కేటీఆర్ అరెస్టు తప్పదా..? ఏసీబీ ఏం చేయబోతోంది..?
కానీ.. ఇంతవరకు అరెస్ట్ విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు.
By: Tupaki Desk | 13 Dec 2024 7:30 PM GMTతెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ అరెస్ట్ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇదే ఇప్పుడు ట్రెండింగులోనూ ఉంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారంటూ గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ.. ఇంతవరకు అరెస్ట్ విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు. ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలిసింది.
కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ప్రభుత్వం నుంచి అప్పీల్ చేశారు. నెలన్నర రోజులుగా అది గవర్నర్ వద్దే పెండింగులో ఉండిపోయింది. తాజాగా.. దానికి గవర్నర్ నుంచి ఆమోదం లభించిందని, సంబంధిత ఫైల్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరిందని సమాచారం. ఈ క్రమంలో కేటీఆర్‌పై ఏ క్షణాన అయినా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదని ప్రచారం మరోసారి ఊపందుకుంది.
నాలుగేళ్లపాటు హైదరాబాద్ మహానగరంలో ఫార్ములా- ఈ కారు రేసు నిర్వహణకు సంబంధించి ఎఫ్ఈఓ, ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రైవేటు లిమిటెడ్‌తో కలిసి పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25 త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 10,11 తేదీల్లో నిర్వహించిన ఈ కార్ల రేస్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు వచ్చారు. అయితే ప్రమోటర్ ఏస్ నెక్ట్స్‌జెన్ సంస్థ ఆశించిన మేరకు ఆదాయం రాలేదు. దాంతో ఆ ప్రమోటర్ తప్పుకున్నారు. ఇక.. 2024 ఫిబ్రవరి 10న జరగాల్సిన రెండో దఫా ఈ కార్ రేసు నుంచి హైదరాబాద్ పేరును ఎఫ్ఈఓ తొలగించింది. అయితే.. అప్పటి మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ నిర్వహిస్తే హైదరాబాద్‌కు తలమానికంగా ఉంటుందని భావించారు. దాంతో 2024 ఫిబ్రవరిలోనూ హైదరాబాద్‌లోనే నిర్వహించాలని కోరారు. ప్రమోటర్ నిర్వహించే బాధ్యతలను నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండీఏ చూసుకుంటుందని ఎఫ్ఈఓకు చెప్పారు.
దాంతో రెండో దఫా ఈ కార్ రేసు 2023 అక్టోబర్‌లో ఎఫ్ఈఓతో పురపాలక సంఘం ఒప్పందం కుదుర్చుకుంది. రేస్ నిర్వహణకు రూ.100 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందులోభాగంగా హెచ్ఎండీఏ రూ.55 కోట్లను ఎఫ్ఈఓకు సైతం చెల్లించింది. అయితే.. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పురపాలక శాఖ ఒప్పందంలోని అంశాలను ఉల్లంఘించారంటూ ఎఫ్ఈఓ సెషన్ 10ను రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రూ.55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ ద్వారా చెల్లింపులు చేయడాన్ని సీరియస్‌గా తీసుకుంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెమో జారీ చేశారు.
ఆ మెమోకు అప్పటి పురపాలక శాఖ అధికారి అర్వింద్ కుమార్ వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే చెల్లింపులు చేశామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఏసీబీ విచారణ చేయాలంటూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ లేఖ రాశారు. దీనికి ప్రభుత్వం సైతం సమ్మతించింది. ఏసీబీ జేడీ స్థాయి అధికారి నేతృత్వంలోని అధికారులు ఫార్ములా ఈ రేసు అంశాన్ని తిరగదోడారు. ప్రత్యేక ప్రధాన కార్శదర్శి అర్వింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజినీరుతోపాటు గత ప్రభుత్వం పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. ఈ మేరకు ఇద్దరు అధికారులపై విచారణకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రజాప్రతినిధి అయిన కేటీఆర్‌పై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు లేఖ రాశారు. ఈ అంశంపై న్యాయ సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఏసీబీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని వేచి చూడాలి.