హమాస్ కు ఆ దేశం మద్దతు!
ఇజ్రాయెల్ పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ.. హమాస్ ఏకకాలంలో 5 వేల రాకెట్లతో దాడికి దిగిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 Oct 2023 9:46 AM GMTఇజ్రాయెల్ పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ.. హమాస్ ఏకకాలంలో 5 వేల రాకెట్లతో దాడికి దిగిన సంగతి తెలిసిందే. గగనతలం, భూతలం, సముద్రం ఇలా అన్ని వైపులా ఇజ్రాయెల్ పై ఏకకాలంలో హమాస్ ఉగ్రవాదులు దాడి చేయడంతో ఇజ్రాయెల్ బిత్తరపోయింది. ఉగ్రవాదులు ఇజ్రాయెల్ లోకి ప్రవేశించి దొరికినవారిని దొరికినట్టు కాల్చిచంపడంతోపాటు పలువురు సైనికులను, ప్రజలను బందీలుగా పట్టుకున్నారు.
ఈ క్రమంలో ఇజ్రాయెల్ లో ఉత్సాహంగా జరుగుతున్న ఓ డ్యాన్స్ పార్టీలో హమాస్ ఉగ్రవాదులు రక్తపుటేర్లు పారించారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు నిస్సహాయంగా పరుగులు తీస్తున్నవారిని పిట్టల్లా కాల్చిచంపారు. కొద్దిసేపట్లోనే ఆ పార్టీ జరుగుతున్న పొలం మరుభూమిని తలిపించేలా మారిపోయిందంటే ఉగ్రవాదులు ఏ స్థాయిలో మారణకాండ సృష్టించారో అర్థమవుతోంది. మృతుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.
ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గాజా–ఇజ్రాయెల్ సరిహద్దుల వద్ద ఓ పొలంలో ఒక డ్యాన్స్ పార్టీ నిర్వహిస్తున్నారు. ఇజ్రాయెల్ లో సుక్కోట్ సెలవులు సందర్భంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఇజ్రాయెల్ ప్రజలు దీనికి హాజరయ్యారు.
డ్యాన్స్ పార్టీ కావడంతో అప్పటి వరకూ ఆ ప్రాంతమంతా కేరింతలతో ఉత్సాహంగా ఉంది. ఇంతలోనే ఒక్కసారిగా ఆకాశం నుంచి రాకెట్లు వారి పైకి దూసుకొచ్చాయి. మరోవైపు తూటాలతో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ప్రాణాలు రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, అది పొలం కావడంతో తలదాచుకొనేందుకు సురక్షిత ప్రదేశమే కనిపించలేదు.
కొద్ది సేపటికి రాకెట్ల దాడి ఆగిపోవడంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆ పార్టీకి హాజరైన అతిథులు కార్లను ఒకేసారి తీయడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అప్పటికే ఆ ప్రాంతంలోకి వచ్చిన హమాస్ ఉగ్రవాద బృందాలు దొరికినవారిని దొరికినట్టు కాల్చిచంపాయి. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన కార్ల కాన్వాయ్‌ను కూడా వదలకుండా తూటాల వర్షం కురిపించారు. దీంతో చాలా మంది వాహనాల్లోనే ప్రాణాలు విడిచారు.
మరోవైపు ఇజ్రాయెల్ పై తాము చేసిన మెరుపు దాడికి ఇరాన్ మద్దతు ఉందని మిలిటెంట్ సంస్థ హమాస్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి ఘాజీ హమీద్ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ కూడా ఈ దాడుల వెనుక ఇరాన్ హస్తం ఉండే అవకాశం ఉందని బలంగా నమ్ముతూ వస్తోంది. తాజాగా హమీద్ ప్రకటనతో అది నిజమని స్పష్టమైంది.
మరోవైపు ఇరాన్ కూడా హమాస్ దాడిని ఆత్మరక్షణగా అభివర్ణించడం గమనార్హం. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అణచివేతకు గురైనా పాలస్తీనా ప్రజలు ఆత్మరక్షణ కోసం చేసిన దాడిగా దీనిని పేర్కొనడం గమనార్హం.
మరోవైపు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఫోన్ లో మాట్లాడారు. వెస్ట్‌బ్యాంక్ లో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పాలని కోరారు. అదే సమయంలో ఇజ్రాయెల్ పై జరిగిన ఉగ్రదాడులను బ్లింకన్ ఖండించారు ఆ ప్రాంతంలోని దేశాలు కూడా ఈ దాడిని ఖండించాలని సూచించారు.
మరోవైపు తమ పౌరులను కాపాడుకోవడానికి అవసరమైన ఏ చర్యలనైనా చేపడతామని ఐరాస భద్రతా మండలికి ఇజ్రాయెల్ ప్రతినిధి గలీద్ ఎర్డాన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తాజాగా భద్రతా మండలి సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం గాజా పట్టీ నుంచి జరుగుతున్న దాడుల నుంచి తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని తేల్చిచెప్పారు.