Begin typing your search above and press return to search.

జమిలి ఎన్నికలు బీజేపీ కలే...విపక్షం ధీమా !

వాటిని కాదని ఎంత దూకుడు చేసినా ముందుకు పోవడం అసాధ్యమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

By:  Tupaki Desk   |   17 Dec 2024 11:30 PM GMT
జమిలి ఎన్నికలు బీజేపీ కలే...విపక్షం ధీమా  !
X

బీజేపీకి ఎన్నో రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి. అలాగే కలలూ ఉన్నాయి. అన్నీ తీరాలంటే సాధ్యం కాదు అని అంటున్నారు. ఎందుకంటే ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఏ ఒక్కరో ఏదీ నిర్ణయించలేరు. ప్రజా స్వామ్యంలో ప్రతిపక్షాలు బలంగా నిలబడతాయి. వాటిని కాదని ఎంత దూకుడు చేసినా ముందుకు పోవడం అసాధ్యమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

బీజేపీకి దేశమంతా ఒక్కటిగా ఉండాలన్నది ఇష్టం. ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నది అందులోనిదే. కానీ ఈ దేశం రాష్ట్రాల సమాఖ్య అన్నది కాంగ్రెస్ సహా విపక్షాల భావన. అదే వారి వాదన కూడా. కేంద్రం మిధ్య అన్నది కూడా విపక్షాలే. కానే కేంద్రమే సత్యం నిత్యం అన్నది బీజేపీ మార్క్ వాదనగా ఉంటుంది.

అందుకే ఎక్కడా ఈ రెండింటికీ కుదరదు. ఇపుడు జమిలి మాటున బలమైన కేంద్రం బలహీనమైన రాష్ట్రాలు అన్న కాన్సెప్ట్ ని తెచ్చి దేశంలో తన హవాను పూర్తిగా చాటుకోవాలని బీజేపీ చూస్తోంది అన్నది విపక్షాల గట్టి మాటగా ఉంది. అందుకే జమిలి బిల్లునే లోక్ సభలో ప్రవేశ పెట్టవద్దు అంటూ బలంగా వాదించారు.

ఇదిలా ఉంటే సాధారణ మెజారిటీతో బీజేపీ పార్లమెంట్ లో జమిలి బిల్లుని ప్రవేశ పెట్టగలిగింది. దాని వరకూ ఓకే కానీ ఆ బిల్లు ఆమోదం పొందుతుందా అంటే అసాధ్యం అన్నదే విపక్ష మాట. ఎందుకు ఎలా అంటే అంకెలను చూపించే వారు ధీమాగా చెబుతున్నారు.

జమిలి ఎన్నికల బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందాలీ అంటే మూడింట రెండు వంతుల సంఖ్యా బలం అవసరం. ఆ బలం బీజేపీకి లోక్ సభలోనూ లేదు, రాజ్యసభలోనూ లేదు. లోక్ సభలో 543 మంది ఎంపీలు ఉన్నారు. అందులో మూడింట రెండు వంతులు అంటే కచ్చితంగా 361 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు చేయాలి. ఎన్డీయే మొత్తం బలం కలిపితే 293 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 64 మంది ఎంపీల మద్దతు దొరకదు అని అంటున్నారు.

రాజ్యసభలో మొత్తం 250 మంది ఎంపీలు ఉంటే అందులో మూడింట రెండు వంతులు లెక్క తీస్తే 168 దాకా ఎంపీల మద్దతు అవసరం. అక్కడ కూడా ఎన్డీయేకు 120 మంది దాకానే బలం ఉంది. దాంతోనే జమిలి బిల్లు ఆమోదం పొందరు అన్నది విపక్షం ధీమాగా ఉంది అని అంటున్నారు.

ఈ విషయాలు అన్నీ బీజేపీ పెద్దలకు తెలియనివి కావు అని అంటున్నారు. అందుకే బిల్లుని జేపీసీకి పంపించాలని నిర్ణయించారు. కనీసంగా మూడు నెలల నుంచి గరిష్టంగా ఏడాదికి పైగా జేపీసీ గడువు ఉంటుంది. ఈలోగా ఏమైనా రాజకీయ పరిణామాలు అనుకూలం కాకపోతాయా అన్నది ఎన్డీయే పెద్దల ఆలోచన కావచ్చు అంటున్నారు.

కానీ కాలం గడిచే కొద్దీ ఉన్న బలం కూడా తగ్గుతుంది అన్నది విపక్షాల మాట. మొత్తానికి జమిలి ఎన్నికల పేరుతో బీజేపీ ఎంత జోరు చేసినా అది చట్టంగా ప్రస్తుత లోక్ సభలో ఆమోదం పొంది రావడం అసాధ్యం అనే విపక్షాలు అంటున్నాయి. చూడాలి మరి బీజేపీ వ్యూహాలు ఎలా ఉంటాయో ఏమో అన్నది.