ఐరన్ డోం, 65 కి.మీ. కంచె ఉంది... ఇజ్రాయేల్ లో లోపం ఎక్కడుంది?
వాస్తవానికి హమాస్ నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్థంగా ఎదుర్కోవడానికి ఇజ్రాయేలు ప్రధానంగా ఇనుప కంచె, ఐరన్ డోం వ్యవస్థ ఉంది. అయినా కూడా ఇంత డ్యామేజ్ ఎందుకు జరిగింది.
By: Tupaki Desk | 9 Oct 2023 11:19 AM GMTప్రస్తుతం ప్రపంచమంతా చర్చించుకుంటున్న అంశం ఇజ్రాయేల్ పై హామాస్ చేస్తున్న దాడి! ఇజ్రాయేల్ కు ఉన్న బలం, బలగం తో పోలిస్తే హమాస్ కున్న బలం, బలగం చాలా చిన్నదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇజ్రాయేల్ కు ఉగ్రవాద దాడులను ఎదుర్కోవడం కూడా కొత్త కాదు. అయితే ఈసారి జరిగిన ఇంత దారుణానికి గల కారణాలు ఏమిటి.. లోపాలు ఎక్కడున్నాయి అనే విషయం తెరపైకి వచ్చింది.
అవును... ఉగ్రవాద దాడులను ఎదుర్కోవడం అనేది ఇజ్రాయేల్ కు కొత్తేమీ కాదు.. పైగా అది వారికి పెద్ద విషయం కూడా కాదు. అయితే ఈసారి ఇజ్రాయెల్ సైన్యంలో సన్నద్ధత లోపించడమే ప్రధాన ప్రాథమిక కారణం అని అంటున్నారు. వాస్తవానికి హమాస్ నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్థంగా ఎదుర్కోవడానికి ఇజ్రాయేలు ప్రధానంగా ఇనుప కంచె, ఐరన్ డోం వ్యవస్థ ఉంది. అయినా కూడా ఇంత డ్యామేజ్ ఎందుకు జరిగింది.
పాలస్తీనాలో ఉన్న గాజా వెంబడి ఇజ్రాయెల్ కు సరిహద్దు ఉంది. దాని గుండా హమాస్ ఉగ్రవాదులు చొరబాట్లకు పాల్పడుతుంటారు. ఈ నేపథ్యంలో నేలపైన, సొరంగాల గుండా ఎదురవుతున్న హమాస్ ముప్పును తిప్పికొట్టడానికి ఇజ్రాయెల్ ఒక ఆలోచన చేసింది.. అదే ఇనుప కంచె! ఇది అత్యంత దుర్భేద్యమైనది అని చెబుతుంటారు.
సుమారు 1200 మంది కార్మికులు మూడేల్ల పాటు శ్రమిస్తే... 2021లో హైటెక్ కంచెను ఇజ్రాయెల్ పూర్తిచేసింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 110 కోట్ల అమెరికన్ డాలర్లు ఖర్చయ్యాయని చెబుతుంటారు. ఈ కంచె 65 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. భూమిపైనే కాకుండా... భూమిలోపల కూడా ఇది వ్యాపించి ఉంటుంది. ఇదే సమంలో సముద్రంలోనూ కొంతవరకూ విస్తరించి ఉంటుంది.
ఇందులో భాగంగా ఈ కాంక్రీట్ నిర్మాణానికిపైన సుమారు ఆరు మీటర్ల ఎత్తయిన ఉక్కు కంచెను ఏర్పాటు చేశారు. అందులో రాడార్లతో కూడిన నిఘా సెన్సర్లు, రిమోట్ కంట్రోల్ తో పనిచేసే ఆయుధాలు ఉంటాయి. వీటి ద్వారా సరిహద్దుల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. అయితే ఉహించకుండా జరిగేదే ప్రమాధం, విపత్తు అన్నట్లుగా... ఎవరి విషయంలో ఇజ్రాయేల్ నిర్లక్ష్యంగా ఉందో.. అక్కడి నుంచే ముప్పు వచ్చింది.
కారణం... హెజ్బొల్లా, ఇరాన్ లతో పోలిస్తే హమాస్ నుంచి పెద్దగా ముప్పు ఉండబోదన్న ధైర్యంతో ఇంతకాలం ఇజ్రాయెల్ ఉండిపోయింది. ఈ నేపథ్యంలో పటిష్ఠమైన కంచె నిర్మించినప్పటికీ దాని వెంబడి సరిపడా బలగాలను మోహరించలేదని తెలుస్తుంది. దీంతో... మిలిటెంట్లు కంచెను నాశనం చేసి మరీ తమ భూభాగంలోకి చొచ్చుకురావడం ఇజ్రాయెల్ ను పూర్తి విస్మయంలో పడేసింది.
ఇక మరో అత్యంత కీలకమైన దుర్భేద్యమైన రక్షణ... ఐరన్ డోం. అవును... ఐరన్ డోం అనేది ప్రపంచంలోనే అత్యుత్తమ గగనతల రక్షణ వ్యవస్థల్లో ఒకటి అని చెబుతారు. ఇది ఇజ్రాయేల్ దేశంలో బోర్డర్ వెంట పలుచోట్ల ఏర్పాటు చేశారు. వాస్తవానికి 2006లో జరిగిన లెబనాన్ ఘర్షణల సమయంలో హెజ్బొల్లా.. ఇజ్రాయెల్ పై వేల రాకెట్లతో విరుచుకుడటంతో అనేకమంది పౌరులు ఇందులో ప్రాణాలు కోల్పోయారు.
ఈ సమయలో క్షణాల వ్యవధిలో వందల సంఖ్యలో విరుచుకుపడే రాకెట్ లనుంచి రక్షించుకోవడం కోసం స్వీయ గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఇజ్రాయెల్ భావించింది. ఇందులో భాగంగా... ఆ మేరకు ఇజ్రాయెల్ కు చెందిన రఫేల్ సంస్థ 2011లో ఐరన్ డోంను వినియోగంలోకి తెచ్చింది. ఇది తమ దేశంపైకి వచ్చే శతృ రాకెట్ లను గాల్లోనే ధ్వంసం చేస్తుంది.
అయితే ఇంత పగడ్భంధీ వ్యవస్థలో ఉన్న లోపాలపై హమాస్ గతకొంతకాలంగా అధ్యయనం చేస్తుందని తెలుస్తుంది. ఒకేసారి వందల సంఖ్యలో రాకెట్లను ప్రయోగిస్తే... దీని ప్రభావాన్ని తగ్గించొచ్చని భావించింది. ఈ నేపథ్యంలో... 20 నిమిషాల్లో 5 వేలకుపైగా రాకెట్లను ప్రయోగించింది. దీంతో... వాటన్నింటినీ అతిస్వల్ప వ్యవధిలో ఢీ కొట్టి అడ్డుకోవడం ఐరన్ డోం కు సాధ్యం కాలేదు.
ఇలా ఒకపక్క నిర్లక్ష్యం.. మరోపక్క ఐరన్ డోం లోని లోపాల ఫలితంగా... ఈ ఊహించని దాడిలో ఇజ్రాయేల్ చాలా పెద్ద నష్టాన్ని చూసిందని చెబుతున్నారు.