మొత్తానికి ఆళ్ల నాని సైకిలెక్కేశారు !
ఆయనను ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు.
By: Tupaki Desk | 13 Feb 2025 5:14 PM GMTపశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరిపోయారు. ఆయనను ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి టీడీపీ తమ్ముడిగా స్వీకరించారు.
ఇదిలా ఉంటే వైసీపీ ఎనిమిది నెలల క్రితం ఓటమి పాలైన తరువాత తొలి వికెట్ డౌన్ అయింది ఆళ్ళ నానితోనే. ఆయన సైలెంట్ గానే బాంబు పేల్చారు. మొదట వైసీపీ పదవులకు ఆ మీదట పార్టీకి రాజీనామా చేసిన ఆయన రాజకీయాలకు కొంతకాలం విరామం అని చెప్పారు.
కానీ అదే సమయంలో టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆయన టీడీపీలో చేరడాన్ని స్థానిక నేతలు అడ్డుకున్నారని ప్రచారం సాగింది. ముఖ్యంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాక్రిష్ణయ్య ఆళ్ళ నాని రాకను తీవ్రంగా వ్యతిరేకించారు అని ప్రచారం సాగింది.
ఆ తరువాత కొందరు ద్వితీయ శ్రేణి నేతలు కూడా నాని రాకను వ్యతిరేకిస్తూ వచ్చారని చెప్పుకున్నారు. దీంతో చాలా నెలల క్రితమే ఆళ్ళ నాని టీడీపీలో చేరాల్సి ఉన్నా అది ఆగిపోయింది. ఇక ఆళ్ళ నాని ఒకసారి మంచి ముహూర్తం పెట్టుకుని భారీ వాహనాలతో ఏలూరు నుంచి మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం దాకా ర్యాలీ చేసి మరీ పార్టీలో చేరాలని అనుకున్నారు.
కానీ ఆఖరు నిముషంలో అది రద్దు అయింది. ఇక తాజాగా చూస్తే చడీ చప్పుడూ లేకుండా గురువారం రాత్రి తన అనుచరులతో సీఎం ని కలసి ఆళ్ళ నాని పసుపు కండువా కప్పుకున్నారు. దీంతో ఈ రోజు నుంచి ఆయన అధికార టీడీపీ నాయకుడు అయ్యారు. ఆళ్ళ నానిని పార్టీలో చేర్చుకోవడం వెనక ఆయన బలమైన సామాజిక నేపథ్యం తో పాటు గట్టి నాయకుడు అన్న కారణాలు ఉన్నాయని అంటున్నారు.
ఫ్యూచర్ లో నియోజకవర్గాల పునర్ విభజనలో ఆళ్ళ నానికి చోటు దక్కుతుందని అంతా భావిస్తున్నారు. అందుకే ఏలూరు నియోజకవర్గంలో నేతలు కాదని అన్నా భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకునే ఆళ్ళను పార్టీలోకి తీసుకున్నారు అని అంటున్నారు.
ఇక ఆళ్ళ విషయానికి వస్తే ఆయన కాంగ్రెస్ నుంచి 2004, 2009లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ వైసీపీ హయాంలో 2019లో గెలిచారు. ఆయన వైసీపీలో 2014కి ముందు చేరారు, ఆయన ఓడినా వైసీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీ ఇచ్చింది. అలాగే 2019లో ఆయనను ఉప ముఖ్యమంత్రిగా చేసి కీలకమైన శాఖలను అప్పగించింది.
వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడు జగన్ కి అత్యంత సన్నిహితుడు అయిన ఆళ్ళ నాని వైసీపీని వీడుతారు అని ఎవరూ అనుకోలేదు. అయితే ఆయన 2022లో తన మంత్రి పదవిని తీసివేయడంతో అసంతృప్తికి లోను అయ్యారని చెబుతారు. ఇక 2024లో పార్టీ ఓటమి పాలు కాగానే ఆయన బయటకు రావాలని అనుకున్నారు. ఎట్టలేకలకు ఆయన అనుకున్నట్లుగా టీడీపీలో చేరారు. వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు ఎమ్మెల్యేగా గెలిచి ఆయనతో సాన్నిహిత్యం నెరపిన ఆళ్ళ నాని బాబు ముఖ్యమంత్రిగా ఉండగా టీడీపీలో చేరడం ఒక రాజకీయ విశేషం. మరి ఆయన టీడీపీలో ఏ విధంగా తనదైన రాజకీయ మార్క్ ని చూపిస్తారో చూడాల్సి ఉంది.