Begin typing your search above and press return to search.

నాగబాబు మీద బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం...ఎందువల్ల ?

బాలయ్యకు పద్మభూషణ్ వచ్చిన ఆనందంతో ఇప్పటిదాకా ఉన్న వారు ఇపుడు తన అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్ తనయుడుకి సొంత పార్టీలోనే అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు.

By:  Tupaki Desk   |   8 March 2025 11:00 PM IST
నాగబాబు మీద బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం...ఎందువల్ల ?
X

ఇటీవలనే పద్మభూషణ్ పౌర పురస్కారం అందుకున్న టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఇపుడు ఒక విషయంలో ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బాలయ్యకు పద్మభూషణ్ వచ్చిన ఆనందంతో ఇప్పటిదాకా ఉన్న వారు ఇపుడు తన అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్ తనయుడుకి సొంత పార్టీలోనే అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు.

బాలయ్య పొలిటికల్ గా చూస్తే నాలుగున్నర దశాబ్దాలుగా టీడీపీకి ఎంతో సేవ చేస్తూ వస్తున్నారు. ఆయన అనేక వందల వేల ప్రచార సభలలో పాలుపంచుకుని టీడీపీ విజయానికి కృషి చేశారు. అంతే కాదు అన్న గారికి ప్రియ పుత్రుడు. టీడీపీని స్థాపించినది ఎన్టీఆర్. అటువంటి పార్టీలో ఆయన కుమారుడు బాలయ్య పొజిషన్ ఏంటి అంటే జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే.

ఇదే బాలయ్య అభిమానుల ఆగ్రహానికి కారణం అవుతోంది. బాలయ్య తొలిసారి ఎమ్మెల్యే కాదు, వరసగా మూడు సార్లు హిందూపురం నుంచి గెలుచుకుని వచ్చారు. అలా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు క్రియేట్ చేశారు. మరి టీడీపీ కూటమి ప్రభుత్వంలో తొలిసారి ఎమ్మెల్యే అయిన వారు అంతా మంత్రులు అయిపోతున్నారు.

పోనీ సరే అనుకున్నా నాగబాబు ఇలా ఎమ్మెల్సీ నామినేషన్ వేసి అలా మినిస్టర్ కాబోతున్నారు అన్నది విస్తృతంగా ప్రచారం సాగుతోంది. నాగబాబు పొలిటికల్ ట్రాక్ రికార్డు చూసే ఒకసారి నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. కానీ ఇపుడు ఎమ్మెల్సీ అయి ఆ వెంటనే మంత్రి కాబోతున్నారు అంటే అక్కడ ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ఉండడమే అని అంటున్నారు.

అదే బాలయ్యకు కూడా వెనక ఎవరూ లేకపోవడం వల్లనే మూడు సార్లు ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి దక్కలేదని అంటున్నారు. ఆయన మేనల్లుడు కం అల్లుడు లోకేష్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి కీలక శాఖలు మంత్రిగా చూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తొలిసారి గెలిచి ఉప ముఖ్యమంత్రిగా వెలిగిపోతున్నారు. ఇపుడు నాగబాబు కూడా కేబినెట్ బెర్త్ దక్కించుకునేందుకు కడు దగ్గరలో ఉన్నారు.

బాలయ్య ఎన్టీఆర్ సీఎం గా ఉండగానే ఇలా ఎమ్మెల్యేగా అయి ఉంటే ఆయనను జస్ట్ ఎమ్మెల్యేగా ఉంచేసేవారా అన్న చర్చ సాగుతోంది. లోకేష్ పవన్ ల కంటే కూడా ఏనాడో బాలయ్య మినిస్టర్ అయి ఉండేవారు అని అంటున్నారు. టీడీపీ పార్టీ తనది అయి ఉండి కూడా బాలయ్యకు కనీసం మంత్రి పదవి దక్కక పోవడమేంది అని అంతా అంటున్నారు.

ఆయన 2014లో తొలిసారి గెలిచిన వెంటనే మంత్రి అవుతారని అనుకున్నారు. కానీ అది జరగలేదు. కానీ ఆ తర్వాత మూడేళ్ళకు లోకేష్ ఎమ్మెల్సీ అయి మంత్రి పదవులు అందుకున్నారు. పోనీ మేనల్లుడే కదా అని సరిపెట్టుకున్నా 2024 లో కూటమి వచ్చిన తరువాత జనసేన హవా ఎక్కువగా ఉందని అంటున్నారు. పవన్ తో పాటు నాగబాబు కూడా మంత్రులు అయితే లేని బాధ బాలయ్యకు మంత్రి పదవి ఇస్తే బంధుత్వాలు కుల సమీకరణలు వస్తాయా అని ఆయన అభిమానులు అంటున్నారు.

నిజానికి టీడీపీలో అన్న గారి కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది ఒక్క బాలయ్య మాత్రమే అని గుర్తు చేస్తున్నారు. మరి ఆ కోటాలో అయినా బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది కదా అంటున్నారు. బాలయ్య అయితే అడగడం లేదు కానీ అభిమానులు మాత్రం తమ హీరోకు అన్యాయం జరిగిపోతోంది అని అంటున్నారు. మరీ ముఖ్యంగా నాగబాబుకు బెర్త్ ఇస్తే మాత్రం ఇది మరింతగా పెరిగి పెద్దది అయ్యేలా ఉంది అని అంటున్నారు. చూడాలి మరి దీని మీద కూటమి పెద్దలు ఎలా నిర్ణయం తీసుకుంటారో.