Begin typing your search above and press return to search.

జగన్ కోరిక తీరుస్తున్న కాంగ్రెస్...షర్మిలకు షాకేనా ?

జగన్ ని కోర్టు దాకా నడిపించాలని కూడా ఆమెకు కోరిక ఉన్నట్లుగా తాజాగా అదానీ ముడుపుల విషయంలో ఆమె చేసిన ప్రకటనలు తెలియచేస్తున్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   19 Dec 2024 7:30 AM GMT
జగన్ కోరిక తీరుస్తున్న కాంగ్రెస్...షర్మిలకు షాకేనా ?
X

వైసీపీ అధినేత జగన్ కి ఏపీలో ప్రత్యర్ధి ఎవరు అంటే అందరూ సహజంగా చెప్పే మాట టీడీపీ అని. కానీ నిజానికి టీడీపీ కంటే కూడా ఎక్కువగా జగన్ ని సాధిస్తున్నది మాత్రం సొంత చెల్లెమ్మ షర్మిల అన్నది కూడా కాస్తా నిశితంగా విశ్లేషించిన వారికి అర్ధం అయ్యే విషయం. జగన్ ని కోర్టు దాకా నడిపించాలని కూడా ఆమెకు కోరిక ఉన్నట్లుగా తాజాగా అదానీ ముడుపుల విషయంలో ఆమె చేసిన ప్రకటనలు తెలియచేస్తున్నాయని అంటున్నారు.

షర్మిలను ఏ ముహూర్తాన ఏపీసీసీ చీఫ్ గా చేశారో కానీ ఆమె జగన్ మీదనే తన మొత్తం బాణాలను ఎక్కుపెడుతున్నారు. అంతే కాదు ఆమె జగన్ వదిలిన బాణాన్ని అని ఒకనాడు చెప్పుకుని ఇపుడు అదే బాణం ఆయనకే గుచ్చేస్తున్నారు. ఆమెను కాంగ్రెస్ చీఫ్ గా నియమించడం వెనక అధినాయకత్వం ఆశించినది వేరు అయితే ఆమె చేస్తున్నది వేరు అని అంటున్నారు.

ఇక ఈ విషయంలో పూర్తిగా విసిగిన ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు అయితే హై కమాండ్ కి చెప్పాల్సినవి అన్నీ చెప్పేశారు అని అంటున్నారు. వాటిలో కాంగ్రెస్ పెద్దలకు పూర్తిగా డిస్టర్బ్ చేసినది బాగా హర్ట్ చేసినది ఏంటి అంటే ఏపీలో బీజేపీతో కలసి పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు సర్కార్ మీద షర్మిల అంతగా పోరాడడం లేదన్నది.

బీజేపీ అంటే అంతెత్తున లేచే జాతీయ కాంగ్రెస్ నేతలకు ఈ ఒక్క పాయింట్ మాత్రం అసలు మింగుడుపడటం లేదు అని అంటున్నారు. ఏపీ ప్రభుత్వంలో బీజేపీ మంత్రి ఉన్నారు. కేంద్రంలో టీడీపీ ఉంది. అలా చంద్రబాబు బీజేపీతో కలసి ఉన్న వేళ ఆయన మీద సాఫ్ట్ కార్నర్ చూపించాల్సిన అవసరం ఏంటి అన్నదే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు పట్టుకున్న విషయం అని అంటున్నారు.

దాంతో పాటు జగన్ ని ఇండియా కూటమిలోకి రప్పించాలని కూడా ఏపీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు కేంద్ర పెద్దలకు చెప్పారని అంటున్నారు. ఏపీలో ఇప్పట్లో అయితే కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసి గెలిచింది ఉండదని కూడా వారు వివరించారు అని అంటున్నారు. చంద్రబాబు అయితే వచ్చే ఎన్నికలలో సైతం బీజేపీతోనే పొత్తులతో వెళ్తారని అందువల్ల ఏపీలో జగన్ ఆల్టరేషన్ అన్నది కూడా వారు తెలియచేశారు అని అంటున్నారు.

ఇక జగన్ ని మచ్చిక చేసుకోవాలీ అంటే ఆయన మీద సొంత కుటుంబంలోని వ్యక్తిని ప్రయోగించి ఇబ్బంది పెట్టారు అన్న ఆగ్రహం కాంగ్రెస్ వైపు నుంచి ఉండరాదని కూడా సీనియర్లు చెప్పారని అంటున్నారు. పైగా షర్మిల వల్ల ఏపీ కాంగ్రెస్ ఎత్తి గిల్లడం లేదని కూడా డేటాతో సహా వివరించారని అంటున్నారు. మరో వైపు చూస్తే వైసీపీకి రాయలసీమలో ఆదరణ ఉందని, అలాగే కొన్ని సామాజిక వర్గాలలో అనుకూలత ఉందని అంటున్నారు.

అదే టైం లో గోదావరి జిల్లాలో ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటోందని కూడా కాంగ్రెస్ సీనియర్లు విశ్లేషించి హైకమాండ్ కి చెప్పారని అంటున్నారు. ముఖ్యంగా కాపులలో ఎక్కువ మొగ్గు కూటమి వైపు మళ్ళిందని అందువల్ల దానిని సెట్ చేసుకునే ప్రయత్నంలో వైసీపీ ఉందని చెబుతున్నారు.

అదే సమయంలో కాంగ్రెస్ వైపు నుంచి కాపులను ఆకట్టుకోవడానికి పీసీసీ చీఫ్ ఆ సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా సూచించారు అని అంటున్నారు. అలాగే గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తికి ఇస్తే కచ్చితంగా ఏపీలో కాంగ్రెస్ కి గుర్తింపు వస్తుందని జగన్ సైతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయని వివరించారని అంటున్నారు.

ఇక హైకమాండ్ కూడా ఏపీ పైన ఫోకస్ పెట్టిందని షర్మిల పనితీరు మీద వారు కూడా మధింపు చేశారని అంటున్నారు షర్మిలను తప్పించి కొత్తవారికి చాన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదనను కూడా సీరియస్ గానే పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. జగన్ ని తమ వైపు రప్పించుకుంటే 2029 ఎన్నికలలో కాంగ్రెస్ కి ఏపీలో కొన్ని సీట్లు అయినా దక్కుతాయని ఆ విధంగా పొత్తులకు జగన్ వైపు నుంచి సానుకూలత వ్యక్తం కావాలంటే అర్జంటుగా కొత్త నాయకత్వాన్ని జగన్ మెచ్చే నాయకుడిని ఏపీసీసీ ప్రెసిడెంట్ గా నియమించడం ఒక్కటే మార్గమని సీనియర్లు చెప్పారని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే షర్మిలకు కొత్త ఏడాదిలో పదవీ గండం పొంచి ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అదే జరిగితే ఆమె రాజకీయ ఉత్సాహం ఆమె ఆరాటం పోరాటం కూడా ఏమవుతాయన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి జగన్ కి ఇష్టమైన నిర్ణయమే కాంగ్రెస్ తీసుకుంటుందని వస్తున్న వార్తలలో నిజమెంత అనేది కొత్త ఏడాదిలోనే తెలుస్తుంది అని అంటున్నారు.