ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్... నవంబర్ 5 తర్వాత జరిగేది ఇదే!?
హమాస్ అగ్రనాయకత్వాన్ని మట్టుబెట్టింది. అనంతరం హెజ్ బొల్లా ఉగ్రవాదులపైనా ఇజ్రాయెల్ దృష్టి పెట్టింది.
By: Tupaki Desk | 2 Nov 2024 4:16 AM GMTగత ఏడాది అక్టోబర్ 8న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ ప్రజలపై దాడి చేసినప్పటి నుంచీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో.. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా గాజా స్ట్రిప్ పై దాడి మొదలుపెట్టిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఆ ప్రాంతాన్ని తూట్లు పొడిచేసింది.
హమాస్ అగ్రనాయకత్వాన్ని మట్టుబెట్టింది. అనంతరం హెజ్ బొల్లా ఉగ్రవాదులపైనా ఇజ్రాయెల్ దృష్టి పెట్టింది. హెజ్ బొల్లా అగ్రనాయకత్వాన్ని మట్టుబెట్టింది! ఇప్పుడు ఇజ్రాయెల్ పై ఇరాన్ కారాలూ మిరియాలూ నూరుతూ సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అంటున్నారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.
అవును... పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనిపించడం లేదంటూ నడుస్తున్న చర్చకు బలం చేకూర్చే ఓ విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఇటీవల ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమవుతోందట. దీనికోసం ఓ ముహూర్తం కూడా పెట్టుకుందని కథనాలొస్తున్నాయి.
ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ పై దాడి విషయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయ్యేవరకూ ఓపికగా ఉండాలని ఇరాన్ భావిస్తోందట. ఇప్పటికే ఇజ్రాయెల్ లో ఎక్కడెక్కడ దాడి చేయాలనే విషయాలపై ఓ అవగాహనకు వచ్చిన టెహ్రాన్.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న ముగిసిన తర్వాత పని మొదలుపెట్టాలని భావిస్తోందని అంటున్నారు.
దీనివెనుకా పెద్ద కారణం ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగా... నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ.. ఎన్నికల ముందు దాడి చేస్తే పరిస్థితులు ట్రంప్ కు అనుకూలంగా మారే అవకాశాలున్నాయని.. అందుకే ఇజ్రాయెల్ పై దాడి విషయంలో వేచి చూస్తున్నట్లు ఇరాన్ అధికారులను చెప్పారని అంటున్నారు.
దీంతో... నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తైన అనంతరం ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు పెద్ద ఎత్తున ఉండొచ్చని.. అవి ఇరాక్ నుంచి జరగొచ్చని అంటున్నారు పరిశీలకులు.