Begin typing your search above and press return to search.

డొనాల్డ్ ట్రంప్ ఏమైనా దేవుడా?

అవును... ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 50.1 శాతం ఓట్లతో 312 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను సాధించిన ట్రంప్ ఘనవిజయం సాధించారు.

By:  Tupaki Desk   |   16 Nov 2024 4:48 AM GMT
డొనాల్డ్  ట్రంప్  ఏమైనా దేవుడా?
X

అత్యంత ఆసక్తికరంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చాలా మంది అంచనాలను తలకిందులు చేస్తూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా డొనాల్డ్ ట్రంప్ పేరు మారుమోగిపోతోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఏ విషయం అయినా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు.

అవును... ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 50.1 శాతం ఓట్లతో 312 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను సాధించిన ట్రంప్ ఘనవిజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడటం మొదలై, ట్రంప్ గెలుపు కన్ ఫాం అయినప్పటి నుంచి.. ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ నామస్మరణ హోరెత్తి పోతోంది. అటు మిత్రదేశాలు, ఇటు శత్రుదేశాలు కూడా ట్రంప్ నిర్ణయాలు, ఆలోచనలపై తీవ్ర ఆసక్తిని కనబరుస్తోంది.

అగ్రరాజ్యం, ప్రపంచానికి పెద్దన్న వంటి పేర్లున్న అమెరికాకు అధ్యక్షుడు అనేది అత్యంత పవర్ ఫుల్ పోస్ట్. ఈ సమయంలో ఆ సింహాసనంపై కూర్చున్న వ్యక్తి తీసుకునే నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేస్తుంటాయి. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ఆ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎలాన్ మస్క్ సంపద పెరగడం, ఎక్స్ యూజర్లు తగ్గడం అనేది ఒక శాంపుల్ మాత్రమే!

బంగారం ధరలు:

ట్రంప్ ఆర్థిక విధానాలను మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నందువల్ల బంగారం ధరలు భారీగా తగ్గాయని అంటున్నారు. బలమైన డాలర్, ట్రెజరీ దిగుబడులు పెరగడం వల్ల బంగారం ధరల్లో క్షీణత కనిపిస్తుందని చెబుతున్నారు. ట్రంప్ దూకుడు వడ్డీ రేటు తగ్గింపులకు అనుకూలంగా ఉండకపోవడమే దీనికి కారణం అని అంటున్నారు.

భారత స్టాక్ మార్కెట్:

ఇదే సమయంలో భారత స్టాక్ మార్కెట్ పైనా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం కీలక ప్రభావం చూపించింది. ఇందులో భాగంగా... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన అనంతరం.. దేశీయ స్టాక్ మార్కెట్ లో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ మేరకు.. బీ.ఎస్.ఈ.లో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒక్క రోజే రూ.8 లక్షల కోట్లు పెరగడం గమనార్హం.

ఇమ్మిగ్రేషన్ ఆంక్షలు!

ఇదే క్రమంలో... అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ఎంచుకుని ప్రచారం చేపట్టిన ట్రంప్ మాటలను అమెరికా ప్రజలు బలంగా నమ్మారు. దీంతో... ఆ మాటకు కట్టుబడే ట్రంప్ పాలన ఉండబోతోందని అంటున్నారు. ఈ సమయంలో... గతంలో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇమ్మిగ్రేషన్ ఆంక్షల విషయంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటున్నారు. ఇందులో హెచ్-1బీ వీసా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

ఉద్యోగులపై ప్రభావం!

ఈ నేపథ్యంలో.. అమెరికా ఫస్ట్ అనే నినాదం వల్ల విదేశీయుల కంటే అమెరికన్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు.. వీసాల విషయంలోనూ కఠిన నిబంధనలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ప్రధానంగా... భారత్ నుంచి వచ్చి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, యూఎస్ లోనే ఉండి పనిచేయాలనుకునేవారికి సవాల్ అని చెబుతున్నారు!

ఎగుమతులపై అధిక సుంకాలు!

అదేవిధంగా... "మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్" అంటూ ట్రంప్ ఎత్తుకున్న నినాదం వల్ల.. తమ దేశంలోకి వచ్చే ఎగుమతులపై సుంకాలు కచ్చితంగా పెంచుతారని అంటున్నారు. ఇది ఎలక్ట్రానిక్స్ వంటి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. వీటితో పాటు జౌళి, రసాయనాలు, వాహన, ఔషద ఉత్పత్తుల ఎగుమతిదార్లు అధిక సుంకం చెల్లించాల్సి రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

యుద్ధాలు!

వీటితో పాటు రష్యా - ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉన్న వాతావరణం కూడా ఇప్పుడు ట్రంప్ చేతుల్లోనే ఉంది. ఇప్పటికె రష్యా - ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించిన ట్రంప్.. ఆ యుద్ధాన్ని ఆపేస్తానని తెలిపారు. ఇదే సమయంలో... పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు కృషి చేస్తామని అన్నారు. అయితే... రెండో హామీ విషయంలో పలు సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇరాన్ కు థ్రెట్ తప్పదనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

ట్రంప్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలవగానే... ఇరాన్ కు కరెన్సీ విలువ విషయంలో ఫస్ట్ దెబ్బ తగిలేసింది. ఇందులో భాగంగా... ఇరాన్ కరెన్సీ విలువ భారీగా క్షీణించింది. అది ఎంతలా అంటే... ఒక డాలర్ కు సుమారు 7.03 లక్షల రియాల్స్ స్థాయికి ఇరాన్ కరెన్సీ పతనమైపోయింది! ఈ సమయంలో ట్రంప్ నిర్ణయాలపై ఇరాన్ ఫ్యూచర్ డిసైడ్ అవుతుందని అంటున్నారు!

అబార్షన్ హక్కులు!

ఇదే సమయంలో... ట్రంప్ విక్టరీ ఎఫెక్ట్ గర్భ నిరోధక, గర్భస్రావ మాత్రలపైనా పడిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా.. ట్రంప్ వైట్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత అబార్షన్ హక్కులను జాతీయ స్థాయిలో రద్దు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే ఆందోళనలు మొదలయ్యాయని చెబుతున్నారు. దీంతో... వీటికి సంబంధించిన మాత్రలను ముందే కొని మహిళలు జాగ్రత్త పెట్టుకుంటున్నారట.

ఈ విధంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ ఎఫెక్ట్ కీలకంగా మారింది. అమెరిక మార్కెట్ అయినా, అంతర్జాతీయ మార్కెట్ అయినా, భారత్ మార్కెట్ అయినా, ఎగుమతులు - దిగుమతులు, ప్రపంచ వాణిజ్యంపైనా, బంగారు ధరలపైనా, ఉద్యోగాలు, వీసాలు, యుద్ధాలు, ప్రపంచ శాంతి... ఇలా దాదాపు అన్ని విషయాలపైనా ట్రంప్ ఎఫెక్ట్ ఉందని చెబుతున్నారు.

ట్రంప్ 2.0 యుగం!:

ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇప్పుడు ప్రపంచం అంతా ట్రంప్ మాయ అలుముకుంది.. "మాయ.. మాయ.. అంతా ట్రంప్ మాయ" అనే రాగాలూ వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది! ఇక ఈ నాలుగేళ్లూ ట్రంప్ 2.0 యుగం అన్నమాట!!