Begin typing your search above and press return to search.

బంధానికి బీటలు... ఐ-ప్యాక్ ప్యాకప్ ఫ్రం ఏపీ?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం వైసీపీ శ్రేణులు చాలా మంది "ఐ-ప్యాక్" (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) పై పడిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Jun 2024 9:40 AM GMT
బంధానికి బీటలు... ఐ-ప్యాక్  ప్యాకప్  ఫ్రం ఏపీ?
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం వైసీపీ శ్రేణులు చాలా మంది "ఐ-ప్యాక్" (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) పై పడిన సంగతి తెలిసిందే. చాలామంది నెటిజన్లు, పలువురు వైసీపీ శ్రేణులూ వైఎస్ జగన్ ను ఐ-ప్యాక్ మోసం చేసిందని ఒకరంటే.. ఐప్యాక్ అంటే కట్టప్ప అని ఇంకొందమంది వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఏపీ నుంచి వారి నిష్క్రమణ మొదలైందని తెలుస్తుంది.

అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్న సమయంలో "ఐ-ప్యాక్" పేరు ప్రముఖంగా వినిపిస్తుందని అంటున్నారు. అయితే.. ఫలితాలు వెలువడిన కొన్ని గంటల్లోనే ఐ-ప్యాక్ సభ్యులు తాడేపల్లి శిభిరం నుంచి నిశ్శబ్ధంగా నిష్క్రమించారని తెలుస్తుంది.

ఇదే సమయంలో... ఫలితాలు ప్రకటించిన రెండు రోజుల్లోనే విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని తమ కార్యాలయం నుంచి ఐ-ప్యాక్ టీం సభ్యులు సర్దుకున్నట్లు కథనాలొస్తున్నాయి. ఇందులో భాగంగా ఐ-ప్యాక్ టీం హెడ్ రిషి రాజ్ సింగ్ ఇప్పటికే కార్యాలయానికి రావడం మానేయగా.. ఇతర టీం సభ్యులు కూడా ఒకరితర్వాత ఒకరు ప్రిమిసెస్ ఖాళీ చేసేస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి.

అయితే... ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ కు రిషి రాజ్ సింగ్ కూ మధ్య చర్చ నడిచిందా..? ఇంతటి ఘోర పరాజయానికి గల కారణాలను అన్వేషించే ప్రక్రియ ఏమైనా జరిగిందా..? అసలు ఈ భారీ ఓటమిపై చిన్నపాటి సమీక్ష అయినా నిర్వహించారా..? అనే విషయాలు బయటకు రాలేదు కానీ... అందుతున్న సమాచారం ప్రకారం ఓటమిపై రిషి నుంచి జగన్ కు ఎలాంటి నివేదికా అందలేదని మాత్రం అంటున్నారు.

కాగా... ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన రెండు, మూడు రోజుల అనంతరం, తన విదేశీ పర్యటనకు ముందు వైఎస్ జగన్.. ఐ-ప్యాక్ కార్యాలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఆయన... ఐ-ప్యాక్ తో వైసీపీ ప్రయాణం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని అన్నారు.

అయితే... ఫలితాలు ఇంత దారుణంగా రావడంతోపాటు, ఈ ఘోర ఓటమిపై ఎలాంటి నివేదికనూ ఇచ్చే పరిస్థితిలో ఐ-ప్యాక్ లేదని అంటున్న నేపథ్యంలో... ఆ టీం మరో రాష్ట్రాన్ని వెత్తుకున్నే పనిలో ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో... "ప్యాక్" లను కాదు ప్రజలను నమ్ముకుని, కార్యకర్తల మనోభిష్టాల మేర రాజకీయాలు చేయాలనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం!