కాకినాడ వాసి ఫిర్యాదు.. యాపిల్ కు రూ.లక్ష జరిమానా!
ఇచ్చిన ప్రకటనలకు తగ్గట్లుగా మాట నిలబెట్టుకోనందుకు యాపిల్ సంస్థకు బిగ్ షాక్ తగిలింది.
By: Tupaki Desk | 29 Sep 2024 7:13 AM GMTఇచ్చిన ప్రకటనలకు తగ్గట్లుగా మాట నిలబెట్టుకోనందుకు యాపిల్ సంస్థకు బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా వినియోగదారుల కమిషన్ యాపిల్ సంస్థకు లక్ష రూపాయలు జరిమానా విధించింది. ఇప్పుడు ఈ విషయం ఆసక్తిగా మారింది. ఈ మేరకు యాపిల్ పై వినియోగదారుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన వ్యక్తి కాకినాడకు చెందిన చందలాడ పద్మరాజు.
అవును... ఐఫోన్ కోంటే ఇయర్ పాడ్స్ ఉచితంగా ఇస్తామని యాపిల్ సంస్థ ప్రకటించింది. దీంతో.. కాకినాడలోని సూర్యారావు పేటకు చెందిన చందలాడ పద్మరాజు 2021 అక్టోబరు 13న యాపిల్ అధికారిక వెబ్ సైట్ నుంచి రూ.85,800 విలువైన ఐఫోన్ ను కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఫోన్ కొన్నవారికి రూ.14,900 విలువైన ఇయర్ పాడ్స్ ఉచితంగా అందిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.
అయితే... ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించిన తర్వాత పద్మరాజుకు ఫోన్ పంపించారు తప్ప ఇయర్ పాడ్స్ ఇవ్వలేదు! దీంతో బాధితుడు యాపిల్ సంస్థ ప్రతినిధులు, కస్ట్ మర్ కేర్ లను ఆన్ లైన్ లో ఎన్నోసార్లు సంప్రదించారు. అయినప్పటికీ అటునుంచి స్పందన కరువైంది. దీంతో... బాధితుడు 2022 ఫిబ్రవరి 15న కమిషన్ ను ఆశ్రయించారు.
ఈ సమయంలో వాదనలు విన్న కమిషన్ ముంబై కేంద్రంగా పనిచేస్తున్న యాపిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారిచేసింది. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్)కు చెల్లించాలని ఆదేశించింది. ఇదే సమయంలో కోర్టు ఖర్చులుగా రూ.5 వేలు చెల్లించాలని తెలిపింది.
అదేవిధంగా... రూ.14,900 విలువైన ఇయర్ పాడ్స్ లేదా ఆ మేరకు నగదు, కొనుగోలుదారుని మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ.10వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కమిషన్ సభ్యురాలు చెక్కా సుశీ ఈ వివరాలను వెల్లడించారు.