Begin typing your search above and press return to search.

ఇజ్రాయెల్ మీద యుద్ధం.. ఇరాన్ ప్రతాపం ఇంతేనా?

ఏప్రిల్ లో ఇరాన్ అత్యున్నత దళం అయిన రెవల్యూషనరీ గార్డ్స్ ను లిబియాలో చంపేసింది ఇజ్రాయెల్.

By:  Tupaki Desk   |   2 Oct 2024 1:17 PM GMT
ఇజ్రాయెల్ మీద యుద్ధం.. ఇరాన్ ప్రతాపం ఇంతేనా?
X

ఏప్రిల్ లో ఇరాన్ అత్యున్నత దళం అయిన రెవల్యూషనరీ గార్డ్స్ ను లిబియాలో చంపేసింది ఇజ్రాయెల్. దీనికి గట్టిగా బదులిస్తామని చెప్పిన ఇరాన్.. ఇజ్రాయెల్ పై క్షిపణులను ప్రయోగించింది. వాటిని ఐరన్ డోమ్ తో సమర్థంగా ఎదుర్కొంది ఇజ్రాయెల్. ఆ తర్వాత ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం సంభవించింది. దీనివెనుక పేజర్ పేలుడు ఉందనే ఊహాగానాలు వినిపించాయి. జూలైలో ఇరాన్ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి వచ్చిన హ‌మాస్ రాజకీయ విభాగం అధినేత ఇస్మాయెల్ హ‌నియేను చంపేసింది. త‌మ దేశంలో అతిథిగా ఉన్న హ‌నియే హత్యకు ప్ర‌తీకారం తప్పదని ఇరాన్ హెచ్చ‌రించింది. ఇక గత వారం ఇరాన్‌ కు అత్యంత స‌న్నిహితుడు, లెబనాన్‌ కు చెందిన ఉగ్ర సంస్థ హెజ్‌ బొల్లా అధినేత హసన్ న‌స్ర‌ల్లాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఇక ఇరాన్ ఆగ్ర‌హం నషాళానికి ఎక్కింది. రెండు రోజుల క్రితం యెమెన్‌ లోని హౌతీ ఉగ్రవాదుల స్థావ‌రాల‌పై ఇజ్రాయెల్ భీక‌ర‌గా విరుచుకుపడింది. గత ఏడాది అక్టోబరు నుంచి హ‌మాస్‌ తో తలపడుతోంది ఇజ్రాయెల్. ఇక హెజ్‌బొల్లా, హౌతీలు ఇరాన్‌ మద్దతున్నవి. వీటికి శిక్ష‌ణ కూడా ఇస్తోంది. దీంతో ఇరాన్ తాము ఇజ్రాయెల్ ను విడిచిపెట్టం అంటూ గంభీర ప్రకటనలు చేసింది. దూకుడుగా విరుచుకుపడతామని ప్రకటించింది. ఇలా ఏం జరుగుతుందోనని ప్రపంచం అంతా తీవ్ర ఆందోళన చెందుతుండగా.. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ పైకి 200 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.

ఐరన్ డోమ్ అడ్డుకుంది..

ఇజ్రాయెల్ పై దాడి చేయకుంటే అది దైవ దూషణే అని ఇరాన్ అత్యున్నత నేత (సుప్రీం లీడర్) ఖమేనీ తెలిపారు. ఈ ప్రకటన చేసిన చాలా రోజుల తర్వాత మంగళవారం రాత్రి ఇరాన్ క్షిప‌ణుల వ‌ర్షాన్ని కురిపించింది. అయితే, వీటిలో చాలావాటిని ఇజ్రాయెల్ ఐర‌న్‌ డోమ్ అడ్డుకుంది. కానీ, కొన్ని మిస్సైళ్లు ఇజ్రాయెల్ లో నష్టం కలిగించాయి. మొత్తానికి ఈ చర్యతో ప‌శ్చిమాసియా మ‌ళ్లీ ర‌ణ‌రంగంగా మారింది. ఫ‌లితంగా అంత‌ర్జాతీయ మార్కెట్‌ లో గ్యాస్ (చ‌మురు) ధ‌ర‌లు భ‌గ్గుమ‌న్నాయి.

దాడి ముగిసిందట..?

సైనికాధికారులను పోగొట్టుకుని.. అధ్యక్షుడు అనుమానాస్పద స్థితిలో చనిపోగా.. తాము పెంచి పోషించిన ఉగ్ర వాద సంస్థలు దెబ్బతింటుండగా.. తమ దేశానికి అతిథిగా వచ్చిన వ్యక్తిని చంపేసినా ఇజ్రాయెల్ చాలా ఆలస్యంగా స్పందించిందనే విమర్శలు వచ్చాయి. అంతేకాదు.. తాజాగా మంగళవారం 400 క్షిపణి దాడులు చేసినట్లు తొలుత వార్తలు వచ్చినా అవి 200 మాత్రమేనని తేలింది. అయితే, ఇంతటితో తమ దాడి ముగిసిందని ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ స్పందన ఇంతేనా? అని విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఇరాన్ అణు సామర్థ్యం ఉన్న దేశం. ఆయుధాలు కూడా బాగానే ఉన్నాయని అంటారు. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాకే డ్రోన్లను సరఫరా చేసింది. ఇరాన్ ఇస్కందర్ క్షిపణుల గురించి గొప్పగా చెబుతారు. అలాంటి ఇరాన్ ప్రస్తుతం ఇజ్రాయెల్ మీద ఓ 200 క్షిపణులను ప్రయోగించి ఇదే తమ ప్రతిస్పందన అనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా, ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందో అన్నది ఇక చూడాలి. ఇరాన్ అణు కేంద్రాల స‌మీప ప్రాంతాల్లో ఇప్పటికే డ్రోన్ల‌తో దాడులు చేసింది. ఇకమీదట దాడులు చేస్తే ఎంత తీవ్ర‌త‌తో ఉంటాయ‌న్న అంశంపై ఆందోళ‌న‌ నెలకొంది. అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ ఇరాన్‌ ను తీవ్రంగా హెచ్చ‌రించారు. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు తీవ్ర‌మైతే అమెరికాతో పాటు పాశ్చాత్య‌కూట‌మి రంగంలోకి దిగే అవ‌కాశం ఉంది.

యుద్ధంలో నిలవలేదు..

ఇజ్రాయెల్ కంటే ఇరాన్ టెక్నాలజీలో చాలా వెనుకబడి ఉంది. అంతేకాదు.. ఆయుధ సామర్థ్యమూ తక్కువే. అలాంటి ఇరాన్ గనుక ఇజ్రాయెల్ తో యుద్ధం చేస్తే ఎంతో కాలం పోరాడలేదు. తమ పరిమితులు తెలిసే ఇరాన్ ఇలా పరిమిత యుద్ధం చేస్తోందనేది విశ్లేషకుల మాట.