Begin typing your search above and press return to search.

ఇండియా కూటమి మూడేళ్ళలోనే ముగుస్తుందా ?

చూస్తే 2024 లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అనుకున్న ఫలితాలు సాధించలేక చతికిలపడింది.

By:  Tupaki Desk   |   11 Jan 2025 4:14 AM GMT
ఇండియా కూటమి మూడేళ్ళలోనే ముగుస్తుందా ?
X

ఎన్డీయే కూటమికి పోటీగా మూడేళ్ళ క్రితం దేశంలో ఏర్పాటు అయింది ఇండియా కూటమి. ఇందులో జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్ కమ్యూనిస్టులతో పాటు కీలకమైన ప్రాంతీయ పార్టీలు జట్టుగా ఉన్నాయి. అన్నీ కలసి ఎన్డీయేను నిలువరించాలన్నది ఒక భారీ లక్ష్యంగా పెట్టుకున్నాయి. చూస్తే 2024 లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అనుకున్న ఫలితాలు సాధించలేక చతికిలపడింది.

అయితే ఇండియా కూటమికి అతి పెద్ద సమస్య ఏంటి అంటే నాయకత్వ సమస్య. ఇండియా కూటమి కట్టాలన్న ప్రతిపాదనను బీహార్ సీఎం నితీష్ కుమార్ తీసుకుని వచ్చారు. ఆయన ప్రధాని పీఠం మీద కన్నేసి ఎన్డీయే కూటమి నుంచి జరిగి విపక్షం వైపుగా వచ్చినదే అందుకు. ఆయన అన్ని పార్టీల గుమ్మం ఎక్కి జాతీయ స్థాయిలో బలమైన కూటమి కావాలని ప్రతిపాదించారు.

అందుకు ఆయనకు తెర వెనక కాంగ్రెస్ కూడా సాయం అందించింది. తీరా తొలి సమావేశంలోనే నితీష్ కుమార్ కి కన్వీనర్ బాధ్యతలు అప్పగిస్తారు అనుకుంటే అది జరగలేదు. ఆ తరువాత ఇండియా కూటమి తీరు చూసి నితీష్ మళ్లీ ఎన్డీయే వైపు మళ్ళారు. దాని వల్ల లోక్ సభ ఎన్నికల్లో ఆయన లాభపడ్డారు కూడా ఎక్కువ ఎంపీ సీట్లు సాధించి కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్రని పోషిస్తున్నారు.

ఇక నితీష్ ఒక్కరే కాదు చాలా మందికి ఇండియా కూటమి సారధ్యం వహించాలని కోరిక ఉంది. అందులో లాలూ యాదవ్, శరద్ పవార్ మమతా బెనర్జీ వంటి వారు ఉన్నారు. ఇపుడు అంతా కలసి మమతకు ఇండియా కూటమి బాధ్యతలు అప్పగించమని కోరుతున్నారు. ఈ విషయం అలా ఉండగానే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ తో పొత్తు లేకుండా ఆప్ పోటీకి దిగింది అయితే పదిహేనేళ్ళ పాటు ఢిల్లీని పాలించిన పార్టీగా కాంగ్రెస్ కూడా పోటీ పడుతోంది.

సరిగ్గా ఇక్కడే ఇండియా కూటమికి బీటలు వారే పరిణామాలు సంభవించాయి. ఆప్ కి ఢిల్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ లాలూ యాదవ్ తో సహా కీలక పార్టీల నాయకత్వమంతా మద్దతుగా నిలిచారు. ఆ విధంగా కాంగ్రెస్ ని ఒంటరి చేశారు. ఇండియా కూటమి నాయకత్వం డిమాండ్ తరువాత వచ్చిన కీలక పరిణామంగా దీనిని చూస్తున్నారు.

ఇండియా కూటమిని రద్దు చేయాలని కూడా సరికొత్త డిమాండ్ దీనితో పాటే వినిపిస్తోంది. ఈ విధంగా డిమాండ్ చేసిన వారు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత కాశ్మీర్ సీఎం అయిన ఒమర్ అబ్దుల్లా. కేవలం లోక్ సభ ఎన్నికల్లోనే పోటీ కోసం కట్టిన కూటమి కాబట్టి దానిని రద్దు చేయడమే మంచిదని ఆయన అంటున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇండియా కూటమి పార్టీల సమావేశం నిర్వహించి దీని మీద నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర ఎన్నికల తరువాత ఇండియా కూటమిలో విభేదాలు పెరిగాయని అంటున్నారు. కాంగ్రెస్ ని తప్పుకుని మమతా బెనర్జీకి బాధ్యతలు అప్పగించమని డిమాండ్ అలా వచ్చినదే.

దీని మీద కాంగ్రెస్ అధినాయకత్వం మౌనం వహిస్తోంది. ఇపుడు ఏకంగా ఇండియా కూటమినే రద్దు చేయమని డిమాండ్లు వస్తున్నయి. దాంతో ఎన్డీయేకి పోటీగా పుట్టిన ఇండియా కూటమి మూడేళ్ళలోనే ముగుస్తుందా అన్న చర్చ సాగుతోంది. బహుశా ఢిల్లీ ఎన్నికల తరువాత ఇండియా కూటమి జాతకం తేలనుంది అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.