ఎంపీలకు సుద్దులు చెప్పిన జగన్ తాను మాత్రం ?
ఏపీకి అన్యాయం జరుగుతోందని అందువల్ల గట్టిగా గళం విప్పాలని సూచించారు.
By: Tupaki Desk | 8 March 2025 6:00 AM ISTవైసీపీ అధినేత జగన్ తన పార్టీకి చెందిన ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. లోక్ సభలో ఉన్న నలుగురు, రాజ్యసభలో ఉన్న ఏడుగురు ఎంపీలతో ఆయన పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టి మరీ కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాలని కోరారు. ఏపీకి అన్యాయం జరుగుతోందని అందువల్ల గట్టిగా గళం విప్పాలని సూచించారు.
ప్రజా పక్షాన నిలిచి పార్లమెంట్ లో బలంగా వైసీపీ వాణిని వినిపించాలని కూడా కోరారు. అంతా బాగానే ఉంది. జగన్ చెప్పిన దాంట్లో ఏ మాత్రం తప్పు లేదు. విపక్ష ఎంపీలు కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి ఏపీకి న్యాయం చేయాల్సిందే. మరి ఏపీలో విపక్షంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారు అన్నదే సగటు జనం నుంచి వస్తున్న ప్రశ్నలు.
ఏపీలో కూడా వైసీపీ ఏకైక విపక్షంగా ఉంది. ఆ పార్టీ ఒక్కటే ప్రజా ప్రక్షంగా ఉండాల్సి ఉంది. 11 సీట్లు ఇచ్చారా లేక ఎన్ని ఇచ్చారా అన్నది ఇక్కడ ప్రశ్న కానే కాదు. ఆ మాటకు వస్తే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నంబర్ గేం అన్నది అధికారం కోసమే తప్ప మిగిలిన వాటికి కానే కాదు.
వామపక్షాలు ఒక్కరే సభలో సభ్యులుగా ఉన్నా ప్రజా సమస్యల మీద తమ గళం గట్టిగానే విప్పుతారు. తెలంగాణాలో మజ్లీస్ పార్టీకి ఎపుడూ ఏడు సీట్లే ఉంటాయి. కానీ వారి గొంతుని ఎవరైనా ఆపగలిగారా. ప్రజా సమస్యల మీద ఎలుగెత్తి చాటితే ఆపేది ఉండదు. ఒక వేళ ఆపాలని చూస్తే ఆ నింద అధికార పక్షం మీదనే వెళ్తుంది.
కానీ వైసీపీ పెద్దలు ఈ చిన్న లాజిక్ ని మిస్ అయి అసెంబ్లీకి రావడంలేదు. అంతే కాదు ప్రతిపక్ష హోదా కావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన వాటిని రాబట్టాలని ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని జగన్ అధినేత హోదాలో ఎంపీలకు పిలుపు ఇచ్చారు. మరి ఏపీలో అయిదు కోట్ల ప్రజల తరఫున ప్రతిపక్షంగా జగన్ కూడా అసెంబ్లీకి వెళ్ళాలి కదా అని అంటున్నారు.
ఆ విధంగా ఆయనకు దిశా నిర్దేశం ఎవరు చేస్తారు అన్నదే ఇపుడు అంతా ఆలోచిస్తున్నారు. అధినేతగా ఎదురులేదు కాబట్టి ఎంపీలకు ఆయన సుద్దులు చెబుతూ సూచనలు ఇస్తున్నారు. కానీ జగన్ ఎమ్మెల్యే ప్రతిపక్ష కూటమి తరఫున నాయకుడు. ఆయనకు కూడా అసెంబ్లీకి రమ్మని ఎవరు చెప్పాలి అన్నది అంతా చర్చిస్తున్నారు.
నాయకుడు అన్న వారు ముందు తాము ఆచరించి ఆ మీదట తమ వారికి చెబితే మరింత స్పూర్తివంతంగా ఉంటుందని అంటున్నారు. ఇక పార్లమెంట్ లో ఎలుగెత్తి చాటాలి అని జగన్ అనవచ్చు. అక్కడ వైసీపీ ప్రధాన ప్రతిపక్షం కాదే. అలాగే తరువాత వరసలో ఉన్న పార్టీ కూడా కాదే. వైసీపీకి తక్కువ నంబరే ఉంది. అయినా సరే స్పీకర్ మైక్ ఇస్తారని భావించి పార్లమెంట్ కి వెళ్తోంది. ఇవ్వకపోతే ఇవ్వాలని అభ్యర్ధిస్తుంది.
ఎందుకంటే ప్రజా సమస్యలు ప్రస్తావించాలన్న ఆరాటంతోనే. అదే ఆరాటం ఏపీ అసెంబ్లీలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు చూపించాలని అంతా కోరుతున్నారు. ఇక్కడ మరో మాట కూడా ఉంది. పోనీ జగన్ కి అసెంబ్లీకి వెళ్ళాలని అనిపించకపోతే ఆయనకు విపక్ష హోదా ఇచ్చేవరకూ వెళ్ళకూడదు అనుకుంటే ఆయన ఆగిపోవచ్చు. తన పార్టీ ఎమ్మెల్యేలను సభకు పంపించి ప్రజా సమస్యలను ప్రస్తావించేలా చూడవచ్చు. అచ్చం ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లుగానే ఎమ్మెల్యేలకు కూడా జగన్ చేసి అసెంబ్లీకి పంపవచ్చుగా సామీ అని అంటున్నారు అంతా.