Begin typing your search above and press return to search.

వాలంటీర్లకు బాబు శుభవార్త చెబుతున్నారా ?

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గడచిన నాలుగు నెలలుగా తమకు రావాల్సిన జీతాలను బకాయిలతో సహా చెల్లించాలని వారు కోరారు.

By:  Tupaki Desk   |   1 Oct 2024 3:29 PM GMT
వాలంటీర్లకు బాబు శుభవార్త చెబుతున్నారా ?
X

ఏపీలో వాలంటీర్లు ఉద్యమ బాట పట్టారు. ప్రతీ జిల్లాలో వారు ర్యాలీలు తీశారు. అలాగే సభలు సమావేశాలు పెట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గడచిన నాలుగు నెలలుగా తమకు రావాల్సిన జీతాలను బకాయిలతో సహా చెల్లించాలని వారు కోరారు.

తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పది వేల గౌరవ వేతనం ఇస్తూ తిరిగి విధులలోకి తీసుకోవాలని వారు కోరారు. లేకపోతే ఏకంగా సీఎం ఇంటిని ముట్టడిస్తామని వాలంటీర్లు స్పష్టం చేశారు. ఏపీ వ్యాప్తంగా రెండున్నర లక్షల దాకా వాలంటీర్లు ఉన్నారు. వీరంతా తమకు ప్రభుత్వం విధులలోకి తీసుకుని భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. అయితే వీరందరికీ తీసుకుని పది వేల వేతనం చెల్లించే స్తోమత అయితే ప్రభుత్వానికి ఇపుడు లేదు అని అంటున్నారు

అంతే కాదు వాలంటీర్లు లేకపోయినా పెన్షన్ పంపిణీ సాఫీగా సాగుతోంది. దాంతో పాటు వాలంటీర్ల సేవలు లేవని ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు. అసలు వారు ఏ విధులు చేయాలి వారిని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది కూడా ప్రభుత్వానికి అర్థం కావడంలేదు అని అంటున్నారు.

జగన్ ప్రభుత్వంలో వాలంటీర్లు పెన్షన్ సమయంలోనే బయటకు వచ్చేవారు. ఇక పౌర సేవలు అన్నీ సచివాలయాలకు వెళ్లి ప్రజలే చేసుకునేవారు ఏదైనా సమాచారం ప్రభుత్వం నుంచి చెప్పాలనుకున్నా లేక ప్రజల నుంచి సేకరించాలనుకున్నా అపుడు మాత్రమే ఇళ్ళ వద్దకు వచ్చేవారు.

ఇపుడు ప్రతీ సచివాలయంలో పది మంది దాకా పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. దాంతో వారికే పనులు లేవని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ వ్యాప్తంగా వారు లక్షా పాతిక వేల మంది దాకా ఉన్నారని అంటున్నారు. మరి వారి సేవలు పర్మనెంట్ కాబట్టి వారిని వివిధ విభాగాలకు వాడుకోవాలని చూస్తున్నారు.

దాంతో ప్రభుత్వానికి సిబ్బంది అయితే ఇపుడు పెద్దగా అవసరం లేదు. దాంతో వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం ఇంకా ఆలోచన దశలోనే ఉంది అని అంటున్నారు. ఆ విషయాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూల్ టూర్ లో చెప్పారు. వాలంటీర్లు లేకుండానే పెన్షన్ ఎలా ఇవ్వగలమో అమలు చేసి చూపించామని అన్నారు. అదే సమయంలో వాలంటీర్లను ఏ విధంగా వాడుకోవాలి అన్నది ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు.

అయితే ఇదే మాట గతంలో కూడా ప్రభుత్వం చెబుతూ వచ్చింది కాబట్టి వాలంటీర్లు తమకు కచ్చితమైన హామీ కావాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వ వర్గాల సమాచారం బట్టి చూస్తే వాలంటీర్లకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇచ్చి ఆ మీదట వారి సేవలను వివిధ విభాగాలకు వాడుకోవాలని చూస్తున్నారు.

అయితే ఆ ప్రక్రియ ఆలస్యం అవుతుంది కాబట్టి అప్పటిదాకా వారి విషయంలో ప్రభుత్వం ఏమీ చెప్పలేకపోతోంది. ఇక లక్షల మంది వాలంటీర్లు ప్రభుత్వానికి అవసరం లేదు. అంతే కాదు వాలంటీర్లను ఇప్పటికిపుడు తీసుకుని వేతనాలను పది వేలకు పెంచి ఇవ్వడానికి కూడా ఖజానా ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదు. మొత్తానికి వాలంటీర్ల విషయంలో వారు ఎన్ని ఆందోళలను చేసినా పూర్వ రూపంలో అయితే వారి సేవలు కానీ వారికి వేతనాలు కానీ దక్కే చాన్స్ అయితే లేదు.

కానీ కూటమి పెద్దలు ఎన్నికల్లో హామీ ఇచ్చారు కాబట్టి వారిలో అర్హత ఉన్న వారిని ఎంపిక చేసి నైపుణ్యంలో శిక్షణ ఇస్తారని అంటున్నారు. మొత్తానికి వాలంటీర్లు వైసీపీ హయాంలో మాదిరిగా తమ సేవలు ఉండాలని డిమాండ్ చేస్తే అది నెరవేరుతుంది అనుకోవడం భ్రమగానే ఉంటుంది అని అంటున్నారు.