Begin typing your search above and press return to search.

ఇరాన్ భూగర్భ క్షిపణి నగరం... వీడియోతో ఎవరికి వార్నింగ్?

ఇరాన్ తన ఆయుధ సామర్థ్యాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో క్లిప్ లో అత్యాధునిక క్షిపణులను ప్రదర్శించింది.

By:  Tupaki Desk   |   26 March 2025 11:35 AM
ఇరాన్ భూగర్భ క్షిపణి నగరం... వీడియోతో ఎవరికి వార్నింగ్?
X

ఇటీవల యెమెన్ లోని హూతీలపై అమెరికా భీకర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హూతీ తిరుగుబాటుదారుల చర్యలను ఇరాన్ తో ముడిపెడుతూ హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా... తదుపరి దాడులకు పాల్పడితే టెహ్రాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

దీంతో... ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సుప్రీం లీడార్ అయాతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. యెమెన్ కు చెందిన హూతీలు తాము చెప్తే దాడులు చేయడం లేదని.. ఆ విషయంలో వారి కారణాలు వారికి ఉండొచ్చని.. ఎవరైనా తమ జోలికి వస్తే మాత్రం ఊరుకోమని.. టెహ్రాన్ పై ఆరోపణలు చేస్తే.. అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరించారు.

ఇదే సమయంలో.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘీ స్పందిస్తూ.. అమెరికాతో పరోక్షంగా చర్చలకు తాము సిద్ధమేనని సంకేతాలు ఇచ్చారు. ఇదే సమయంలో.. ఇరాన్ విషయంలో ప్రత్యర్థుల వైఖరిలో మార్పు రానంతవరకు ప్రత్యక్ష చర్చలకు ఛాన్స్ లేదని తేల్చి చెప్పేశారు. ఈ సమయంలో నెట్టింట ఓ వీడియో ప్రత్యక్షమైంది. ఇది ఇరాన్ భూగర్భ నగరం!

అవును... ఇరాన్ తన ఆయుధ సామర్థ్యాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో క్లిప్ లో అత్యాధునిక క్షిపణులను ప్రదర్శించింది. ఇరాన్ సాయుధ బలగాల అధిపతి హోస్సెనీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ఏరోస్పెస్ కమాండర్ అమీర్ అలీ ఈ సొరంగ మార్గంలో వాహనంపై ప్రయాణిస్తు.. ఆయుధాలను వీక్షిస్తున్న దృశ్యాలు ఉన్నాయి.

ఇదే సమయంలో.. ఈ వీడియోలో ఖైబర్ షేకాన్స్, సెజ్జిల్స్, ఘద్రహస్, హజ్ ఖాసిమ్స్, పవేహ్ ల్యాండ్ అటాక్ క్షిపణులు ఉన్నాయి. దీనిలో అత్యంత పొడవైన సొరంగాలు, గుహలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన నిపుణులు... ఒకవేళ ఏవైనా భద్రతా పరమైన ఉల్లంఘనలు జరిగితే తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి పరిస్థితి ఇక్కడ ఉందని చెబుతున్నారు.

కాగా... ఇరాన్ అణుఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. రెండు నెలల గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వీడియో బయటకు రావడం గమనార్హం.