Begin typing your search above and press return to search.

నస్రల్లాకు ఇరాక్ అరుదైన గౌరవం... మరణంపై లెబనాన్ కీలక వ్యాఖ్యలు!

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధవాతావారణంపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Oct 2024 1:30 PM GMT
నస్రల్లాకు ఇరాక్  అరుదైన గౌరవం... మరణంపై లెబనాన్  కీలక వ్యాఖ్యలు!
X

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధవాతావారణంపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది ప్రాంతీయ యుద్ధంగానే ముగుస్తుందా.. లేక, ప్రపంచ యుద్ధంగా మారుతుందా అనే చర్చ మొదలైంది. ప్రధానంగా హెజ్ బొల్లా అధినేత హసన్ నస్రల్లా తర్వాత పరిణామాలు మారాయి.

గతవారం బీరుట్ పై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన భీకర దాడుల్లో హెజ్ బొల్లా అధినేత హసన్ నస్రల్లా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మరణంపై లెబనాన్ కీలక వ్యాఖ్యలు చేయగా.. అతని మరణానికి నివాళిగా ఇరాక్ కీలక ఆలోచన చేసింది. ఇందులో భాగంగా 100 మంది పిల్లలకు నస్రల్లా పేరు పెట్టింది.

అవును... గతవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్ బొల్లా అధినేత హసన్ నస్రల్లా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నస్రల్లా మరణంపై లెబనాన్ మంత్రి అబ్ధల్లా బౌ హబీబ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... హత్యకు ముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తో నస్రుల్లా కాల్పుల విరమణకు అంగీకరించారని చెప్పారు.

దీనికి సంబంధించిన వివరాలను అమెరికా, ఫ్రాన్స్ ప్రతినిధులకు కూడా తెలియజేసినట్లు మంత్రి తెలిపారు. ఇలా సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన కాసేపటికే బంకర్ లో తలదాచుకున్న నస్రల్లాను నెతన్యాహు హత్య చేయించారని లెబనాన్ మంత్రి వెల్లడించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మరోపక్క నస్రల్లా మరణానికి నివాళిగా ఇరాక్ లోని వందమంది శిశువులకు నస్రల్లా పేరు పెట్టారు. ఈ మేరకు ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. మరోపక్క నస్రల్లా మృతి చెందిన అనంతరం.. ఆ హత్యను నిరసిస్తూ దేశంలోని పలు నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన ఇరాక్ ప్రధానమంత్రి మహమ్మద్ షియా అల్ సుదానీ... నీతిమంతుడైన నస్రల్లా అమరవీరుడు అని అభివర్ణించారు. ఇదిలా ఉండగా... హసన్ నస్రల్లా అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.