Begin typing your search above and press return to search.

కేసీఆర్ ని కాపీ కొడుతున్న జగన్!

ఇందులో భాగంగా... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష నేతలు ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి హారజుకావడం లేదు.

By:  Tupaki Desk   |   9 Nov 2024 4:13 AM GMT
కేసీఆర్  ని కాపీ కొడుతున్న జగన్!
X

రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఇప్పుడు ఓ కామన్ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష నేతలు ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి హారజుకావడం లేదు. ఈ విషయంలో.. తమ తమ గైర్హాజరీలపై ఎవరి వెర్షన్ వారు చెబుతున్నప్పటికీ.. వాటిని ప్రజలు ఏ రీతిగా పరిణగలోకి తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

సాధారణంగా అధికార పక్షం మరీ ఇబ్బందులు పెడుతుంటేనో.. లేక, మరో కారణంతోనో చాలా మంది ప్రతిపక్ష నేతలు ఛాలెంజ్ ల పేరు చెప్పి అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతుంటారు. ఈ మేరకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి! అనంతరం ప్రజల్లోకి వెళ్లి, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను, నియంతృత్వ వైఖరిని చెప్పుకుంటారు.

ఇలా చేసి, తిరిగి అసెంబ్లీలో ముఖ్యమంత్రులుగా హాజరైన వారూ ఉన్నారు. 2019 ఎన్నికల అనంతరం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఛాలెంజ్ చేసి బయటకు వెళ్లారు. ఇప్పుడు బంపర్ మెజారిటీతో సభలో సీఎంగా అడుగుపెట్టారు! అయితే... ఇప్పుడు అటు తెలంగాణలోనూ, ఇటు ఏపీలో రెండు విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు.

వాస్తవానికి తెలంగాణలో వరుసగా రెండుసార్లు సీఎంగా ఉన్న కేసీఆర్... కాంగ్రెస్ ప్రభుత్వ కొలువుదీరిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. తొలి శాసనసభ సమావేశాల సమయంలో తుంటికి గాయం కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆయన.. సభకు హాజరుకాలేదు. తర్వాత ఆరోగ్యం కాస్త కుదుటిపడ్డాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

దీంతో... ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని అంతా భావించారు! ఆ సమావేశాల తొలిరోజు కేసీఆర్ కనిపించలేదు. అమావాస్య కదా అందుకే ఆగి ఉంటారు.. రెండో రోజు కచ్చితంగా వస్తారు అని అనుకున్నారు. అయినా కనిపించలేదు. అలా... ఇప్పటివరకూ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు.

ఈ విషయంపై... కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కేసీఆర్ అవసరం లేదని, తాము చాలని కేటీఆర్, హరీష్ రావులు చెబుతున్నారు. అయితే... గజ్వేల్ ఎమ్మెల్యేగా అయినా కేసీఆర్ ఎంట్రీ అసెంబ్లీలో ఉండాలి కదా అనేది ఇక్కడ కీలకాంశం! మరి ఈ గైర్హాజరీని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి.

ఇక ఏపీ విషయానికొస్తే.. అక్కడ మరో రకం సమస్య ఉంది. ఏపీ అసెంబ్లీలో తాము తప్ప మరో పార్టీ లేదు.. అక్కడ ఉన్నదంతా అధికార పక్షమే కాబట్టి.. తమకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదు.. ఇస్తే సీఎం మాట్లాడిన తర్వాత తమకు అంతే సమయం మైక్ ఇవ్వాల్సి వస్తుందని.. అదే జరిగితే ప్రజా సమస్యలపై బలంగా ప్రశ్నిస్తామని భయపడే ఆ హోదా ఇవ్వడం లేదని జగన్ అంటున్నారు.

ఈ కారణం చెప్పి... ఆయన, ఆయనతో పాటు మిగిలిన 10 మంది వైసీపీ సభ్యులు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. అసెంబ్లీలో జరిగే చర్చాలపై మీడియాలో స్పందిస్తానని, తమకు ఏదో ఒక సమయం కేటాయించాలని, తమకు జర్నలిస్టులే స్పీకర్ అని చెప్పుకొస్తున్నారు. దీంతో... ప్రతిపక్ష నేత తర్వాత.. ముందు పులివెందుల ఎమ్మెల్యే అనే విషయం మరిచిపోతే ఎలా అని అధికార పార్టీ కౌంటర్స్ వేస్తోంది!

ఇలా పరిస్థితులు ఏవైనా.. కారణాలు మరేవైనా.. వాటిని ప్రైపక్ష నేతల సాకులని అధికారపార్టీ అంటున్నా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ (ప్రధాన) ప్రతిపక్ష పార్టీల నేతలు కేసీఆర్, జగన్ లు శానసభ సమావేశాలకు గైర్హాజరవుతునే ఉన్నారు. ఈ విషయంలో కేసీఆర్ ను జగన్ ఫాలో అవుతున్నారనుకోవాలా.. లేక, పరిస్థితులు అలా వచ్చాయనుకోవాలో తెలియదు కానీ... దీన్ని ప్రజలు ఎలా తీసుకుంటారనేదే ఇక్కడ కీలకం అని అంటున్నారు పరిశీలకులు.