వైసీపీ మొన్న-నిన్న-రేపు.. జగన్ స్వయంకృతం!
ఇక, 2019 నాటికి పాదయాత్ర ద్వారా కలిసి వచ్చిన సింపతీతో జగన్ విజయం దక్కించుకున్నారు.
By: Tupaki Desk | 19 Sep 2024 3:30 PM GMT2012లో ఆవిర్భవించిన యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్సార్ సీపీ) పరిస్థితి నానాటికీ దిగజారు తోంది. ఆది నుంచి అంతం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. స్వయం కృషితో పార్టీని పటిష్టం చేసుకున్న జగన్..ఇప్పుడు స్వయంకృత అపరాధాలతో సర్వనాశనం చేసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. 2014 ఎన్నికల సమయంలో అనేక మంది నాయకులు అనేక ఆశలతో వైసీపీ అధినేత జగన్ వెంట నడిచారు. వీరంతా సీనియర్లే. అయినా.. జగన్ ఇమేజ్, ఆయనకు ఉన్నా సానుభూతి, వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వం వంటివి పనిచేస్తాయన్న ఉద్దేశంతోనే వారంతా ఆయనకు జైకొట్టారు. కానీ, అప్పట్లో అధికారం మిస్సయింది.
ఇక, 2019 నాటికి పాదయాత్ర ద్వారా కలిసి వచ్చిన సింపతీతో జగన్ విజయం దక్కించుకున్నారు. అప్పటి కి ఎంవీ మైసూరారెడ్డి వంటి దగ్గజ నాయకులు పార్టీకి దూరమయ్యారు. అయినప్పటికీ.. పార్టీ నిలబడింది. దీనికి కారణం .. జగన్‌పై ఉన్న నమ్మకం.. ఆయనకు ఉన్న చరిష్మా. ఇదే 2019 ఎన్నికల్లో విజయం దక్కిం చేలా చేసింది. అయితే.. ఐదేళ్ల పాలన, అంతకు మించి పార్టీ పరంగా జగన్ వ్యవహరించిన తీరు వంటివి ఇబ్బందులు కొని తెచ్చాయి.
సర్వం సహా చక్రవర్తి అన్నట్టుగా జగన్ వ్యవహరించడాన్ని సీనియర్లు జీర్ణించుకోలేక పోయారు. పైగా... నేను బటన్ నొక్కుతాను.. మీరు ప్రజల్లో ఉండండి అని జగన్ ఆదేశించడం కూడా నాయకులకు నచ్చలేదు. అయినా.. ఏమో గుర్రం ఎగరావొచ్చు! అన్నట్టుగా మళ్లీ వచ్చే అవకాశం ఉందన్న ఆశతో కొనసాగారు. కానీ, తాజా ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. దరిమిలా.. నాయకులు జారుకుంటు న్నారు. ఈ జారుడు ఎందాకా? అంటే.. వైసీపీలో జగన్, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి కుటుంబ నాయకులు మిగిలే వరకు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
సో.. వైసీపీని చూసుకుంటే.. మొన్న బాగున్న పార్టీ.. నిన్న అధికారం దక్కించుకున్న పార్టీ.. రేపు.. అనామ కంగా మారబోతున్నదన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఒక పార్టీకి ఇబ్బందులు తప్పవు. వస్తాయి. కానీ, వచ్చిన సవాళ్లను ఎలా సరిచేసుకుంటున్నారన్నది కీలకం. ఈ విషయంలోనే జగన్ సంపూర్ణంగా విఫలమవుతున్నారు. తన పంథాను మార్చుకోలేక పోతున్నారు. ప్రభుత్వం పోయాక కూడా.. ఆయన దర్శనం నాయకులకు దుర్లభంగానే మారింది. ఇదే అసలు చిక్కు. కాబట్టి.. మొన్న బాగున్నా.. నిన్న అధికారం చలాయించినా.. రేపటిసంగతి చెప్పలేం! అన్నట్టుగానే మారిపోయింది. ఏదేమైనా అంతా జగన్ స్వయంకృతం!!