అల్లు అర్జున్ కు బెయిల్ రద్దు కాబోతుందా..?... సీపీ కీలక నోటీసులు!
అవును.. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ కేసు కీలక మలుపు తిరగబోతోందా అనే ప్రశ్న తాజాగా తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 17 Dec 2024 11:43 AM GMTసంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ కు ప్రస్తుతం హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో... నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన అనంతరం అల్లు అర్జున్ చంచల్ గూడ జైల్ నుంచి విడుదలయ్యారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.
అవును.. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ కేసు కీలక మలుపు తిరగబోతోందా అనే ప్రశ్న తాజాగా తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఇంగ్లిష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా.. అల్లు అర్జున్ కు మంజూరైన మధ్యంతర బెయిల్ ను సవాల్ చేస్తూ హైదరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందనే కథనాలు వస్తున్నాయి.
డిసెంబర్ 13న అతని నివాసం నుంచి అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చిక్కడపల్లి స్టేషన్ కు తరలించి, వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే.. అదే రోజు సాయంత్రం హైకోర్టులో బెయిల్ మంజూరు చేయబడింది. దీంతో.. చంచల్ గూడ జైల్లో ఒక రాత్రి గడిపిన అల్లు అర్జున్ డిసెంబర్ 14 ఉదయం విడుదలయ్యారు.
అయితే... పుష్ప-2 ప్రీమియర్ కు అల్లు అర్జున్, రష్మిక ను అనుమతించవద్దని సంధ్య థియేటర్ యాజమాన్యానికి పోలీసులు సూచించినట్లు కథనాలొస్తున్నాయని అంటున్నారు. స్టార్స్ ప్రీమియర్స్ కు హాజరైతే జనాలను కంట్రోల్ చేయడం సాధ్యం కాదని థియేటర్ యాజమాన్యాలకు సమాచారం అందించినట్లు పోలీసులు చెప్పారనీ కథనాలొస్తున్నాయి!
దీంతో... పోలీసులు ఈ వ్యవహారంపై హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ బెయిల్ ఆర్డర్ ను ఉపసంహరించుకోవాలని అధికారులు హైకోర్టును ఆశ్రయించనున్నారని.. ఈ మేరకు ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారని అంటున్నారు. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.
సంధ్య థియేటర్ కు షోకాజ్ నోటీసులు!:
సంచలనంగా మారిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఈ థియేటర్ కు సీపీ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటనపై లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని సీపీ నోటీసుల్లో పేర్కొన్నారు!
గాయపడ్డ బాలుడిని పరామర్శించిన సీపీ!:
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో బాలుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. ఆ బాలుడిని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరామర్శించారు. ఈ సందర్భంగా... బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు తెలుస్తోంది!