Begin typing your search above and press return to search.

జగన్ కి కాదు షర్మిలకే నష్టం ?

వైసీపీకి 40 శాతం ఓటు బ్యాంక్ టీడీపీ కూటమి ప్రభంజనంలోనూ దక్కింది అంటే ఫ్యూచర్ ఉన్నట్లే లెక్క.

By:  Tupaki Desk   |   24 Oct 2024 8:30 PM GMT
జగన్ కి కాదు షర్మిలకే నష్టం ?
X

ఏపీలో రాజకీయం కాస్తా అన్నా వర్సెస్ చెల్లెలుగా మారిపోయింది. వైసీపీ కాంగ్రెస్ రెండూ విపక్షంలోనే ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం ఏపీలో ఏదీ అంటే ఠక్కున చెప్పాల్సింది వైసీపీ గురించే. నిన్నటి దాకా అధికారంలో ఉన్న పార్టీ. గ్రామ స్థాయి వరకూ పార్టీ నిర్మాణం ఉన్న పార్టీ అది.

ఇక జనాకర్షణ కలిగిన నేతగా జగన్ ఉన్నారు. వైసీపీకి 40 శాతం ఓటు బ్యాంక్ టీడీపీ కూటమి ప్రభంజనంలోనూ దక్కింది అంటే ఫ్యూచర్ ఉన్నట్లే లెక్క. అయితే రాజకీయంగా ప్రస్తుతం ఆ పార్టీ ఇబ్బందులు పడుతోంది. దానికి కారణం సొంత పార్టీలో నేతల జంపింగ్ ఒకటైతే రెండవది సాటి విపక్షం కాంగ్రెస్ నుంచి నేరుగా తాకుతున్న బాణాలు. అక్కడ ఉన్నది ఏవరో కాదు సొంత చెల్లెలు షర్మిల

ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నా ఆమె పోరాటం అంతా వైసీపీ మీద అందునా జగన్ మీద అన్నట్లుగా మారింది. ఆమె రాజకీయంగా పోరాటం వైసీపీ మీద చేస్తే ప్రయోజనం ఎంతో కొంత ఉండొచ్చు. కానీ ఆమె పోరాటం వ్యక్తిగతం అని లేటెస్ట్ డెవలప్మెంట్స్ తెలియచేస్తున్నాయి. తాజాగా ఆస్తుల విషయంలో కోర్టు దాకా వ్యవహారం వెళ్ళింది.

జగన్ బెయిల్ రద్దు విషయంలో తెర వెనక కుట్ర సాగుతోందని అందులో షర్మిల పావుగా మారారు అని వైసీపీ ఆరోపిస్తోంది. మరో వైపు చూస్తే షర్మిల మీడియాతో మాట్లాడినా కూడా జగన్ తనకు ఆస్తులు పంచడం లేదని అన్యాయం చేస్తున్నారని అంటున్నారు. ఇదంతా పూర్తిగా వ్యక్తిగతం. ఈ వ్యవహారాలు సెటిల్ కావాల్సింది కోర్టులలో మాత్రమే. దీనిని బయట పెట్టి జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రక్రియ అయితే ఈపాటికే పూర్తి అయింది.

ఎన్నడూ లేని విధంగా ఆయనకు 2024 ఎన్నికలలో గట్టి దెబ్బ తగిలింది. దాంతో జగన్ ప్రతిపక్ష హోదాకు కూడా కాకుండా పోయారు. ఆనాడు అన్న మాటలలో ఆస్తి వివాదాలు వచ్చాయి. సో ఇపుడు అవి కొత్తగా ఆరోపణలు అయితే కావు. ఇపుడు అయితే వ్యవహారం మరింత ముదిరి కోర్టు దాకా పోయింది.

