Begin typing your search above and press return to search.

ఇజ్రాయెల్ పై నేడే ఇరాన్ దాడి.. ఇక మూడో ప్రపంచ యుద్ధమే?

ప్రపంచంలోని అగ్ర దేశాల కూటమి అయిన జీ-7 దేశాల విదేశాంగ మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చేసిన వ్యాఖ్యలు ఇజ్రాయెల్ పై ఇరాన్ యుద్ధం సోమవారమే మొదలుకానుందని స్పష్టం చేస్తోంది.

By:  Tupaki Desk   |   5 Aug 2024 9:45 AM GMT
ఇజ్రాయెల్ పై నేడే ఇరాన్ దాడి.. ఇక మూడో ప్రపంచ యుద్ధమే?
X

నిత్యం పచ్చిగా ఉండే పుండులాంటి పశ్చిమాసియా మరింత గాయపడనుందా..? ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్, హెజ్బొల్లాల మధ్య యుద్ధంలో ఇరాన్ కూడా రంగంలోకి దిగనుందా..? హూతీలనూ కలుపుకొంటే ఇది మరింత పెద్ద యుద్ధంగా మారనుందా..? పరిస్థితులను చూస్తుంటే అంతే అనిపిస్తోంది. ఇజ్రాయెల్ వైపు అమెరికా, బ్రిటన్, ఇరాన్ వైపు రష్యా నిలిచాయి. దీంతో ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందనే భయాలు వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఏ క్షణంలో ఎక్కడి నుంచి దాడులు జరుగుతాయో అర్థం కావడం లేదు. ఓవైపు ఇజ్రాయెల్ కు సైనిక సాయం చేస్తూనే.. ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని అమెరికా చెబుతోంది. పశ్చిమాసియాలో అదనపు బలగాల మోహరింపును ఆ విధంగా సమర్థించుకుంటోంది.

ఉగ్ర గ్రూపులతో కలిసి ఇజ్రాయెల్ పైకి..

ఇరాన్‌ అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి వచ్చిన హమాస్‌ చీఫ్ ఇస్మాయిల్‌ హనియాను ఇటీవల ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ లోనే హతమార్చింది ఇజ్రాయెల్. ఏప్రిల్ లో లెబనాన్ రాజధాని బీరూట్ లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్ (ఐఆర్ జీసీ)ను హతమార్చింది. అప్పట్లో ఇరాన్ క్షిపణులు ప్రయోగించినా అమెరికా, ఫ్రాన్స్ సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకుంది. హనియాను చంపిన మరునాడే ఇజ్రాయెల్‌ ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లా సీనియర్‌ మిలిటరీ కమాండర్‌ ఫాద్‌ షుకూర్ ను హతమార్చింది. ఇజ్రాయెల్ పై యుద్ధం చేస్తున్న హమాస్‌ తో పాటు హెజ్‌బొల్లా లకు ఇరాన్ మద్దతుదారు. దీంతో ఇజ్రాయెల్ ముప్పేట చిక్కింది. దీంతో పశ్చిమాసియా మొత్తం రగులుతోంది.

బ్లింకెన్ చెప్పేశారు..

ప్రపంచంలోని అగ్ర దేశాల కూటమి అయిన జీ-7 దేశాల విదేశాంగ మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చేసిన వ్యాఖ్యలు ఇజ్రాయెల్ పై ఇరాన్ యుద్ధం సోమవారమే మొదలుకానుందని స్పష్టం చేస్తోంది. జీ-7 కూటమిలోని మంత్రులతో బ్లింకెన్ చెప్పారంటే వాటికి విలువ ఉంటుంది. హెజ్‌బొల్లాతో కలిసి ఇరాన్ దాడి చేస్తుందనే సమాచారం ఉందని.. అవి ఎలా చేస్తుంది? ఏ సమయంలో చేస్తుంది? అనేది చెప్పలేమని పేర్కొన్నారు. కాగా, పశ్చిమాసియా విషయమై అమెరికా అధ్యక్షుడు బైడెన్ సోమవారం అత్యంత కీలకమైన జాతీయ భద్రతా మండలితో సమావేశం కానున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ లకు మిత్రదేశమైన జోర్డాన్‌ రాజు అబ్దుల్లాతోనూ ఆయన చర్చించనున్నారు. అయితే, ఇప్పటికే ఇజ్రాయెల్ వైపు నిలిచిన అమెరికా.. పశ్చిమాసియాలో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటామని వివరించింది.