్‌లో భాగంగా పొలిటికల్ లీడర్లను విచారణ చేయాలని చూస్తోంది. కమిషన్ విచారణ గడువును ఇప్పటికే నాలుగు సార్లు పొడగించిన నేపథ్యంలో.. ఇక ఫైనల్‌గా మార్చి లోగా విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాలని భావిస్తోంది. అందుకే విచారణ కమిషన్ తన ప్రక్రియను మరింత స్పీడప్ చేయనుంది.0
ఈ నెల 21 నుంచి క్రాస్ ఎగ్జామినేషన్‌ను ప్రారంభించిన కమిషన్ ఫినిషింగ్ టచ్‌లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌తో సహా మాజీ మంత్రులను కూడా విచారించాలని జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీశ్‌రావును విచారిస్తేనే క్లారిటీ వస్తుందని కమిషన్ భావిస్తోందంటున్నారు. కమిషన్‌కు తమ వివరణ ఇచ్చిన ఇంజనీర్లు, స్మితాసభర్వాల్ వంటి ఐఏఎస్‌లు కూడా ఈ వ్యవహారం అంతా మంత్రులు, సీఎం స్థాయిలో జరిగిందని చెప్పారని సమాచారం. వారు చెప్పిన వివరాలను ముందుపెట్టి ఈ ముగ్గురు నేతల నుంచి సమాచారాన్ని సేకరించాలని కమిషన్ ఆలోచిస్తుందట. ఈ ప్రక్రియను కూడా వచ్చే నెలాఖరులోపు పూర్తి చేసి డిటేయిల్డ్ రిపోర్టును మార్చిలో ప్రభుత్వానికి ఇవ్వాలని పినాకిని చంద్రఘోష్ కమిషన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.