వివేకా హత్య కేసులో సాక్షుల అనుమానాస్పద మృతిపై విచారణ : ఎస్పీ
వీరి మరణాలు ఒకే తరహా కారణాలతో సంభవించాయంటూ ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 7 March 2025 12:32 PM ISTవైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక సాక్షులుగా ఉన్న నలుగురు అనుమానాస్పద రీతిలో మరణించడంతో పోలీసులు ఈ విషయాన్ని దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వైఎస్‌ఆర్ కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. ఇప్పటివరకు శ్రీనివాసులరెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, వాచ్‌మెన్ రంగన్న మృతి చెందారని గుర్తు చేశారు. వీరి మరణాలు ఒకే తరహా కారణాలతో సంభవించాయంటూ ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, “సాక్షుల మరణానికి ఆరోగ్య సమస్యలే కారణమా, లేక ఇతర ప్రమాదకర పరిస్థితుల ప్రభావమా?” అనే కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా, వారి ఆరోగ్య స్థితిని విశ్లేషించడం, కుటుంబ సభ్యుల ద్వారా మరణంపై వివరాలను సేకరించడం, మృతులకు వెనుక ఉన్న అసలు కారణాలను కనుగొనడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
వివేకా హత్యకేసులో రంగన్న కీలక సాక్షిగా ఉన్నాడని, అతని మరణం అనుమానాస్పదంగా ఉండటంతో దర్యాప్తును మరింత లోతుగా కొనసాగిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఇప్పటివరకు చనిపోయిన నలుగురి మరణాలకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ జరిపి నిజాన్ని బహిర్గతం చేస్తామని స్పష్టం చేశారు.
ప్రతి సాక్షి మృతి చెందిన ప్రతిసారీ పోలీసులపై, సీబీఐపై నెపం వేయడం పరిపాటిగా మారిందని ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. అయితే, ఈ అనుమానాస్పద మరణాలపై డీఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ బృందం సాక్షుల మరణాలపై విస్తృతంగా పరిశీలన జరిపి, అన్ని కోణాల్లో దర్యాఫ్తును కొనసాగిస్తోంది. ముఖ్యంగా, ఏవైనా కొత్త ఆధారాలు లభిస్తాయా అనే దిశగా ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.