Begin typing your search above and press return to search.

బాబు కేసుల విచారణ... మూడు కోర్టుల్లోనూ తాజా పరిస్థితి ఇదే!

ఈ సమయంలో చంద్రబాబు ఎస్‌.ఎల్‌.పీ విచారణపై సుప్రీంకోర్టు తాజాగా నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   26 Sep 2023 6:33 AM GMT
బాబు కేసుల విచారణ... మూడు కోర్టుల్లోనూ తాజా పరిస్థితి ఇదే!
X

ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన కేసుల విచారణలో జాప్యం జరుగుతుంది! తనపై సీఐడీ దాఖలు చేసిన కేసును, రిమాండ్ ను క్వాష్ చేయాలని కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ మేరకు చంద్రబాబు తరుపున సుప్రీం లో దాఖలు చేసిన స్పెషల్ లీవి పిటిషన్ పై అత్యవసరణ విచారణ కోరుతూ సిద్ధార్ధ్ లూథ్రా సోమవారం సీజేఐ చంద్రచూడ్ వద్ద ప్రస్తావించారు. దీంతో ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగాల్సి ఉంది. మరోపక్క ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్ తో పాటు అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో బెయిల్ పిటిషన్ పైనా విచారణ జరగాల్సి ఉంది.

ఇదే సమయంలో అంగళ్లు అల్లర్లకు సంబంధించిన కేసులోనూ చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ పై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టనుంది. అయితే... విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ బాబు పిటిషన్లు జరిగే పరిస్ధితి లేదని తెలుస్తుంది. ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి జస్టిస్ హిమబిందు ఇవాళ ఒక్కరోజు సెలవు పెట్టారని సమాచారం.

ఇదే సమయంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ, ఏపీ ఫైబర్ నెట్ అక్రమాల కేసుల్లోనూ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ పిటిషన్లపైనా విచారణలు వాయిదా పడినట్లే భావిస్తున్నారు.

ఇక సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ విషయానికొస్తే... సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ భేటీ కాబోతోంది. ఈ నేపథ్యంలో మిగతా కేసుల్ని రిజిస్ట్రీ ఇవాళ లిస్ట్ చేయలేదు. ఈ సమయంలో చంద్రబాబు ఎస్‌.ఎల్‌.పీ విచారణపై సుప్రీంకోర్టు తాజాగా నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. పిటిషన్‌ ను రేపు విచారించేందుకు సీజేఐ అంగీకారం తెలిపారని అంటున్నారు.

అయితే... ఏ బెంచ్‌ ముందుకు వస్తుందో సాయంత్రానికి వెల్లడయ్యే అవకాశం ఉంది! మరోవైపు ఎల్లుండి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. రేపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంలో విచారణ జరగని పక్షంలో... అక్టోబర్ 3వ తేదీ వరకూ ఎదురుచూడాల్సి రావొచ్చు. కాగా... ప్రస్తుతం అక్టోబర్ 5 వరకూ చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపబడిన సంగతి తెలిసిందే.