Begin typing your search above and press return to search.

ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధంతో మన దేశంలో నిత్యవసరాల ధరలు పెరుగుతాయా?

తరచూ ఏదో ఒక ఇష్యూతో రగిలిపోతూ ఉండే పశ్చిమాసియా తాజాగా ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్దంతో మరింత రగిలిపోయే పరిస్థితి.

By:  Tupaki Desk   |   3 Oct 2024 6:30 AM GMT
ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధంతో మన దేశంలో నిత్యవసరాల ధరలు పెరుగుతాయా?
X

తరచూ ఏదో ఒక ఇష్యూతో రగిలిపోతూ ఉండే పశ్చిమాసియా తాజాగా ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్దంతో మరింత రగిలిపోయే పరిస్థితి. ఇరాన్ నుంచి క్షిపణులు ఇజ్రాయెల్ మీద దూసుకెళుతున్నాయి. మరోవైపు ఇరాన్ కు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి. చేయకూడని తప్పు చేస్తున్నట్లుగా హెచ్చరిస్తున్నారు. నిజానికి ఇరాన్ -ఇజ్రాయెల్ మనకు వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అయినా.. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధంతో భారతదేశానికి కలిగే నష్టమేంటి? అన్న లెక్కలు ఇప్పుడు మొదలయ్యాయి.

భౌతికంగా ఈ రెండు దేశాలు మనకు చాలానే ఉన్నా.. ఈ రెండు దేశాలతో మనకున్న ప్రత్యేక అనుబంధం కొత్త కష్టానికి తీసుకొస్తుందని చెప్పక తప్పదు. కారణం.. మనం నిత్యం ఆధారపడే చమురు దిగుమతులు ఒక సమస్య కాగా.. గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది మనోళ్లు పని చేస్తుండటం మరో అంశంగా చెప్పాలి. తాజా యుద్ధం జరిగేది మనకు దూరంగా ఉండే రెండు బయట దేశాలతో అయినా.. ప్రభావం మాత్రం మన మీదా పడుతుందని చెబుతున్నారు. ఇంతకు మన మీద ఏమేం ప్రభావాలు చూపుతాయి అన్నది చూస్తే..

- మన దేశంలో వినియోగించే డీజిల్.. పెట్రోల్ లో సింహభాగం ఆధారపడేది పశ్చిమాసియా మీదనే. దిగుమతుల్లో దాదాపు 80 శాతం ఈ దేశాల నుంచే వస్తుంది. దీంతో.. అక్కడి నుంచి వచ్చే చమురు సరఫరాలో ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా మనకు ఇబ్బందులుతప్పవు. తక్షణం మన మీద ప్రభావాన్ని చూపుతుంది.

- ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ ధరలకు అనుగుణంగా పెట్రోల్.. డీజిల్ ధరలు పెరిగే వీలుంది. అదే జరిగితే రవాణా ఛార్జీల మీద కూడా ప్రభావం చూపుతుందని చెప్పాలి.

- రవాణా ఛార్జీలు పెరిగిన తర్వాత నిత్యవసర వస్తువుల ధరలు ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. దీంతో సామాన్యులంతా ఇబ్బందులకు గురి అవుతారు.

- పశ్చిమాసియా దేశాలతో భారత్ కు వాణిజ్య పరంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మన నుంచి వారికి యంత్రాలు.. ఔషధాలు.. పలు రకాల ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. అదే టైంలో అక్కడి నుంచి మనకు చమురు.. సహజ వాయువు.. ఎరువులు దిగుమతి అవుతుంటాయి.

- ప్రస్తుతం మన ద్వైపాక్షిక వాణిజ్యం 16.36 లక్షల కోట్లుగా ఉంది. అంతేకాదు గల్ఫ్ దేశాల నుంచి భారత్ లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తుంటాయి. భారత్ లోని ఇన్ ఫ్రా.. టెక్ స్టార్టప్ లతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఇవన్నీ కూడా తాజా యుద్ధ పరిస్థితులతో ప్రభావితం కానున్నాయి.

- పలు గల్ఫ్ దేశాలతో భారత్ ‘ఫ్రీ ట్రేడ్ అగ్నిమెంట్’ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఒప్పందాలు కుదిరితే వాణిజ్యం.. పెట్టబడులు మరింత పెరుగుతాయి. కానీ.. తాజాగా నెలకొన్న అస్థిర పరిస్థితులు ప్రభావం చూపనున్నాయి.

- గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు పని చేస్తున్నారు. వారి ద్వారా వేల కోట్ల రూపాయిల విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో భారతీయుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమవుతుంది. వారు ఉద్యోగాలు కోల్పోయి దేశానికి తిరిగి వస్తే ఉపాధికి సంబంధించిన సవాళ్లు షురూ అవుతాయి.

- విదేశాంగ విధానంలోనూ ఇబ్బందులు తప్పవు. అటు ఇరాన్ తోనూ.. అటు ఇజ్రాయెల్ తోనూ భారత్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ.. మిలిటరీ సామాగ్రి దిగుమతి అవుతుంటే.. ఇరాన్ నుంచి చమురు దిగుమతులు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగితే రెండు దేశాలతో తటస్థ వైఖరి కంటిన్యూ చేయటం కష్టమవుతుంది. ఇజ్రాయెల్ కు అమెరికా.. పశ్చిమ దేశాలు దన్నుగా నిలిస్తే.. ఇరాన్ తరఫు రష్యా.. చైనా రంగంలోకి దిగితే పరిస్థితి భారత్ కు ఇబ్బందికరంగా మారనుంది.