టీడీపీలోకి ఆళ్ల నానీ... స్థానిక నేతలతో బాబు మాటలకు అర్థం?
ఈ క్రమంలో తాజాగా ఆళ్ల నాటి టీడీపీ ఎంట్రీపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చినట్లేనా అనే చర్చ తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 5 Dec 2024 12:27 PM GMTఏపీ రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక ఆసక్తికర పరిణామం జరుగుతునే ఉంటుందని.. ఏపీలో పాలిటిక్స్ ఎవ్రీ మినిట్ ఆన్ లైవ్ అని అంటుంటారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో మాత్రమే కాదు.. ఎప్పుడూ ఈ హడావిడి ఉంటూనే ఉంటుంది! ఈ క్రమంలో తాజాగా ఆళ్ల నాటి టీడీపీ ఎంట్రీపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చినట్లేనా అనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నేతలు పలువురు పార్టీలు మారిన సంగతి తెలిసిందే. వాస్తవానికి 11 స్థానాలు మాత్రమే గెలిచిన పార్టీలో జరగాల్సినన్ని జంపింగులు జరిగాయా.. లేదా, అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. మాజీ మంత్రి ఆళ్ల నాని పేరు గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తుంది.
అయితే.. ఆళ్ల నాని టీడీపీలో చేరే విషయంపై స్థానిక నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. ప్రధానంగా ఆళ్ల నాటి టీడీపీలో చేరికపై ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై చంద్రబాబును కలిసి తన అభిప్రాయం వెల్లడించారని అంటున్నారు.
ఇందులో భాగంగా... ఆళ్ల నానీని పార్టీలో చేర్చుకునే విషయంలో మరోసారి ఆలోచించాలని.. నానీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏలూరులో టీడీపీ శ్రేణులను విపరీతంగా వేధించారని.. పలువురిపై అక్రమ కేసులు పెట్టించారని.. వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని.. చంద్రబాబు వద్ద చెప్పినట్లు తెలుస్తోంది.
గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆళ్ల నాని.. టీడీపీ కార్యకర్తల ఇళ్లను సైతం కూలగొట్టించిన ఘటనలు ఉన్నాయని, ఆయన పార్టీలోకి రావడం వల్ల కొత్తగా ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని.. ఈ విషయంపై పునరాలోచన చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు రాధాకృష్ణ తెలిపారని అంటున్నారు.
అయితే... రాధాకృష్ణ చెప్పిన విషయాలపై స్పందించిన చంద్రబాబు... మీరు చెప్పిన విషయాలన్నీ పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో... పార్టీ బలోపేతం కోసం తీసుకునే నిర్ణయాలు ఎలాంటి వైనా సహకరించాలని చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారని అంటున్నారు.
దీంతో... మాజీ మంత్రి, ఆళ్ల నాని టీడీపీలో చేరికపై చంద్రబాబు తుది నిర్ణయం ఏమిటనేది ఆసక్తిగా మారుతోంది.