అయితే మాత్రం జగన్ కి రాజకీయ నష్టం ఏమైనా ఉంటుందా అంటే ఆయన పూర్తిగా నష్టం చూసే ఉన్నారు. కొత్తగా ఉండేది ఏముంటుంది అని అంటున్న వారూ ఉన్నారు. 2024 ఎన్నికల వేళనే ఆ అస్త్రాన్ని షర్మిల సహా విపక్షాలు జగన్ మీద ప్రయోగించాయి. తల్లిని చెల్లెలుని ఇంటి నుంచి పంపించేశారు అని కూడా ఘాటైన విమర్శలు చేశారు.

వాటిని విన్న జనాలు కూడా ఇవన్నీ మామూలే అనుకున్నారో లేక ఆ ప్రభావం కూడా పడి మొత్తానికి మొత్తం ఓడించారో తెలియదు కానీ ఫలితం అయితే జగన్ అనుభవిస్తున్నారు. ఇపుడు ఆయనకు కొత్తగా పోయేది ఏమీ లేదు. జగన్ మీద ఇన్ని ఆరోపణలు ఉన్నా 40 శాతం ఓటు షేర్ వచ్చింది అంటే వాటిని పట్టించుకోని వారే ఎక్కువ ఉన్నారని అర్థం అంటున్నారు. రేపటి రోజున కూటమి ఫెయిల్యూర్స్ కనుక కలసి వస్తే ఆ పది శాతం ఓట్లు ఇటు టర్న్ అయితే వైసీపీకి రాజకీయ లాభం కూడా కలగవచ్చు అని అంటున్నారు.

ఇక షర్మిల విషయం తీసుకుంటే ఆమె పార్టీ కాంగ్రెస్. దానికి అధినాయకత్వం ఉంది. హై కమాండ్ నిర్ణయం మేరకే ఆమె నడచుకోవాలి. అక్కడ సొంత అజెండా అన్నది అసలు ఉండరాదు. ఏపీలో చూస్తే వైసీపీ నుంచి వలసలు ఎపుడో స్టార్ట్ అయ్యాయి. కానీ అవి జనసేన టీడీపీల వద్దకే ఆగిపోతున్నాయి తప్ప కాంగ్రెస్ వైపుగా రావడం లేదు. ఒక బలమైన నాయకుడు ఎవరూ ఈ వైపుగా తొంగి చూడడం లేదు.

ఆ విధంగా కాంగ్రెస్ చీఫ్ గా ఆమె తన నాయకత్వ దక్షతలను పరీక్షించుకోవాల్సి ఉంది. మరో వైపు కూటమి మీద ఈ నాలుగు అయిదు నెలలలో పోరాటం ఎంత మేరకు చేశారు అన్న చర్చ ఉండనే ఉంది. షర్మిల జగన్ ని టార్గెట్ చేస్తున్నారు అన్నది కూడా జనాల్లో ఉన్న ప్రచారం గా చెబుతున్నారు

అది మరింతగా ఎక్కువ అయితే మాత్రం అది షర్మిలకే నష్టం అని అంటున్నారు. కాంగ్రెస్ రాజకీయ అజెండా ఎక్కడ ఉంది అని కూడా అటు పార్టీ జనాలు ఇటు జనాల నుంచి ప్రశ్నలు ఎదురు అవవచ్చు. ఇక జగన్ మీద రేపటి రోజున షర్మిల ఏ విమర్శలు చేసినా వాటిలో చిత్తశుద్ధి కంటే సొంత కక్షలే ఉన్నాయని జనం ఇంకా గట్టిగా నమ్మే చాన్స్ ఉంది.

అందుకే జగన్ మాదిరిగా షర్మిల కూడా ఈ ఇష్యూని కోర్టు ద్వారానే సెటిల్ చేసుకోవడం బెటర్. ఎంతసేపూ అన్న అన్యాయం చేశారు ఆస్తులు అంటూ ఆమె మీడియా ముందు మాట్లాడితే అది కాంగ్రెస్ కి ఆమెకూ కూడా తీరని నష్టమే చేకూరుస్తుందని అంటున్నారు. మొత్తానికి ఏపీలో విపక్షాల మధ్య కీచులాటలు అన్నీ అధికార కూటమికే ఖుషీని ఇస్తున్నాయని అనుకోవాల్సి ఉంది.