ట్రంప్ పై ఇరాన్ గురి.. కమలాపైనా తుపాకీ.. అమెరికాలో ఏం జరుగుతోంది?
డెమోక్రాట్ల అభ్యర్థిగా భారత మూలాలున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలిచారు.
By: Tupaki Desk | 25 Sep 2024 5:48 AM GMTబహుశా అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ లేవనుకుంటా.. అధ్యక్షుడు మరోసారి ఎన్నికల అభ్యర్థిగా ఖరారై మధ్యలోనే తప్పుకోవడం.. ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న మహిళ అధికార పార్టీ అధ్యక్ష అభ్యర్థి కావడం, మాజీ అధ్యక్షుడు నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ పోటీచేయడం ఇవన్నీ ఒక ఎత్తు. గన్ కల్చర్ కు పేరుగాంచిన అమెరికాలో అధ్యక్ష అభ్యర్థులపైనే తుపాకీలు ఎక్కుపెట్టడం మరో ఎత్తు. అమెరికాలో నవంబరు 5న ఎన్నికలు జరగనున్నాయి. డెమోక్రాట్ల అభ్యర్థిగా భారత మూలాలున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలిచారు. అయితే, వీరి ప్రచారం, పోటీ హోరాహోరీగా సాగుతున్న సమయంలో రోజుకో సంచలన విషయం బయటకు వస్తోంది.
యుద్ధాల మధ్యన..
గతంలో అనేక యుద్ధాల మధ్యన అమెరికా ఎన్నికలు జరిగి ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే ఓవైపు ఉక్రెయిన్-రష్యా, మరోవైపు ఇజ్రాయెల్-హమాస్, హిజ్బుల్లాలతో భీకరంగా తలపడుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి అమెరికా ఎన్నికలు అత్యంత సంక్లిష్ట వాతావరణంలో జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి సమయంలో వరుసగా కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అది కూడా ట్రంప్, కమలా టార్గెట్ గా కావడం ఆందోళన కలిగిస్తోంది.
రెండు నెలల్లోనే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముఖచిత్రం రెండు నెలల్లోనే మారిపోయింది. అధ్యక్షుడు బైడెన్ తప్పుకొని కమలా రంగంలోకి వచ్చారు. అయితే, ఈ మధ్యలోనే ట్రంప్ పై పెన్సిల్వేనియా ఎన్నికల సభలో కాల్పులు జరిగాయి. ట్రంప్ త్రుటిలో తప్పించుకున్నారు. చెవికి ఆనుకొని బుల్లెట్ వెళ్లింది. అదే చెవి బ్యాండేజప్ వేసుకుని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొద్ది రోజుల కిందట ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఫెన్సింగ్ వద్ద నుంచి ఓ వ్యక్తి తుపాకీతో వచ్చేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బంది కాల్పులు జరిపి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
కమలా కూడా..
ఇక కమలా హారిస్ టార్గెట్ గానూ కాల్పులు జరగడం తాజా కలకలం. అరిజోనాలోని ఆమె పార్టీ ప్రచార సమన్వయ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ ఈ కాల్పులకు పాల్పడ్డారు. సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు వచ్చి దర్యాప్తు చేపట్టారు. కార్యాలయం కిటికీల నుంచి కాల్పులు జరిపినట్లు గుర్తించారు. రాత్రి వేళ కావడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇరాన్ గురి పెట్టిందా?
అమెరికాకు ఆగర్భ శత్రువు ఇరాన్. ఇప్పుడు ఎన్నికల వేళ ఆ దేశంలో అస్థిరత, గందరగోళం రేపాలని ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇరాన్ నుంచి ట్రంప్ నకు ముప్పు ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ కార్యాలయం హెచ్చరించినట్లు ఆయన ప్రచార బృందం చెబుతోంది. ఇరాన్ కు చెందిన హ్యాకర్లు ట్రంప్ ప్రచారంలో బయటకు కనిపించని అంశాలను హ్యాక్ చేసి.. వాటి సారాంశాన్ని బైడెన్ ప్రచార సిబ్బందికి ఇచ్చేందుకు ప్రయత్నించారనేది కొత్త కథనం. అయితే, బైడెన్ అభ్యర్థిగా ఉన్నప్పుడు ఇది జరిగి ఉంటుంది. కమలా వచ్చాక ప్రయత్నం జరిగిందా? లేదా? అనేది తెలియదు. మరోవైపు ట్రంప్ ప్రచారం హ్యాకింగ్ వెనుక ఇరాన్ ఉన్నట్లు ఆయన టీమ్ అనుమానిస్తోంది. ఇరాన్ తాము ఏమీ చేయలేదని చెబుతోంది.