Begin typing your search above and press return to search.

మార్చి 22 నుంచి ఐపీఎల్ మొదలు... నెట్టింట ఓ హ్యాష్ ట్యాగ్ హల్ చల్!

ఈ సమయంలో ఆటగాళ్లతో పాటు బెట్టింగ్ రాయుళ్లు ఫుల్ ఫామ్ లో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   14 March 2025 8:30 AM IST
మార్చి 22 నుంచి ఐపీఎల్  మొదలు... నెట్టింట ఓ హ్యాష్  ట్యాగ్  హల్  చల్!
X

ప్రధానంగా భారతీయ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ – 2025) షెడ్యూల్ దాదాపు నెల క్రితమే వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ 18వ ఎడిషన్ పూర్తిస్థాయి షెడ్యూల్ మార్చి 22 నుంచి మే 25 వరకూ జరగనుంది. ఈ సీజన్ 65 రోజులపాటు జరగనుండగా.. మొత్తం 74 మ్యాచ్ లు జరుగుతాయి.

మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఈ క్రికెట్ పండుగలో భాగంగా... తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈడెన్ గార్డెన్ వేదికగా తలపడనున్నాయి. 2008 తర్వాత ఈ రెండు జట్లు తొలి మ్యాచ్ లో ఎదురుపడటం ఇదే తొలిసారి.

ఈ సీజన్ లో రెండో మ్యాచ్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటి మ్యాచ్.. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో మార్చి 23న ఉప్పల్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో మార్చి 22 నుంచి మే 18 వరకూ 70 లీగ్ మ్యాచ్ లు జరగనుండగా.. మే 20 నుంచి 25 వరకూ 4 ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరగనున్నాయి. మే 25న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

మరోపక్క ఇటీవల జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ జట్టు మినహా దాదాపు మిగిలిన అన్ని జట్లలోనూ టాప్ ప్లేయర్స్ అంతా మంచి ఫామ్ లోనే ఉన్నారనే విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. ఇక అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో టీమిండియా ఫుల్ ఫామ్ లో ఉంది. ఈ సమయంలో బెట్టింగ్ రాయుళ్లు మునుపటి ఫామ్ ను కొనసాగించే అవకాశం ఉందని అంటున్నారు.

అవును... దాదాపు మరో వారం రోజుల్లో ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రారంభం కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆటగాళ్లతో పాటు బెట్టింగ్ రాయుళ్లు ఫుల్ ఫామ్ లో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రతీ ఐపీఎల్ సీజన్ లోనూ వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరుగుతుండగా.. బెట్టింగులు కాసిన వాళ్లలో బాగుపడినవాళ్లు ఒక్కరు కూడా లేరని అంటుంటారు.

ఆ స్థాయిలో గాంబ్లింగ్ జరుగుతుందని చెబుతుంటారు. అయినప్పటికీ చాలా మంది ఈసారి మంచి జరుగుతుంది, ఈసారి వర్కవుట్ అవుతుంది అని నమ్మి నమ్మి లక్షలు నష్టపోయి, బ్రతుకులను రోడ్లపాలు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో ఈసారి బెట్టింగ్ విషయంలో అధికారుల నుంచి పలు అలర్ట్స్ జారీ అవుతున్నాయి. ఈసారి ఈ విషయాన్ని ఓ క్యాంపెయిన్ లా రన్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా... తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెరపైకి వచ్చారు. ఈ సందర్భంగా... ఎక్స్ వేదికగా ఆయన ఈ విషయంలో జనాలను అలర్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా... ఏ ఒక్కరూ బెట్టింగులను ప్రోత్సహించొద్దని తెలిపారు. ఈ సమయంలోనే #SayNoToBettingApps నెట్టింట హల్ చల్ చేస్తోంది.