వైసీపీకి తలనొప్పిగా దువ్వాడ ?
వైఎస్సార్ ఆయనను జెడ్పీటీసీని చేస్తే జగన్ ఆయనను ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చి ప్రోత్సహించారు
By: Tupaki Desk | 12 Oct 2024 9:30 PM GMTశ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ జిల్లాలో అతి ముఖ్య నాయకుడు. వైసీపీకి ఉన్న నేతలలో ఆయన కూడా ఒకరు. ఆయన దూకుడుని చూసి వైసీపీ అధినేత జగన్ ప్రోత్సహించారు. వైఎస్సార్ ఆయనను జెడ్పీటీసీని చేస్తే జగన్ ఆయనను ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చి ప్రోత్సహించారు.
వాటిలో ఓడిన తరువాత ఆయనను పెద్దల సభకు పంపారు. టెక్కలి టీడీపీలో బలమైన నేత అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం. దాంతో ఆయనను ఎదుర్కొనేందుకు జగన్ దువ్వాడను ముందు పెడుతూ వచ్చారు. దువ్వాడ తమకు అప్పగించిన ఈ టాస్కులలో ఎంతవరకూ సక్సెస్ అయ్యారు అన్నది పక్కన పెడితే ఆయన వల్ల టెక్కలిలో టీడీపీకి కొంత అవరోధాలు అయితే కలిగాయి.
ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ గత కొద్ది నెలలుగా వివాదాలలో ఉండడం, ఆయన వ్యక్తిగత జీవితం టీడీపీ కూటమికి టార్గెట్ కావడం జరుగుతూ వస్తోంది. ఆయన ఒక మహిళతో సాన్నిహిత్యం పెంచుకోవడమే కాదు ఆమెను పెళ్ళి చేసుకుంటారు అని వార్తలూ ప్రచారంలో ఉన్నాయి.
ఇటీవల దువ్వాడ ఆయంతో పాటు ఆ మహిళ అయిన మాధురి ఇద్దరూ తిరుమలకు వెళ్ళి వచ్చారు. అక్కడ ఫోటో షూట్ చేశారు అన్న దాని మీద ఆరోపణలు రావడంతో మాధురి మీద పోలీసులు కేసు పెట్టారు. ఈ నేపధ్యంలో మీడియాతో మాట్లాడిన దువ్వాడ శ్రీనివాస్ తాము ఏ తప్పూ చేయలేదని అన్నారు.
తమ వ్యక్తిగత జీవితాన్ని కావాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు అని కూడా వాపోయారు. ఈ క్రమంలో ఆయన తన పార్టీ వైసీపీ కూడా తన వ్యక్తిగతాన్ని ఎపుడూ అడగదని అన్నారు. పార్టీ ఆ విధంగా కనుక వ్యవహరిస్తే పార్టీని సైతం తాను వదులుకోవడానికి సిద్ధం అన్నట్లుగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నిజానికి దువ్వాడ టీడీపీకి పూర్తి ప్రత్యర్థిగా ఉన్నారు. ఆయన శ్రీకాకుళంలో ఆ పార్టీకి మరీ ముఖ్యంగా కింజరాపు ఫ్యామిలీకి ఎదురు నిలిచి పోరాడుతున్నారు. ఆయన పోరాటానికి కాంగ్రెస్ అప్పట్లో ఎంత మద్దతు ఇచ్చినా వైసీపీ అయితే పూర్తి స్థాయిలో ఇచ్చింది. ఇపుడు వైసీపీ అండ అన్నది ఆయనకు చాలా అవసరం అంటున్నారు
అయితే దువ్వాడ మాత్రం తన వ్యక్తిగత జీవితం మీద రాళ్ళేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. ఆ విషయంలో ఎవరికీ వదిలేది లేదు అంటున్నారు. ప్రత్యర్ధులు అయినా రాజకీయంగానే తనను ఎదుర్కోవాలి తప్ప వ్యక్తిగతం ఎందుకు అని ఆయన అంటున్నారు. ఈ విషయంలో వైసీపీ అయినా దువ్వాడది అదే జవాబు గా ఉంది.
ఇప్పటికే రాజకీయంగా దువ్వాడను ఇబ్బందులు పెడుతున్న కూటమి ఇపుడు ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఆధారం చేసుకుని విమర్శలు చేస్తోంది. పోను పోనూ ఇది వైసీపీకి కూడా ఇబ్బందిగానే ఉంది అని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో వైసీపీ ఈ మొత్తం ఎపిసోడ్ ని చూసీ చూడనట్లుగా వదిలేస్తుందా అన్నదే ప్రశ్న.
వైసీపీ ఎమ్మెల్సీ అంటూ అటు మీడియా కానీ ఇటు కూటమిలోని ప్రత్యర్ధులు కానీ మాట్లాడుతున్నారు. దాంతో దువ్వాడ వ్యవహారం ముందు ముందు వైసీపీకి తలనొప్పిగా మారుతుందా అలా కనుక జరిగితే వైసీపీ ఏమి చేస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంది.తన సొంత వ్యవహారాలను ఎవరూ టచ్ చేయవద్దు అంటున్న దువ్వాడ వైసీపీ విషయంలోనూ అదే వైఖరితో ఉంటారా అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు.