ఐ ప్యాక్.. అప్పుడేమో బెస్ట్.. ఇప్పుడేమో వేస్ట్!
అనుకూలమైనప్పుడు ఒకలాగా.. పరిస్థితులు కలిసి రానప్పుడు మరొకలాగా మాట్లాడే వాళ్లు చాలా మందే ఉంటారు.
By: Tupaki Desk | 9 Jun 2024 12:24 PM GMTఅనుకూలమైనప్పుడు ఒకలాగా.. పరిస్థితులు కలిసి రానప్పుడు మరొకలాగా మాట్లాడే వాళ్లు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులది ఇదే నైజం అనడంలో సందేహం లేదు. గెలిచినప్పుడు ఒకలా మాట్లాడే నేతలు ఓడిపోయినప్పుడు మరొకలా మాట్లాడతారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ నేతలు కూడా ఇదే చేస్తున్నారు. ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేక ఫ్రస్టేషన్ చూపిస్తున్నారు. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. తాజాగా ఐప్యాక్‌పై మాజీ మంత్రి కొట్టు సత్యనారాయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఓడిపోవడానికి ఐ ప్యాక్ కూడా ఓ ప్రధాన కారణమని అన్నారు.
ఇదే ఐ ప్యాక్‌ను గతంలో వైసీపీ నెత్తిన పెట్టుకుంది. 2019 ఎన్నికల్లో వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వైసీపీ కోసం పని చేశారు. జగన్‌ను సీఎం చేసేందుకు కష్టపడ్డారు. అప్పుడు ఆయన నేతృత్వంలో ఐ ప్యాక్ సంస్థ పని చేసింది. ఆ ఎన్నికల్లో వైసీపీ అద్భుత విజయం సాధించింది. దీంతో ప్రశాంత్ కిశోర్‌పై, ఐ ప్యాక్‌పై వైసీపీ నేతలు ప్రశంసలు కురిపించారు. కానీ కొన్ని రోజుల తర్వాత జగన్‌కు ప్రశాంత్ కిశోర్ దూరమయ్యారు. కానీ ఐ ప్యాక్ మాత్రం జగన్ కోసం పని చేయడాన్ని కొనసాగించింది. ఈ ఎన్నికల్లోనూ వైసీపీ గెలుపు కోసం ఐ ప్యాక్ తీవ్రంగా కష్టపడింది.
పోలింగ్ ముగిసిన తర్వాత జగన్ స్వయంగా ఐ ప్యాక్ ఆఫీస్‌కు వెళ్లి మరీ అక్కడి ఉద్యోగులను అభినందించారు. కానీ తీరా ఫలితాల తర్వాత వైసీపీ నేతల మాట మారిపోయింది. వైసీపీ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఐ ప్యాక్ ఓ ప్రధాన కారణమని కొట్టు సత్యనారాయణ అంటున్నారు. ఐ ప్యాక్ ఓ పనికిమాలిన సంస్థ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందులో రాజకీయాలకు పనికిరాని డిగ్రీలు చదివినవాళ్లు తమ పబ్బం గడుపుకున్నారని, వాళ్లను నమ్మి కార్యకర్తలు, నాయకులను జగన్ దూరం పెట్టారని కొట్టు మండిపడ్డారు. ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి ఐ ప్యాక్ టీమ్‌నే జగన్ నమ్ముకున్నారని, అందుకే పార్టీ ఓడిందని కొట్టు తెలిపారు. అయితే ప్రజాగ్రహమే ఎన్నికల్లో ఓటమికి కారణమైనా.. అది పట్టించుకోకుండా ఐప్యాక్‌పై నింద మోపడం ఏమిటన్నది జనాల ప్రశ్న.