వచ్చే నెలలో డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ ?
చంద్రబాబు తరువాత ప్లేస్ లో ఉన్నారు ఆయనను భవిష్యత్తు నేతగా అంతా గురించి గౌరవిస్తున్నారు.
By: Tupaki Desk | 18 Jan 2025 11:06 AM GMTనారా లోకేష్ కి ప్రమోషన్ వస్తుందా అది కూడా కేవలం నెల రోజులలో జరుగుతుందా అంటే సాగుతున్న రాజకీయ పరిణామాలు బట్టి చూస్తే అలాగే ఉంది అంటున్నారు. నిజానికి నారా లోకేష్ ఈ రోజుకు టీడీపీలో నంబర్ టూ గా ఉన్నారు. ఆయన స్థానం అక్కడ అత్యంత కీలకం. చంద్రబాబు తరువాత ప్లేస్ లో ఉన్నారు ఆయనను భవిష్యత్తు నేతగా అంతా గురించి గౌరవిస్తున్నారు.
ఈ నేపధ్యంలో నారా లోకేష్ కి ప్రభుత్వంలో అంతే ప్రాధాన్యత దక్కుతోంది. జనసేన మంత్రులు ముగ్గురు బీజేపీ మంత్రి ఒకరు మినహాయించి మిగిలిన 19 మంది మంత్రులు సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా లోకేష్ కి చంద్రబాబు తో సరిసమానంగా గౌరవం ఇస్తున్నారు. ఆ మధ్యన లోకేష్ అమెరికా టూర్ కి వెళ్ళి ఏకంగా పద్దెనిమిది మంది కేబినెట్ మంత్రులు అంతా లోకేష్ ఇంటికి వెళ్ళి మరీ ఆయనను అభినందించి వచ్చారు.
అలా చూసుకుంటే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో కూడా అనధికారికంగా లోకేష్ నే నంబర్ టూ అని అంటారు. ఇక కూటమిలో టీడీపీ భారీ భాగస్వామి. ఆ పార్టీకి 134 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అంటే టోటల్ గా ఉన్న 175 సీట్లలో ఇది 76 శాతం గా చెప్పుకోవాలి.
ఈ విధంగా టీడీపీ కూటమిలో అత్యంత బలంగా ఉన్నపుడు నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావడానికి అడ్డేముంది. నిజానికి చూస్తే అది ఈపాటికే జరిగి తీరాల్సి ఉంది అని అంటున్నారు. పొరుగున ఉన్న తమిళనాడులో అయిన తొలిసారి సీఎం అయిన స్టాలిన్ తొలిసారి మంత్రి అయిన ఉదయనిధికి మూడేళ్ళ వ్యవధిలోనే డిప్యూటీ సీఎం గా ప్రమోషన్ ఇచ్చారు. మరి నాలుగు సార్లు ఏపీకి సీఎం చంద్రబాబు. లోకేష్ చూస్తే రెండోసారి మంత్రిగా బాధ్యతలు చూస్తున్నారు.
అలాంటిది లోకేష్ కి ఏమి తక్కువ అన్నది టీడీపీ తమ్ముళ్లలో వస్తున్న డిమాండ్ గా ఉంది. అంతే కాదు నారా లోకేష్ కుటుంబంలో కూడా ఇదే రకమైన డిమాండ్ వస్తోంది అని అంటున్నారు. ఒక విధంగా నారా కుటుంబం కోరికమేరకు లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ప్రమోషన్ గా దక్కనుంది అని అంటున్నారు.
ఇక ఈ నెలాఖరు నుంచి మాఘమాసం వస్తుంది. ఆ మీదట అన్నీ మంచి రోజులే. దాంతో ఫిబ్రవరి నెలలో ఒక మంచి ముహూర్తం చూసుకుని నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు అని అంటున్నారు. ఇదే విషయం టీడీపీలో అతి పెద్ద చర్చగా సాగుతోంది. ఒక విధంగా డిప్యూటీ సీఎం నారా లోకేష్ అవడం ఖాయమని కూడా ప్రచారం హోరెత్తుతోంది.
ఇదిలా ఉంటే టీడీపీ శ్రేణుల మూడ్ ఎలా ఉంది అనడానికి ఒక నిదర్శనంగా కడప జిల్లా సంఘటన చూడాలని అంటున్నారు. కడప జిల్లాలో ఎన్టీఆర్ వర్ధంతి వేళ అక్కడకి హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ అయిన శ్రీనివాసరెడ్డి ఇదే విషయం మీద బాబుకు రిక్వెస్ట్ చేశారు. లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయమని ఆయన కోరడం తో తమ్ముళు అంతా మద్దతు పలికారు.
ఇది తమ్ముళ్ల మనసులో ఏముందో అసలు టీడీపీ మదిలో ఏముందో కూడా తెలియచేసే ఉదంతంగా చూస్తున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ బహిరంగంగా ఈ విధంగా డిమాండ్ చేశారు అంటే కనుక కచ్చితంగా లోకేష్ డిప్యూటీ సీఎం అయి తీరుతారు అని అంటున్నారు.
ఇక నారా లోకేష్ కుటుంబం అంతా ఇదే కోరుకుంటున్నారు అని అంటున్నారు. చంద్రబాబు తరువాత నంబర్ టూ ప్రభుత్వంలో కూడా నారా లోకేష్ అన్నది జనాలకు పార్టీ జనాలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ గా వెళ్లాలీ అంటే డిప్యూటీ సీఎం గా లోకేష్ అవడమే బెటర్ అని అంటున్నారు
నిజానికి చంద్రబాబుకు నాలుగవ సారి సీఎం అయినా ఆయన గతంలో చూసిన అధికార వైభవమే ఇది అని, ఇంతకంటే ఏదీ లేదు అని అంటున్నారు. ఉమ్మడి ఏపీకే సీఎం గా తొమ్మిదేళ్ళ పాటు తిరుగులేని అధికారాన్ని చలాయించిన చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యారు అంటే అదంతా టీడీపీని చక్కబెట్టడానికి లోకేష్ ని ఎలివేట్ చేయడానికి అన్న మాట కూడా ప్రచారంలో ఉంది.
లోకేష్ కూడా గతంతో పోలిస్తే బాగా రాణిస్తున్నారు. ఇదే కరెక్ట్ సమయం అని ఆయనను ముందుగా డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేస్తే ఆ తరువాత సీఎం పదవికి ఆయన ఏ విధమైన ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా చేరుకుంటారు అని అంటున్నారు. మొత్తానికి మాఘ మాసంలో మంచి ముహూర్తంలో లోకేష్ డిప్యూటీ సీఎం అవుతారు అని అంటున్నారు.