రీల్ కాదు రియల్ సీన్: ట్రైనీ ఐఏఎస్ కూతురుకు తండ్రి సెల్యూట్
తమ కంటే తమ పిల్లలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్న ఆశ ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఉంటుంది
By: Tupaki Desk | 16 Jun 2024 5:05 AM GMTతమ కంటే తమ పిల్లలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్న ఆశ ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఉంటుంది. అందుకోసం వారు తీవ్రంగా కలలు కంటుంటారు. అలాంటి ఒక తండ్రికి అంతులేని ఆనందాన్ని మిగిల్చిందో కుమార్తె. ట్రైనీ ఐఏఎస్ కు ప్రస్తుతం అకాడమీలో శిక్షణ పొందుతున్న ఆమెకు.. అక్కడకు వచ్చిన ఐపీఎస్ తండ్రి కలుసుకున్న వేళ.. సరదాగా సెల్యూట్ చేసిన వైనం అందరిని ఆకర్షించింది. సినిమాల్లో కనిపించే ఈ సీన్ రియల్ లైఫ్ లో చోటు చేసుకోవటం ఆసక్తికరంగా మారింది.
ఫాదర్స్ డే కు ఒక రోజు ముందు చోటు చేసుకున్న ఈ ఉదంతానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఫోటో వైరల్ గా మారింది. హైదరాబాద్ రాష్ట్ర పోలీసు అకాడమీని.. ఏడుగురు ప్రొబేషనరీ ఐఏఎస్ లు తమ ట్రైనింగ్ లో భాగంగా అకాడమీని సందర్శించారు. అయితే.. అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు వెంకటేశ్వర్లు. ఐపీఎస్ అయిన ఆయన.. అకాడమీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ లను కలుసుకున్నారు.
ఆ టీంలో ఒకరు ఆయన కుమార్తె ఉమాహారతి కూడా ఉన్నారు. దీంతో అందరితో పాటు కుమార్తెకు సైతం అకాడమీని సందర్శిస్తున్న సందర్భంలో పుష్పగుచ్చాన్ని ఇచ్చారు. అనంతరం సరదాగా సెల్యూట్ చేశారు. దీంతో ఆమె ముఖంలో చిరునవ్వులు చిందాయి. ఆదివారం ఫాదర్స్ డే కు ఒక రోజు ముందు చోటు చేసుకున్న ఈ ఉదంతం అక్కడి వారందరిని ఆకర్షించింది. తమ వద్దకు వచ్చిన ట్రైనీ ఐఏఎస్ లకు అకాడమీ జాయింట్ డైరెక్టర్.. డిప్యూటీ డైరెక్టర్ లతో పాటు మరో డిప్యూటీ డైరెక్టర్ స్వాగతం పలికి.. అకాడమీ గురించి వివరించారు.