Begin typing your search above and press return to search.

ఇరాన్ రాయబారితో మస్క్ కు పనేంటి..? రహస్య భేటీ మాటేంటి?

తాజాగా ఈ ఆంక్షల తొలగింపుపై మస్క్-ఇరవానీ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   15 Nov 2024 6:37 AM GMT
ఇరాన్ రాయబారితో మస్క్ కు పనేంటి..? రహస్య భేటీ మాటేంటి?
X

రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందడంతో అపర కుబేరుడు, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ హవా నడుస్తోంది. అది ఎంతగా అంటే.. మస్క్ కు అత్యంత కీలక బాధ్యతలు అప్పగించేంత.. ట్రంప్ ఎన్నికల ప్రచారానికి రూ.400 కోట్లకు పైగా విరాళం ఇచ్చిన మస్క్.. ఆయనకు నేరుగానూ మద్దతు పలికారు. ఎన్నికల్లో ట్రంప్ గెలుపుతో టెస్లా షేర్ల విలువ పెరిగింది. రూ.2 లక్షల కోట్ల వరకు మస్క్ సంపదకు జత చేరాయి. ఇదంతా పక్కనపెడితే.. ట్రంప్ తన కార్యవర్గంలో మస్క్ కూ చోటివ్వడం ఖాయమైంది.

భారతీయుడితో పాటు..

వచ్చే జనవరిలో రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్.. కొత్త కార్యవర్గంలో ఎలాన్‌ మస్క్‌ కు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్‌) విభాగం బాధ్యతలు అప్పగించారు. 38 ఏళ్ల ప్రవాస భారతీయుడు వివేక్‌ రామస్వామితో పాటు సంయుక్త సారథిగా నియమించారు. మరోవైపు ఎన్నికల్లో గెలిచాక ట్రంప్‌ పలువురు దేశాధినేతలకు ఫోన్‌ చేశారు. ఆ సమయంలో మస్క్‌ ఆయన పక్కనే ఉన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ట్రంప్ తో పాటు మస్క్ మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి.

ఇరాన్ రాయబారిని కలిశారా?

హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మధ్యలో హిజ్బుల్లా, ఇరాన్ ప్రమేయంతో పశ్చిమాసియా పుండులా రగులుతోంది. ఇజ్రాయెల్ గనుక ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేస్తే పరిస్థితి తీవ్రంగా మారనుంది. ఇజ్రాయెల్ ను ఇప్పటికే అమెరికా శాంతింపజేస్తోంది. మరోవైపు ఇరాన్‌ ను హెచ్చరిస్తోంది. ఇలాంటి సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐక్యరాజ్య సమితిలో టెహ్రాన్‌ రాయబారి అమీర్‌ సయీద్‌ ఇరవానితో మస్క్‌ భేటీ అయ్యారు. వీరిద్దరూ రహస్య ప్రదేశంలో గంటకు పైగా చర్చలు జరిపారట. అమెరికాతో ఉద్రిక్తతల విషయమే వీరు మాట్లాడినట్లు, సమావేశం విజయవంతంగా ముగిసినట్లు సమాచారం.

ఆంక్షలు తొలగిస్తారా?

ఇరాన్ ను అమెరికా బద్ధ శత్రువుగా చూస్తుంది. ఆ దేశంపై ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది. తాజాగా ఈ ఆంక్షల తొలగింపుపై మస్క్-ఇరవానీ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఆంక్షలను తొలగించి తమతో వాణిజ్యం చేయాలని ఇరవానీ కోరారట. కాగా, ఈ సమావేశంపై ట్రంప్‌-మస్క్‌, సమితిలోని ఇరాన్‌ మిషన్‌ నుంచి ధ్రువీకరణ లేదు. కాగా, మస్క్-ఇరవానీ భేటీ నిజమే అయితే.. ఇరాన్ తో సంబంధాలను పునరుద్ధరించుకునే ఆలోచన ట్రంప్‌ నకు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇజ్రాయెల్ కు అడ్డు

ఇరాన్‌ సైనిక స్థావరాలపై దాడులకు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఇటీవల ఆదేశాలిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశాన్ని కట్టడి చేయగలిగేది అమెరికానే. అదే సమయంలో ఇరాన్‌ పట్ల ట్రంప్ సానుకూల వైఖరి చూపడం గమనార్హం.