Begin typing your search above and press return to search.

వైసీపీ ప్రత్యర్థి అని క్లారిటీ ఇచ్చిన బీజేపీ

లోక్ సభ రాజ్యసభ కలుపుకుని వేసిన ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అనేక పార్టీలకు చోటు దక్కింది.

By:  Tupaki Desk   |   19 Dec 2024 3:58 AM GMT
వైసీపీ ప్రత్యర్థి అని క్లారిటీ ఇచ్చిన బీజేపీ
X

జమిలి ఎన్నికల విషయంలో పూర్తిగా చర్చించి సమగ్రమైన నివేదికను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీని ఏర్పాటు చేసింది. జేపీసీలో వివిధ పార్టీలకు చెందిన మొత్తం 31 మంది ఎంపీలు ఉన్నారు. లోక్ సభ రాజ్యసభ కలుపుకుని వేసిన ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అనేక పార్టీలకు చోటు దక్కింది.

లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ఈ మేరకు జమిలి కోసం లోక్ సభలో మంగళవారం బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుల పరిశీలన కోసం కేంద్రం జేపీసీని వేసింది. లోక్ సభ నుంచి 21 మంది ఉంటే రాజ్యసభ నుంచి పది మందికి అవకాశం ఇచ్చారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జేపీసీలో ముగ్గురు ఎంపీలకు అవకాశం ఇచ్చారు. ఆ ముగ్గురూ ఏపీకి చెందిన వారే కావడం విశేషం.

వారు అనకాపల్లికి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్, అలాగే అమలాపురానికి చెందిన టీడీపీ ఎంపీ జీఎం హరీశ్ బాలయోగి, మచిలీపట్నానికి చెందిన జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి ఉన్నారు. ఇక వీరితో పాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక ఎంపీలు కనిపిస్తున్నారు.

వయనాడ్ నుంచి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన ప్రియాంకా గాంధీకి జేపీసీలో చోటు లభించింది. జేపీసీలో లోక్ సభ నుంచి ఉన్న 21 మంది సభ్యులలో పీపీ చౌదరి, బన్సూరి స్వరాజ్, పురుషోత్తంభాయ్ రూపాలా, అనురాగ్ సింగ్ ఠాకూర్, విష్ణు దయాల్ రామ్, భర్తృహరి మెహతాబ్, సంబిత్ పాత్ర, అనిల్ బలూని, విష్ణు దత్త శర్మ, మనీష్ తివారి, సుఖ్‌దేవ్ భగత్, ధర్మేంద్ర యాదవ్, కల్యాణ్ బెనర్జీ, టీఎం సెల్వ గణపతి, సుప్రియా సూలే, శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే, చందన్ చౌహాన్, ఉన్నారు. రాజ్యసభ నుంచి పది మంది సభ్యుల పేర్లను ప్రతిపాదించారు.

జేపీసీలో వైసీపీ ఎంపీలకు చోటు దక్కలేదు. అదే సమయంలో కేవలం రెండు ఎంపీలు ఉన్న జనసేనకు అవకాశం ఇచ్చారు. ఇక లోక్ సభలో నలుగురు వైసీపీ ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ఎనిమిది మంది ఉన్నారు. మొత్తంగా పన్నెండు మంది ఎంపీలు ఉన్న వైసీపీకి జేపీసీలో అవకాశం ఇవ్వకపోవడం ద్వారా ఎన్డీయే కూటమి వైసీపీని పూర్తిగా పక్కకు పెట్టిందని అంటున్నారు.

ఇలా ఎందుకు అంటే ఇటీవల కొన్ని కమిటీలలో వైసీపీకి అవకాశం ఇచ్చారు. మరి ఇపుడు చూస్తే కీలకమైన జమిలి ఎన్నికల విషయంలో వైసీపీకి చాన్స్ లేదని అంతా అంటున్నారు. వైసీపీని పూర్తిగా ప్రత్యర్థిగా కేంద్రంలోని బీజేపీ భావిస్తోంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా అంటున్నారు.

ఏపీలో ఉన్న మూడు పార్టీలూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి. వాటికే ప్రాముఖ్యత ఇస్తూ జేపీసీలో చాన్స్ ఇచ్చారని అంటున్నారు. ఇక్కడ తమాషా ఏంటి అంటే జమిలి ఎన్నికల బిల్లుని లోక్ సభలో ప్రవేశపెట్టడానికి జేపీసీకి పంపించడానికి వైసీపీ పూర్తిగా మద్దతు ఇచ్చింది. అయినా సరే ఆ పార్టీని పరిగణనలోకి తీసుకోలేదు అని అంటున్నారు.

జమిలి ఎన్నికలను వ్యతిరేకించిన తృణమూల్ కాంగ్రెస్ శరద్ పవార్ ఎన్సీపీ సహా ఇతర పార్టీలకు జేపీసీలో చోటు ఇచ్చి వైసీపీని పక్కన పెట్టడంతో ప్రతిపక్ష పార్టీలలో వైసీపీని గుర్తించడంలేదని ఒక విశ్లేషణగా ఉంది. మొత్తం మీద చూస్తే ఎన్డీయేకి ఇంకా మద్దతుగా ఉండాలని అనుకుంటే మాత్రం వైసీపీ ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని అంటున్నారు.