ఏపీ అంటే అప్పు చేసి పప్పుకూడు ?
ఇక విభజనతో చూస్తే ఏపీ దారుణంగా నష్టపోయింది అనే చెప్పాలి. విభజన చట్టం లోని హామీలేవీ పూర్తిగా అమలు కాలేదు.
By: Tupaki Desk | 2 March 2025 9:24 AM ISTఉమ్మడి ఏపీకి అప్పులు ఉన్నా తీర్చే సదుపాయాలు ఉన్నాయి. అతి పెద్ద రాజధాని హైదరాబాద్ ఉండడమే ఒక ధీమాగా ఉండేది. ఇక విభజనతో చూస్తే ఏపీ దారుణంగా నష్టపోయింది అనే చెప్పాలి. విభజన చట్టం లోని హామీలేవీ పూర్తిగా అమలు కాలేదు. ఉమ్మడి ఆస్తుల లెక్కలు తేలలేదు.
ఏపీలో ఏకంగా తొంబై వేల అప్పులతో 18 వేల దాకా రెవిన్యూ లోటుతో 2014లో విడిపోయింది. అది లగాయితూ అప్పులూ రెవిన్యూ లోటూ అలా పెరుగుతూనే ఉన్నాయి. ఏపీలో తొలి అయిదేళ్ళూ టీడీపీ పాలన సాగింది. అప్పులు దాదాపుగా మూడున్నర నుంచి నాలుగు లక్షల దాకా ఆ ప్రభుత్వం చేసిందని వైసీపీ అధికారంలోకి వచ్చాక లెక్క తేల్చారు.
ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక మరో అయిదారు లక్షల కోట్లు అప్పులు చేసిందని చెబుతున్నారు. ఏ విధంగా చూసినా ఏపీ అప్పులు పది లక్షల కోట్ల పై మాటగానే ఉంది. గత తొమ్మిది నెలల టీడీపీ కూటమి పాలనలో ఇప్పటికే లక్షా నలభై వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారని వైసీపీ సహా విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి.
ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 3.22 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ చూస్తే ఏమున్నది గర్వకారణం అనిపించక మానదన్నది నిపుణుల మాటగా ఉంది. ఏపీ బడ్జెట్ లో ఏకంగా లక్ష కోట్ల రూపాయలు లోటు ఉంది దానిని ఎలా పూడుస్తారు అన్నది చెప్పలేదని అంటున్నాయి విపక్షాలు అలా లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేస్తే కానీ ఈ బడ్జెట్ లోని కేటాయింపులు పూర్తి చేసినట్లు కాదని అంటున్నారు.
ఇక్కడ మరో తమాషా ఉంది. ఫలానా దానికి ఫలానా లెక్కన నిధులు అందుతాయని అంచనా వేశారు. కానీ ఆర్థిక సంవత్సరం చివరికి కానీ ఏది ఎంత అందుతుంది అన్నది తేలదు. అలా చూస్తే భారీ బడ్జెట్ గా బయటకు ఇది కనిపిస్తునా వాస్తవాలని ప్రతిబింబించడంలేదని వామపక్షాలు అంటున్నాయి.
బడ్జెట్ లో ఎక్కడ నుంచి ఎంత ఆదాయం వస్తుంది అన్నది కూడా చెప్పారు. రూపాయికి 34 పైసలు పన్నుల ద్వారా వస్తుందని అంచనా వేశారు. కేంద్ర పన్నులలో వాటాగా మరో 18 పైసలు వస్తుంది. ఇతర ఆదాయాలను చూపించారు అలా మరో ఆరు పైసలు వస్తుంది. అంటే ఈ మూడూ కలిపిస్తే 58 పైసలు అయింది. అంటే ఇవి కచ్చితంగా దక్కే ఆదాయంగా చూడాలన్న మాట. కేంద్రం ఇచ్చే గ్రాంటులు మరో పది పైసలు కూడా కలుపుకుంటే 68 పైసలు రూపాయికి ఏపీకి దక్కుతుంది.
మరో 32 పైసలు మాత్రం లోటు ఉంది. అంటే ఇది 3.22 లక్షల కోట్లలో లెక్క తీసి చూస్తే ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు పైగానే లోటు కనిపిస్తోంది. ఇది ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంది. అంటే ఎలా అన్నదే ఇపుడు అర్ధం కావడం లేదు అని అంటున్నారు.
బడ్జెట్ లో చూస్తే వివిధ రంగాలకు కేటాయింపులు అని పెద్ద అంకెలనే పెట్టారు కానీ అవి ఆచరణకు ఎపుడు వచ్చేది అంటే నిధులు కేటాయించినపుడే అంటున్నారు. మరి నిధులు అంత ఉదారంగా కేటాయిస్తారా అన్నది కూడా మరో చర్చగా ఉంది.
దీని మీద ప్రభుత్వం అయితే ఏమీ చెప్పడం లేదు. లోటుని భర్తీ చేయడానికి ప్రభుత్వానికి ఉన్న మార్గాలు రెండే. ఒకటి భారీగా అప్పులు చేయడం. రెండవది దారుణంగా పన్నులు వడ్డించేసి జనాల మీద బాదుడు మొదలెట్టడం. ఈ రెండింటిలో పన్నులు వేస్తే కనుక జనాల నుంచి రాజకీయంగా ఇబ్బందులు వస్తాయి. ఎంత పన్నులు వేసినా లక్ష కోట్లు సమకూరడం కష్టం కాబట్టి అప్పులు ఎటూ తప్పవు. అలా మొత్తం కూటమి అయిదేళ్ళ పాలన పూర్తి అయ్యేసరికి మరో అయిదు లక్షల కోట్ల రూపాయల అప్పులు తప్పవని అంటున్నారు.
అంటే ఇప్పటిదాకా తొలి చంద్రబాబు అయిదేళ్ళ పాలన అప్పులు ఆ తరువాత జగన్ పాలన అప్పులకు కూటమి పాలన అప్పులు తోడు అయితే ఏపీ ఆర్ధికంగా ఎక్కడికి పోతుంది అన్న చర్చ ఉంది. అయితే ప్రభుత్వం సంపద సృష్టిస్తామని ఆదాయం పెంచుతామని చెబుతుంది కానీ అది ఓవర్ నైట్ అయ్యేది కాదు, అమరావతి పూర్తి కావడానికే అప్పులు చేస్తున్నారు. ఒకవేళ సకాలంలో అమరావతి పూర్తి అయి ఆదాయాలు వచ్చినా ఆ అప్పులను తీర్చడానికే సరిపోతుంది అన్న మాట ఉంది.
అమరావతి బ్రహ్మాండమైన రాజధానిగా మారడం అంటే మరో హైదరాబాద్ స్థాయికి చేరుకోవడానికి కచ్చితంగా రెండు దశాబ్దాల కాలం పడుతుంది అప్పటిదాకా అప్పులతోనే ఏపీ పప్పుకూడు చేసుకుంటే వెళ్తే ఒక రాష్ట్రంగా ఏపీకి సస్టైనబిలిటీ ఎంతవరకూ ఉంటుంది అన్నది ఒక ప్రశ్న. దీంతో దీర్ఘ కాలంలో ఎదురయ్యే పెను సవాల్ గానే చూస్తున్నారు అంతా.