ఏపీ కేడర్ ఐపీఎస్‌కు జమ్ము ఎన్నికల బాధ్యత!
జమ్ము కశ్మీర్‌ను లద్ధక్-జమ్ము కశ్మీర్‌గా విభజించిన తర్వాత.. లద్ధక్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్రం గుర్తించింది.
By: Tupaki Desk | 16 Aug 2024 12:30 AM GMTమరో రెండు మాసాల్లో జరగనున్న జమ్ము కశ్మీర్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం ద్వారా పొరుగు దేశం పాకిస్థాన్‌కు సరైన బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం తలపోస్తోంది. ఈ క్రమంలో ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్‌కు జమ్ము ఎన్నికల బాధ్యతలను అప్పగించను న్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆయన కేడర్‌ను కూడా మార్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం. జమ్ము కశ్మీర్‌ను లద్ధక్-జమ్ము కశ్మీర్‌గా విభజించిన తర్వాత.. లద్ధక్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్రం గుర్తించింది.
ఇక, జమ్ము కశ్మీర్‌లో మాత్రం ప్రజాప్రతినిధులతో కూడిన అసెంబ్లీ పాలన చేయాల్సి ఉంది. అయితే.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి ఇక్కడ రాష్ట్రపతి పాలనను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. త్వరలోనే ఇక్కడ ప్రజాస్వామ్య యుత ఎన్నికలను నిర్వహించనున్నారు. ఏడాది చివరిలో కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు కలిపి ఇక్కడ నిర్వహిస్తారా? లేక ముందుగానే నిర్వహిస్తారా? అనేది చర్చలు జరుగుతున్నాయి.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. జమ్ము కశ్మీర్‌లో ప్రశాంతంగా జరిగిపోవాలని మోడీ సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రంలో సమర్థుడైన అధికారిని నియమించాలని నిర్ణయించుకున్న కేంద్ర హోం శాఖ ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్న ఏపీ కేడర్‌కు చెందిన నళిన్ ప్రభాత్‌ను జమ్ము కశ్మీర్‌కు పంపించాలని భావించింది. ఈ క్రమంలో నళిన్ ప్రభాత్‌ను అరుణాచల్ ప్రదేశ్- గోవా- మిజోరం- యూనియన్ టెరిటరీ(ఏజీయూఎంటీ)కి బదిలీ చేసింది.
తర్వాత.. జమ్ము కశ్మీర్ స్పెషల్ డీజీపీగా నియమించింది. వచ్చే నెల 30వ తేదీ వరకు ఆయన ఈ పోస్టులో కొనసాగుతారు. తర్వాత.. పూర్తిస్తాయిలో డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. తద్వారా జమ్ము కశ్మీర్‌లో ఎలాంటి రక్తపాతం జరగకుండా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనేది కేంద్రం వ్యూహం. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.