Begin typing your search above and press return to search.

సీఎం రేసు నుంచి ఆయన తప్పుకుంటున్నారా..? ఆ ట్వీట్ దేనికి సంకేతం..?

దీంతో ఇక్కడ రాష్ట్రపతి పాలన తప్పదా అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   26 Nov 2024 5:21 AM GMT
సీఎం రేసు నుంచి ఆయన తప్పుకుంటున్నారా..? ఆ ట్వీట్ దేనికి సంకేతం..?
X

మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగిసేందుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ.. ఇక్కడ ఇప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థిని తేల్చలేకపోతున్నారు. దీంతో ఇక్కడ రాష్ట్రపతి పాలన తప్పదా అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే కీలక ట్వీట్ చేశారు.


ఎంతో ఉత్కంఠగా సాగిన మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను మహాయుతి కూటమి 230 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ సొంతంగా 132 స్థానాల్లో గెలుపొందింది. దీంతో అప్పటి నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై సంకటం కొనసాగుతూనే ఉంది. కూటమి తరఫున ఫడ్నవీస్, షిండేల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బిహార్ ఫార్ములా ప్రకారం ఏక్‌నాథ్ షిండేను కొనసాగించాలని శివసేన పట్టుబడుతోంది.

మరోవైపు.. నేటితో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తోంది. ఈ లోపే కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంది. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఎంతగానో అవసరం ఉంది. కానీ.. ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థి ఫైనల్ చేయడంలోనూ ఉన్న ప్రతిష్టంభన తొలగడం లేదు. ఒకవేళ సాయంత్రంలోపు కొత్త ప్రభుత్వం కొలువుదీరని పక్షంలో ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించక తప్పదు.

ఈ క్రమంలో శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే కీలక ట్వీట్ చేశారు. ఎన్నికల్లో మహయుతి ఘన విజయం సాధించడంతో తమ ప్రభుత్వం రాష్ట్రంలో మరోసారి అధికారం చేపడుతున్నదని వెల్లడించారు. మహాకూటమిగా తాము ఎన్నికల్లో కలిసి పోటీ చేశామని, నేటికీ కలిసే ఉన్నామని స్పష్టం చేశారు. ‘నాపై ప్రేమతో కొన్ని సంఘాల వారు నన్ను కలవడానికి ముంబయి వస్తామని అడుగుతున్నారు. వారి అభిమానానికి కృతజ్ఞతలు. నాకు మద్దతుగా ఎవరూ రావద్దు’ అని విజ్ఞప్తి చేశారు. శివసేన కార్యకర్తలు వర్ష నివాస్ వద్ద గానీ, మరెక్కడ కూడా గుమికూడవద్దని కోరారు.

మరోవైపు.. బీజేపీ తరఫున ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాల్సి వస్తే ఎవరు పీఠం ఎక్కుతారన్న అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో దేవండ్ర ఫడ్నవీస్ అవుతారా..? మరెవరికైనా అవకాశం దక్కుతుందా..? అన్న చర్చ తీవ్రంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఫడ్నవీస్ ఢిల్లీ వెళ్లడం కూడా చర్చకు దారితీసింది. తాను రాజకీయాల కోసం రాలేదని, పెళ్లి వేడుక కోసం వచ్చానని ఫడ్నవీస్ తెలిపారు. మొత్తానికి ఈ సాయంత్రం వరకు ఈ ఉత్కంఠ ఇలాగే కొనసాగుతుందా..? లేదంటే ఈ లోపే ముఖ్యమంత్రిని ఫైనల్ చేసి ప్రమాణ స్వీకారం చేయిస్తారా..? అనేది చూద్దాం.