కాష్ పటేల్.. కమ్యూనికేషన్లు క్రాష్.. ఆ దేశం పనే
ట్రంప్ కూడా తెలివైన న్యాయవాది అని కొనియాడే కశ్యప్ పటేల్.. కొత్త ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవిని చేపట్టనున్నారు.
By: Tupaki Desk | 5 Dec 2024 1:30 AM GMTఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ).. అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ. ఇలాంటి సంస్థకు ఓ భారతీయ మూలాలున్న వ్యక్తి చీఫ్ కావడం అంటే మామూలు మాటలు కాదు. ఆ ఘనతను అందుకున్నారు కాష్ పటేల్. వాస్తవానికి ఈయన పేరు కాష్ పటేల్ కాదు. కశ్యప్ పటేల్. గుజరాతీ మూలాలున్న వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్ అత్యంత విశ్వసించే నాయకుడు. ట్రంప్ కూడా తెలివైన న్యాయవాది అని కొనియాడే కశ్యప్ పటేల్.. కొత్త ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవిని చేపట్టనున్నారు.
44 ఏళ్లకే సీబీఐ అధిపతి స్థాయికి
ఎఫ్‌బీఐ అంటే మన సీబీఐలాంటిది. అలాంటి అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థకు కేవలం 44 ఏళ్ల వయసులోనే అధిపతి అవుతున్నారు కశ్యప్ పటేల్. ఈయన అమెరికాలో కాష్ పటేల్ గా సుప్రసిద్ధులు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడు అయినప్పుడు కాష్ పటేల్.. రక్షణ శాఖలో చీఫ్ ఆఫ్ స్టాఫ్, నేషనల్ ఇంటెలిజెన్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్, జాతీయ భద్రతా మండలిలోని ఉగ్రవాద నిరోధక విభాగంలో సీనియర్ డైరెక్టర్ గా పనిచేశారు. అలా ట్రంప్ నకు వీర విధేయుడిగా పేరుగడించారు.
గుజరాత్ మూలాలున్న కాష్ పటేల్ తల్లిదండ్రులు తొలుత ఉగాండాలో ఉన్నారు. అక్కడ నియంత ఈడీ అమీన్ అరాచకాలను భరించలేక 1970ల్లో అమెరికాలోని లాంగ్ ఐలండ్ లో స్థిరపడ్డారు. 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో కశ్యప్ జన్మించారు. కాగా, ఈయన
భారత ప్రధాని మోదీకి వీరాభిమాని. అమెరికా అధ్యక్ష హోదాలో ట్రంప్ భారత్ లో పర్యటించిన సమయంలో ఆయన ప్రసంగంలో సచిన్, వివేకానందుడు వంటి పేర్లు వచ్చేలా కాష్ పటేల్ కీలక పాత్ర పోషించారు.
కాగా, ఇరాన్ హ్యాకర్లు కాష్ పటేల్ కమ్యూనికేషన్లు తాజాగా హ్యాక్ చేశారు. ట్రంప్ తొలివిడత పాలనలో ఇరాన్ కు వ్యతిరేకంగా కాష్ పనిచేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది. సైబర్ దాడులపై ఎఫ్‌బీఐ కాష్ పటేల్, ట్రంప్ బృందానికి సమాచారం ఇచ్చారు. ట్రంప్ కీలక న్యాయవాది, అమెరికా కొత్త డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే సెల్ ఫోన్ ను గత నెలలో చైనీయులు హ్యాక్ చేయడం గమనార్హం. జూన్‌లో కూడా ట్రంప్ సహచరుడు, ప్రచార బృందంలో కీలక సభ్యుడైన రోజర్ స్టోన్ ఈమెయిల్స్ ను ఇరాన్ బృందాలు హ్యాక్ చేశాయి. పశ్చిమాసియా, ఉక్రెయిన్-రష్యా యుద్ధాల నేపథ్యంలో ఇవన్నీ కీలక పరిణామాలుగానే చూడాలి.