జగన్ బాధ... వైసీపీ బాధ కాదా..!
అంటే.. జగన్ బాధను ప్రపంచ బాధ చేయాల్సిన, దాని నుంచి సింపతీని పిండాల్సిన అవసరం వైసీపీ కేడర్ పైనే ఉంది.
By: Tupaki Desk | 3 Nov 2024 12:30 PM GMTవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు ఎన్నడూ లేని పెద్ద కష్టమే వచ్చిన విషయం తెలిసిందే. గతంలోనూ ఆయన కష్టాలు పడ్డారు. కానీ, అప్పట్లో ఆయన వెంట నిలబడేందుకు తల్లి-చెల్లి వచ్చారు. సీబీఐ అరెస్టు చేస్తున్న సమయంలో లేక్ వ్యూగెస్ట్ హౌస్ వద్ద రోడ్డుపై కూలబడి ఆర్తనాదాలు చేశారు. ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన జైల్లో ఉంటే.. పాదయాత్ర చేశారు. ప్రచారం చేసి.. పార్టీ కోసం శ్రమించారు. అయితే.. ఇప్పుడు దానికి మించిన కష్టం వచ్చింది.
అదే.. జగన్ ఇప్పుడు ఆస్తుల వివాదాల్లో చిక్కుకున్నారు. ఆనాడు వెన్నంటి ఉన్న తల్లి-చెల్లి దూరమ య్యారు. మరోవైపు సర్కారు కూలిపోయి 11 స్థానాలకే పరిమితమయ్యారు. ఈ పరిణామం .. అసలు ప్రధాన ప్రతిపక్ష హోదానే ఆయనకు లేకుండా పోయింది. ఇది మరింత బాధ, ఆవేదన. కానీ, ఇప్పుడు తోడు ఎవరు? అంటే.. పార్టీ కేడర్, నాయకులు తప్ప.. వైసీపీ అధినేతకు మరో మార్గం, మరో మద్దతు కనిపించ డం లేదు.
అంటే.. జగన్ బాధను ప్రపంచ బాధ చేయాల్సిన, దాని నుంచి సింపతీని పిండాల్సిన అవసరం వైసీపీ కేడర్ పైనే ఉంది. అయితే.. ఖచ్చితంగా ఇప్పుడే.. ఆ కేడర్ కూడా దూరంగా ఉంటుండడం గమనార్హం. పలు జిల్లాల్లో వైసీపీ నాయకులు మౌనంగా ఉన్నారు. పార్టీ కేడర్ దూరంగా ఉంది. దీనికి కారణం.. అధి కారంలో ఉన్నప్పుడు తమకుఏమీ చేయలేదన్న వాదన, తమకు కనీసం దర్శనం కూడా ఇవ్వలేదన్న బాధ రెండూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే క్లిష్ట సమయంలో జగన్‌కు దూరంగా జరుగుతున్నారు. మరీ ముఖ్యంగా మన అనుకున్న నాయకులు, ఏరికోరి పదవులు ఇచ్చిన నాయకులు కూడా ఇప్పుడు జగన్ బాధను తమ బాధగా చూడలేక పోతున్నారు. నోరు తెరిచి మాట్లాడేందుకు.. ప్రజల్లో చర్చ పెట్టేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ``తగిన శాస్తి జరిగింది!`` అని పరోక్షంగా ఆనందిస్తున్నారో.. లేక, మన కెందుకులే అనుకున్నారో.. మొత్తానికి జగన్ బాధ.. వైసీపీ బాధ కాలేకపోవడం, దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లి సింపతీ రాళ్లను సంపాయించుకోవడంలో విఫలమయ్యారనేది పరిశీలకుల వాదన.