Begin typing your search above and press return to search.

ఇరాన్-ఇజ్రాయెల్... నాటి స్నేహం నేడు శత్రుత్వంగా ఎలా మారింది?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెల్ – ఇరాన్ ల మధ్య జరుగుతున్న ఘర్షణలే హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Oct 2024 10:34 AM GMT
ఇరాన్-ఇజ్రాయెల్... నాటి స్నేహం నేడు  శత్రుత్వంగా ఎలా మారింది?
X

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెల్ – ఇరాన్ ల మధ్య జరుగుతున్న ఘర్షణలే హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతీయ యుద్ధం ముదిరి పాకాన పడి, మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలున్నాయనే ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో.. ఇప్పుడు బద్ద శత్రువులుగా ఉన్న ఇరాన్ – ఇజ్రాయెల్ లు ఒకప్పుడు మిత్రులనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అవును... ఇప్పుడు నువ్వా నేనా అంటూ తీవ్ర ఘర్షణకు దిగిన ఇజ్రాయెల్ – ఇరాన్ లు ఒకప్పుడు మంచి మిత్రులుగా ఉండేవారు. అమెరికాకు తెలియకుండా ఇరాన్ కు రహస్యంగా ఇజ్రాయెల్ సహాయ సహాకారాలు అందించేదంటే వీరి స్నేహం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే.. వీరి స్నేహం చిగురించడానికి.. పరస్పరం సహకరించుకోవడానికి ఇరాక్ తో ఇద్దరికీ ఉన్న వైరమే ప్రధాన కారణం అని చెప్పొచ్చు.

వివరాళ్లోకి వెళ్తే... 1960ల్లో ఇరాక్ లోని సున్నీ నాయకత్వాన్ని తమ ప్రాంతీయ విస్తరణ లక్ష్యాలకు ముప్పుగా షియాల పాలనలోని ఇరాన్ భావించేది. ఇదే సమయంలో... అరబ్ దేశాల నుంచి ముప్పుతో నాడు ఇజ్రాయెల్ ఇబ్బందిపడేది. ఈ సమయంలో... ఇరాన్ సీక్రెట్ పోలీస్ "సావక్", ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ "మొస్సాద్" కలిసి "కర్దు" వేర్పాటువాదులను బలోపేతం చేసేవి. వీరు ఇరాక్ కు సమస్యగా తయారయ్యారు.

ఆ సమయంలోనే టెహ్రాన్ లో ఇజ్రాయెల్ అప్రకటిత దౌత్యకార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే.. అరబ్ దేశాల్లో ఇజ్రాయెల్ పై ఉన్న వ్యతిరేకత దృష్ట్యా ఈ విషయం బయటకు పొక్కకుండా ఇరాన్ జాగ్రత్తపడేది. అంటే ఇటు అమెరికాకు పూర్తిగా తెలియకుండా ఇజ్రాయెల్.. అరబ్ ప్రపంచానికి తెలియకుండా ఇరాన్.. కలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ రహస్య స్నేహితులుగా మెలిగారన్నమాట.

అలా 1960ల్లో ప్రారంభమైన వీరి (రహస్య) స్నేహం... 1977లో వీరి బంధం మరింత బలపడింది. ఇరాన్ కోసం ఇజ్రాయెల్ ఏకంగా ఊపరితలంపై నుంచి అలా పైకి ప్రయోగించే అణుక్షిపణులను సిద్ధం చేసే ప్రాజెక్ట్ చేపట్టింది. దీనికి"ఆపరేషన్ ఫ్లవర్" అనే నామకరణం చేశారు. దీనికోసం అడ్వాన్స్ గా నాటి ఇరాన్ ప్రభుత్వ.. ఇజ్రాయెల్ కు 260 మిలియన్ డాలర్ల చమురును సరఫరా చేసిందని చెబుతారు.

ఇక 1980-88 మధ్య ఇరాక్ తో జరిగిన ఇరాన్ యుద్ధంలో కూడా టెహ్రాన్ కు ఇజ్రాయెల్ నుంచి సహకారం కొనసాగింది. ఆ సమయంలో ఇరాక్ నేత సద్దాం హుస్సేన్ అణుబాంబు ఆశలు ఇజ్రాయెల్ ను భయపెట్టాయి. ఈ సమయంలో అమెరికా ఆంక్షలను సైతం పక్కనపెట్టి మరీ ఇరాన్ కు ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు పంపించినట్లు చెబుతారు. ఆయితే... ఈ యుద్ధం పీక్స్ కి చేరే సమయానికి టెహ్రాన్ కు వనరులు హరించుకుపోయాయి.

ఆ సమయంలో ఇరాన్ కు అవసరమైన అమెరికా తయారీ ఎఫ్-4 ఫైటర్ జెట్లను ఇజ్రాయెల్ రహస్యంగా ఫ్రాన్స్ కు తరలించి.. అక్కడ నుంచి ఛార్టర్ ఫ్లైట్స్ లో ఇరాన్ కు పంపింది. కారణం... ఇరాక్ విజయాన్ని అడ్డుకోవడమే నాటి ఇజ్రాయెల్ ప్రభుత్వ లక్ష్యం. దీంతో... ఇరాన్ కు ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ఇచ్చేది.

కట్ చేస్తే... ఇరాక్ తో యుద్ధం సమయంలో అద్భుతంగా ఉన్నట్లు కనిపించిన ఇరాన్-ఇజ్రాయెల్ స్నేహం 1990ల నాటికి తగ్గిపోయింది. ఓ పక్క ఇరాక్ తో ముప్పు తొలగిపోవడం.. మరోపక్క ఇజ్రాయెల్ వ్యతిరేక హెజ్ బొల్లా, హమాస్ లకు ఇరాన్ మద్దతు ఇవ్వడం మొదలుపెట్టడంతో వీరి స్నేహానికి బీటలు వారి శత్రుత్వం మొదలైంది.

ఈ నేపథ్యంలోనే 2006లో హెజ్ బొల్లాతోనూ, 2008లో హమాస్ తోనూ ఇజ్రాయెల్ పోరాడాల్సి వచ్చింది. అయితే... ఈ రెండు గ్రూపులకు టెహ్రాన్ మద్దతు ఇచ్చింది. దీంతో... ఇరాన్ – ఇజ్రాయెల్ లు బద్ధ శత్రువులుగా మారాయి. ఈ సమయంలో... ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వారి నెక్స్ట్ టార్గెట్ పై పలు విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.

తాజాగా ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు చేసిన నేపథ్యంలో... ఇరాన్ పాలకులు తమ ఆత్మరక్షణ శక్తిని, శత్రువులపై ప్రతిదాడి చేసే సామర్థ్యాన్న్ని తక్కువగా అంచనా వేశారు అని మొదలుపెట్టిన నెతన్యాహు... గతంలో డెయిఫ్, సిన్వార్ ఇలానే అర్ధం చెసుకున్నారని.. ఇటీవల నస్రల్లా, షుక్ర కూడా అదే రీతిగా ఆలోచించారని.. ఇప్పుడు ఇరాన్ కూడా ఇలానే ఆలోచిస్తుందంటూ వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో... త్వరలో ఇరాన్ కూడా అర్ధం చేసుకుంటుందని.. తమపై ఎవరు దాడి చేశారో వారిపై తాము దాడి చేస్తామని నెతన్యహు చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో... ఐడీఎఫ్ నెక్స్ట్ టార్గెట్ ఇరాన్ టాప్ లీడర్ ఖమేనీ అయ్యి ఉండొచ్చని అంటున్నారు పరిశీలకులు.