Begin typing your search above and press return to search.

నిప్పు తోక తొక్కిన ఇరాన్.. ఇప్పుడేం జరుగుతుందో?

ఎర్బిల్ లోని కాన్సులేట్ పైనే గాక.. పశ్చిమ ఇరాక్ లోని అల్- అసద్‌ లోని అమెరికా ఎయిర్ బేస్‌ పైనా క్షిపణి దాడులకు దిగింది ఇరాన్.

By:  Tupaki Desk   |   21 Jan 2024 5:59 AM GMT
నిప్పు తోక తొక్కిన ఇరాన్.. ఇప్పుడేం జరుగుతుందో?
X

సహజ మిత్రులు అంటే ఎలా ఉంటారో తెలియదు కానీ.. సహజ శత్రువులు అంటే మాత్రం ఆ రెండు దేశాలే.. ఉప్పు నిప్పు కంటే చిటపటలాడుతూ వాటి మధ్య సంబంధాలు అత్యంత దారుణంగా ఉంటాయి.. అలాంటిది అసలే ఉద్రిక్తతల సమయంలో రెచ్చగొట్టే చర్యలు జరిగితే ఇంకేమైనా ఉందా..? ఇపుడదే పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన ఇరాన్ ఇప్పటికే అమెరికాకు అనవసరంగా అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా అమెరికా తోకనే తొక్కింది. ఇక ఎంతటి విపత్తు జరుగుతుందో చూడాలి..

పశ్చిమాసియా అంటేనే ఓ పుండు.. ఇజ్రాయెల్-పాలస్తీనా ఓవైపు.. ఇరాన్-ఇరాక్ మరోవైపు. సిరియా, ఈజిప్టు కూడా ఎప్పుడు పేలతాయో తెలియని బాంబులాంటివే. అలాంటిచోట రెండు నెలల కిందట హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడికి తెగబడ్డారు. ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధ మేఘాలు ఇప్పట్లో వీడేలా లేవని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఎర్ర సముద్రంలో హౌతీ ఉగ్రవాదులు అమెరికా వాణిజ్య నౌకలను లక్ష్యగా చేసుకుంటూ చికాకు పుట్టిస్తున్నారు. వారికి యెమెన్, ఇరాన్ మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యెమెన్‌ ‌పై అమెరికా దాడికి దిగింది. హౌతి తిరుగుబాటుదారుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. బ్రిటన్ సహా వివిధ దేశాల సహకారంతో తీసుకుంటోంది. హౌతీల నుంచి సముద్ర మార్గాన్ని తిరిగి ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇరాన్ క్షిపణి వయా ఇరాక్..

రెండు దశాబ్దాలుగా ఇరాక్ ఓ సంక్షుభిత దేశం. 30 ఏళ్ల కిందట సద్దాం హుస్సేన్ హయాంలో ఇరాన్ తో యుద్ధంలో తలపడినప్పుడు ఆ దేశానికి బ్యాడ్ టైం మొదలైంది. సద్దాం చనిపోయినా.. ఇరాక్-ఇరాన్ ఇప్పటికీ శత్రుదేశాలే. కాగా, ఉత్తర ఇరాక్‌ లోని ఎర్బిల్ నగరంలో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయ భవనంపై క్షిపణలను ప్రయోగించింది ఇరాక్. దీంతో నలుగురు చనిపోయారు. అంతేగాక.. దాడులకు తామే కారణమని ఇరానియన్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. ఎర్బిల్‌ లోని అమెరికన్ కాన్సులేట్.. గూఢచర్య కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని ఆరోపించింది. తమకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాల మద్దతును అమెరికా కూడగట్టుకుంటోందని పేర్కొంది.

ఎయిర్ బేస్ పై క్షిపణులు..

ఎర్బిల్ లోని కాన్సులేట్ పైనే గాక.. పశ్చిమ ఇరాక్ లోని అల్- అసద్‌ లోని అమెరికా ఎయిర్ బేస్‌ పైనా క్షిపణి దాడులకు దిగింది ఇరాన్. దీంట్లో అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని అమెరికా రక్షణ విభాగం ప్రధాన కార్యాలయం పెంటగాన్ ధ్రువీకరించడం గమనార్హం. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దాడి వెనుక ఇరాన్ మిలిటెంట్ గ్రూపులు ఉన్నట్లు అనుమానిస్తున్నామని అమెరికా పేర్కొంది. దాడి తీవ్రత గురించి ఆరా తీస్తున్నట్లు తెలిపింది. పలువురు సైనికుల తలకు తీవ్ర గాయాలైనట్లు వివరించింది.

అమెరికా ప్రతీకారం ఎలా ఉంటుందో??

ఇరాన్ అంటేనే కస్సున లేచే అమెరికా.. ఇప్పుడు ఎలా స్పందిస్తుంది? అనేది చర్చనీయాంశం. దాడిని ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు తెలియడంతో అమెరికా సహించడం కష్టమే. ఇరాన్ ను నేరుగా టార్గెట్ చేసుకుంటుందా..? లేక వేరే విధంగా దెబ్బకొడుతుందా? అనేది చూడాలి. ఏదిఏమైనా ఇప్పటికే పశ్చిమాసియా రగులుతోంది. ఆ ప్రాంతంలో అమెరికాకు అత్యంత నమ్మకస్తుడైన ఇజ్రాయెల్ యుద్ధంలో ఉంది. ఇలాంటి సమయంలో ఇరాన్ తమ చిరకాల శత్రువు అమెరికాను లక్ష్యంగా చేసుకుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి..?