ప్రపంచ కుబేరుడి చేతికి టిక్ టాక్
అదే సమయంలో ఇందులోని చిట్టి వీడియోలు చూసేందుకు గంటల సమయాన్ని వెచ్చించే ధోరణిపైనా విమర్శలు వచ్చాయి.
By: Tupaki Desk | 14 Jan 2025 6:30 AM GMTటిక్ టాక్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తక్కువ వ్యవధిలో ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎంతలా ఫేమస్ అయయిందో తెలిసిందే. అయితే.. ఈ సోషల్ మీడియా వేదిక మీద ఉన్న విమర్శలు.. ఆరోపణల నేపథ్యంలొ దీనిపై భారత్ లో నిషేధం విధించటం తెలిసిందే. అతి తక్కువ కాలంలో ఈ యాప్ అందరిని ఆకర్షించటమే కాదు.. ఒక వ్యసనంగా మారింది. ఇందులో వీడియోలు అప్ లోడ్ చేసేందుకు చూపించే క్రేజ్ పై ఆందోళన వ్యక్తమైంది. అదే సమయంలో ఇందులోని చిట్టి వీడియోలు చూసేందుకు గంటల సమయాన్ని వెచ్చించే ధోరణిపైనా విమర్శలు వచ్చాయి.
అదే సమయంలో భారత సర్కారు టిక్ టాక్ ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ యాప్ మీద అమెరికాలోనూ నిషేధం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. దాని నుంచి తప్పించుకునేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాల్ని చైనా అన్వేషిస్తోంది. ఈ క్రమంలో వారి చూపు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మీద పడింది. తాజాగా ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బ్లూమ్ బర్గ్ కథనం ప్రకారం 'టిక్ టాక్'ను ఎలాన్ మస్క్ కు అమ్మే అంశంపై చైనా ఆలోచిస్తున్నట్లుగా పేర్కొంది.
2017లో ప్రారంభమైన టిక్ టాక్ అనతి కాలంలో ఎంతలా పాపులర్ కావటం.. దీని వినియోగంపై పలు రాష్ట్రాలు ఆంక్షలు పెట్టటం తెలిసిందే. అమెరికా ప్రతినిధుల సభ సైతం టిక్ టాక్ యాజమాన్యాన్ని చైనా వదులుకోవాలి.. లేదంటే పూర్తిగా నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందంటూ చట్టసభలో ఒక బిల్లును సైతం తీసుకొచ్చారు. దీనిపై అమెరికా సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు సిద్ధమవుతున్న చైనా.. మరోవైపు ఎలాన్ మస్క్ కు అమ్మేసే దిశగా ప్రయత్నాలు షురూ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ఈ సమాచారం నిజమైతే.. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రెండు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలను సొంతం చేసుకున్న ఘనత ప్రపంచ కుబేరుడికి దక్కుతుందని చెప్పాలి.