పవన్ తోనే బిగ్ ట్రబుల్ ...బాబు నచ్చుతున్నారా ?
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొలిటికల్ హిస్టరీ చూస్తే ఆయన విమర్శలు కూడా తీవ్ర స్థాయిలో చేయరు.
By: Tupaki Desk | 5 Jan 2025 12:30 AM GMTటీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొలిటికల్ హిస్టరీ చూస్తే ఆయన విమర్శలు కూడా తీవ్ర స్థాయిలో చేయరు. ఇక అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆయన రాజకీయ కక్షలు కార్పణ్యాలు అంటూ తెర తీసిన సందర్భాలు కూడా ఆయన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎక్కడా కనిపించవు.
బాబు డెవలప్మెంట్ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. ఆయన ఫిలాసఫీ చాలా క్లియర్. రాజకీయాల్లో ఎవరికి ఎవరూ శత్రువులు కారు అని. శాశ్వత శత్రుత్వం అన్నది ఉండదని. బాబు ఎర్లీ సెవెంటీస్ లీడర్. దాంతో ఆయన ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగుతారు అని చెబుతారు.
ఆయన ఇప్పటికి నాలుగు సార్లు సీఎం గా ఉన్నా రాజకీయ ప్రత్యర్ధులను వెంటాడి వేధింపులకు గురి చేసిన ఘటనలు అయితే ఎక్కడా లేవు అని చెబుతారు. ఇక గత దశాబ్దంలో చూసుకుంటే 2014 నుంచి 2019 టెన్యూర్ లో బాబు వైసీపీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించారు. అది రాజకీయ వ్యూహంలో భాగమే తప్ప వైసీపీ నేతల మీద వేధింపులు అయితే పెద్దగా లేవు.
అయితే ఇపుడు కూటమికి నాయకుడుగా బాబు ఉన్నారు. ఇదే కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలాగే కుమారుడు నారా లోకేష్ కీలక శాఖలకు మంత్రిగా ఉంటూ తన ప్రాధాన్యతను చాటుకుంటున్నారు. దాంతో బాబు నాయకత్వంలోని ఈసారి ప్రభుత్వంలో వైసీపీకి 2014 నాటి రాజకీయ సన్నివేశాలు అయితే అసలు కనిపించడం లేదు అని అంటున్నారు.
కూటమి ఏడు నెలల పాలనలో వైసీపీ నేతల మీద కేసులు పడుతున్నాయి. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కూడా కేసులు ఉన్నాయి. ఇక మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అయితే ఏదో ఒక కేసులో కనిపిస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న వైసీపీ నేతలు అయితే వేధింపులు సాధింపులు ఎక్కువ అయ్యాయని కూటమి పాలనలో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు.
అదే సమయంలో చంద్రబాబు గురించి మంచిగా మాట్లాడుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి పేర్ని నాని అయితే చంద్రబాబు ఇంట్లో ఆడవారి మీద రాజకీయాలు చేయవద్దు అని వారించారని కూడా మీడియా ముఖంగా చెప్పారు. బాబు ఈ విధంగా వ్యవహరిస్తున్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం అసలు స్పేర్ చేయడం లేదు అని అంటున్నారు.
ఆయన పిఠాపురంలో హోం శాఖ మీద చేసిన కీలక వ్యాఖ్యల తరువాత వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద వరస కేసులు పడ్డాయని అంటున్నారు. అంతే కాదు వైసీపీ విషయంలో ఏ చిన్న అవకతవక బయటకు వచ్చినా పవన్ వెంటనే రియాక్ట్ అవుతున్నారు కడపలో ఎంపీడీవో మీద వైసీపీ నేత ఒకరు దాడి చేశారు అంటే అక్కడికి పవన్ వెళ్ళి మరీ వైసీపీ నేతలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
ఇక జగన్ కి చెందిన సరస్వతి పవర్ ప్రాజెక్ట్ లో ప్రభుత్వ భూములు ఉన్నాయని సర్వే చేయిచారు. తాను స్వయంగా అక్కడకు వెళ్ళి వైసీపీ అధినేత మీద హాట్ కామెంట్స్ చేశారు. ఎట్టకేలకు ఎంతో కొంత భూమి ఉందని కనుగొన్నారు కూడా.
మరో వైపు చూస్తే వైసీపీ కీలక నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి భూ కబ్జా ఆరోపణల మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గానే అధికారులతో విచారణకు ఆదేశించారు. వైసీపీ నేతల విషయంలో గత ప్రభుత్వంలో వారు చేసిన అక్రమాలు విషయంలో పవన్ దూకుడుగానే ఉంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఇదివరకులా ముందుకు అడుగులు వేయలేకపోతున్నారు అని అంటున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో అయితే చాలా ఫ్రీగా తిరిగిన వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వంలో సాగుతున్న ఈ రాజకీయ దూకుడు అసలు మింగుడుపడటం లేదు అని అంటున్నారు. ఒక విధంగా బాబు కంటే పవన్ తోనే బిగ్ ట్రబుల్ అన్నది ఫ్యాన్ పార్టీ నేతలకు బాగా అర్ధం అవుతోంది అని అంటున్నారు.