జనసేన కొత్త మూవ్..పిఠాపురం వర్మకు షాక్ ?
వర్మకు తెలియకుండా దానిని ఆయన తరఫున నియమించిన ఏజెన్సీ వారు అలా పోస్ట్ చేశారు అని కవరింగ్ ఇచ్చారు.
By: Tupaki Desk | 5 March 2025 5:00 AM ISTపిఠాపురంలో ఎదురులేని నేతగా ఎస్వీఎస్ఎన్ వర్మ ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినా రికార్డు మెజారిటీ సాధించాను అని అన్నది ఒకటి ఉంది. ఆయన అనుచరులలో అదే ఉంది. అయితే జనసేన గెలుపు వెనకాల తాను ఉన్నాను అంటూ ఇటీవల సోషల్ మీడియాలో వర్మ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ వచ్చి రచ్చ చేసి పారేసింది. ఆ తరువాత దానిని డిలిట్ చేశారు. వర్మకు తెలియకుండా దానిని ఆయన తరఫున నియమించిన ఏజెన్సీ వారు అలా పోస్ట్ చేశారు అని కవరింగ్ ఇచ్చారు.
అయినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఒకవైపు అలా ఉంటే అదే పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పెండెం దొరబాబుని జనసేన చేర్చుకుంటోంది. ఆయన బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. పైగా ఆయనకు కూడా నియోజకవర్గంలో పట్టుంది. దాంతో పిఠాపురం వర్మ సోషల్ మీడియా పోస్టుకు జనసేన ఇచ్చిన గట్టి రిటార్ట్ ఇది అని అంటున్నారు.
ఇది ఒక్కటే కాదని ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు చాన్స్ ఎంతవరకూ ఉంటుంది అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వర్మ పవన్ కి యాంటీగా పోస్టు పెట్టారు అన్నది రాజకీయంగా కాక రేపిన నేపధ్యంలో ఇపుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఏమి జరుగుతుంది అన్నది చర్చగా ఉంది.
జనసేన వర్గాలు కూడా వర్మ మీద ఆగ్రహంగా ఉన్న నేపధ్యం ఉందని అంటున్నారు. మరో వైపు వర్మకు ఎమ్మెల్సీ ఇస్తే ఆయన హవా పెరుగుతుంది అన్నది ఉంది. కూటమిలో కీలక భాగస్వామిగా పవన్ మాటకు చెల్లుబాటు ఉంటుంది. దాంతో వర్మ కెలుక్కుని మరీ పోస్టు ద్వారా మైనస్ చేసుకున్నారా అన్న చర్చ సాగుతోంది.
ఇంకో వైపు చూస్తే టీడీపీ తరఫున యువతకు ప్రాధ్యాన్యత ఇస్తారని సీనియర్లను పక్కన పెడతారు అని అంటున్నారు. ఇక సామాజికవర్గం పరంగా కూడా క్షత్రియులకు న్యాయం చేస్తున్న టీడీపీ వర్మ విషయంలో కాస్తా పక్కన పెట్టినా వచ్చిన ఇబ్బంది లేదని ఆలోచిస్తే కనుక ఆయనకు అవకాశాలు తగ్గుతాయని అంటున్నారు.
ఇక పిఠాపురంలో జనసేన బలపడుతోంది. పవన్ తన సొంత సీటుగా ఎప్పటికి దానిని ఉంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. టీడీపీ కూడా ఈ విషయంలో పెద్దగా అనేది అభ్యంతరాలు పెట్టేది ఉండకపోవచ్చు అని అంటున్నారు. మొత్తంగా చూస్తే వర్మ మంచిగా పనిచేసే నేత కానీ ఆయన సరైన సమయంలో వ్యూహాలు రచించలేక ఇబ్బంది పడుతున్నారా అన్నది చర్చగా ఉంది. సో వర్మకు ఎమ్మెల్సీ సీటు ఎంతెంత దూరం అన్న చర్చ కూడా దీనితోనే వస్తోందిట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.